బస్సులు ఫుల్‌.. ప్రయాణికులు డల్‌!

ABN , First Publish Date - 2021-01-13T07:49:31+05:30 IST

ఈసారి సంక్రాంతికి ఊరెళ్లే హైదరాబాద్‌ నగర వాసులు సొంత వాహనాల్లో ప్రయాణానికే మొగ్గు చూపారు. దీంతో ఆర్టీసీతోపాటు, ప్రైవేటుట్రావెల్స్‌ బస్సులు చాలా వరకు ఖాళీగానే

బస్సులు ఫుల్‌.. ప్రయాణికులు డల్‌!

పెరిగిన సొంత వాహనాల వినియోగం

ఆర్టీసీ సంక్రాంతి అంచనాలు తలకిందులు

టార్గెట్‌ 4981.. ఇప్పటికి 1700 బస్సులు 

కరోనా భయంతో ఎక్కని ప్రయాణికులు 

గతం కంటే 60 శాతం తగ్గిన ‘స్పెషల్‌’

నేడు కూడా స్పెషల్‌ సర్వీసులు: రంగారెడ్డి ఆర్‌ఎం


హైదరాబాద్‌సిటీ/సికింద్రాబాద్‌/యాదాద్రి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఈసారి సంక్రాంతికి ఊరెళ్లే హైదరాబాద్‌ నగర వాసులు సొంత వాహనాల్లో ప్రయాణానికే మొగ్గు చూపారు. దీంతో ఆర్టీసీతోపాటు, ప్రైవేటుట్రావెల్స్‌ బస్సులు చాలా వరకు ఖాళీగానే దర్శనమిచ్చాయి. కరోనా భయంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో సగం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.  పండుగ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 12 వరకు తెలంగాణ, ఏపీ జిల్లాలకు 4,981 ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆర్టీసీ టార్గెట్‌గా పెట్టుకుంది. మంగళవారం సాయంత్రానికి 1,500 బస్సుల్నే నడప గలిగింది. అర్ధరాత్రి వరకు మరో 200 బస్సులు వెళ్తాయని అధికారులు చెబుతున్నారు.


గత నాలుగేళ్లుగా ప్రతి సంక్రాంతికి ప్రత్యేకంగా ఆర్టీసీ 5 వేల స్పెషల్‌ సర్వీసులను నడిపింది. ఈ ఏడాది పరిస్థితి తల్లకిందులైంది. పండుగకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో 300-400 ప్రత్యేక సర్వీసులు వెళ్లే అవకాశాలుంటాయని రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు. కాగా.. హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారులపై మంగళవారం తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. కాగా, సంక్రాంతి రద్దీ దృష్ట్యా నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ మధ్య ఈనెల 17న ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - 2021-01-13T07:49:31+05:30 IST