బస్‌షెల్టర్లు నిర్మించరా?

ABN , First Publish Date - 2020-11-28T05:37:45+05:30 IST

బస్‌షెల్టర్లు నిర్మించరా?

బస్‌షెల్టర్లు నిర్మించరా?
కొత్తూర్‌లో ఫుట్‌పాత్‌పై వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులు

  • ప్రయాణికులు ఎక్కడం.. దిగడం రోడ్డుపైనే!
  • ఎండలో ఎండి.. వానలో తడుస్తున్న ప్రయాణికులు
  • ఆచ్ఛాదన ఏర్పాటుచేయని ఆర్టీసీ అధికారులు

కొత్తూర్‌: ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా సేవలందిస్తున్నామని ప్రకటన చేస్తున్న టీఎ్‌సఆర్‌టీసీ మండల కేంద్రాల్లో బస్టాండ్లు, గ్రామాల్లో బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయడం లేదు. ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సుల కోసం వేచిచూడాల్సి వస్తోంది. హైదరాబాద్‌కు, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండి.. పారిశ్రామికంగా, వ్యవసాయికంగా దినాదినాభివృద్ధి చెందుతున్న కొత్తూర్‌ మండల కేంద్రంలో నేటి వరకు బస్టాండు లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌, షాద్‌నగర్‌ ప్రాంతాలకు వెళ్లే బస్సులు రోడ్డు పక్కనే నిలుపుతున్నారు. దీంతో తరుచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి. మండల కేంద్రంలో బస్టాండు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో నాయకులు చేసే వాగ్దానాలు అమలు చేయడంలేదు. రాష్ట్రంలో పేరుగాంచిన దర్గాలో ఒకటైన హజ్రత్‌ జహాంగిర్‌పీర్‌ దర్గా ఇన్ముల్‌నర్వ శివారులో ఉంది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జేపీ దర్గాకు ప్రతీ అరగంటకో బస్సు వస్తుంది. ఇక్కడ కూడా బస్టాండ్‌ లేదు. అంతా రోడ్డే! దర్గాకు వచ్చే భక్తులతో పాటు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్యుపెన్సీ ఎక్కువగా ఉంటున్న ఈ రూట్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. సంబంధిత అధికారులు స్పందించి మండల కేంద్రంలో బస్టాండ్‌తో పాటు గ్రామాల్లో బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఆర్టీసీ అధికారులు బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలి

ప్రయాణికులు సమస్యలను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలో బస్టాండ్‌ ఏర్పాటు చేయాలి. కనీసం బస్‌షెల్టర్‌ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించాలి.

- శివాచారి, సామాజిక సేవ నాయకుడు, కొత్తూర్‌

ప్రమాదాలు జరుగుతున్నాయి

ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవేట్‌ వాహనాలు రోడ్లపై నిలబడుతుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోతుండడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కొత్తూర్‌లో బస్టాండ్‌ నిర్మించాలి.

- కార్తీక్‌రెడ్డి, యువకుడు, కొత్తూర్‌

Updated Date - 2020-11-28T05:37:45+05:30 IST