ఐటీ పార్కులో బిజినెస్‌ హబ్‌

ABN , First Publish Date - 2021-06-23T05:35:59+05:30 IST

రుషికొండ ఐటీ పార్కులో కొత్తగా ‘అంతర్జాతీయ బిజినెస్‌ హబ్‌’ అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ నిర్ణయిచింది.

ఐటీ పార్కులో బిజినెస్‌ హబ్‌
హిల్‌ నంబరు 3లో కేటాయించిన స్థలం

ఏపీఐఐసీ నేతృత్వంలో ప్రాజెక్టు

పీపీపీ విధానంలో నిర్మాణం

ఉద్యోగ అవకాశాలపై కొరవడిన స్పష్టత

పెద్దల చేతుల్లోకి మరో రూ.200 కోట్ల విలువైన భూమి?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రుషికొండ ఐటీ పార్కులో కొత్తగా ‘అంతర్జాతీయ బిజినెస్‌ హబ్‌’ అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ నిర్ణయిచింది. ఈ పార్కులోని హిల్‌ నంబరు-3లో 19 ఎకరాలు చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. అందులో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను మూడో పార్టీ ద్వారా ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. కానీ ఏదీ కలిసి రావడం లేదు. గతంలో ఈ కొండపై 25 ఎకరాలను కెనెక్సా ఐటీ కంపెనీకి కేటాయించారు. ఎకరాకు 200 మందికి చొప్పున ఐదు వేల మందికి ఉపాధి కల్పించాలని ఒప్పందం. ఆ కంపెనీ లక్ష్యం సాధించలేకపోయింది. ఆ స్థలాన్ని కంపెనీ యాజమాన్యం అంతర్జాతీయ కంపెనీ ఐబీఎంకు విక్రయించింది. ఉపాధి కల్పించలేదని, భూములు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని ఐబీఎంకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పటివరకు ఉపాధి ఒప్పందం గురించి తెలియని ఐబీఎం...అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేమని, పైగా అంత భూమి తమకు అవసరం లేదని చెప్పి 21 ఎకరాలు వెనక్కి ఇచ్చేసింది. అలా తిరిగి వచ్చిన స్థలాన్ని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


ముందుకువచ్చి వెళ్లిపోయిన ఏఎన్‌ఎస్‌ఆర్‌


చంద్రబాబునాయుడు సీఎంగా వున్న సమయంలో ఈ స్థలంలో 11 ఎకరాలు తీసుకొని అందులో ఐటీ కంపెనీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, కొత్త ఐటీ కంపెనీలు తీసుకురావడానికి అంతర్జాతీయ కంపెనీ ఏఎన్‌ఎస్‌ఆర్‌ ముందుకువచ్చింది. అక్కడ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ అభివృద్ధి చేయాలని భావించింది. కానీ అది ముందుకు సాగలేదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. 


సెంటినల్‌ టవర్స్‌ ప్రతిపాదన


అత్యంత ప్రాధాన్యం కలిగిన పార్కులో విలువైన స్థలం ఖాళీగా ఉండడంతో ఏపీఐఐసీ సెంటినల్‌ టవర్స్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ తరువాత ఆ సంస్థ కూడా మనసు మార్చుకొని ఆ టవర్స్‌ను హిల్‌ నంబరు-4కి మార్చుకుంది. దాంతో ఆ స్థలం మళ్లీ ఖాళీ అయింది.


జాయింట్‌ వెంచర్‌లో బిజినెస్‌ టవర్స్‌


రూ.200 కోట్ల విలువైన ఆ భూమిలో ఇప్పుడు ఏపీఐఐసీ జాయింట్‌ వెంచర్‌ కింద పీపీపీ విధానంలో బిజినెస్‌ హబ్‌ నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. ఫైనాన్షియల్‌ టెక్నాలజీకి సంబంధించి ఐటీ/ఐటీఈఎస్‌ సేవలు అందించే బహుళ జాతి కంపెనీలను ఆకర్షించేలా ఇక్కడ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ హబ్‌ నిర్మిస్తామని పేర్కొంది. అందులో స్టార్‌ బిజినెస్‌ హోటల్‌, చిన్న చిన్న సమావేశాలు, సభలు, ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి ‘మైస్‌’ సెంటర్లు, వ్యాపార కార్యకలాపాల కోసం ‘బిజినెస్‌ టవర్స్‌’ వుంటాయని పేర్కొంది. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలని కోరింది. దీనికి అవసరమైన డిజైనింగ్‌, ఇంజనీరింగ్‌, ఆర్థిక వనరుల సమీకరణ, నిర్మాణం, నిర్వహణ పనులన్నీ వారే చూసుకోవాలని స్పష్టంచేసింది. నెల రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. అయితే ఇందులో ఎక్కడా ఎంతమందికి ఉపాధి కల్పించాలనే అనే విషయం పేర్కొనలేదు. ఉపాధి కల్పించని కారణంగానే ఈ భూమిని వెనక్కి తీసుకున్నారు. మరి అలాంటప్పుడు కొత్త ప్రాజెక్టు వస్తే...అందులో తప్పనిసరిగా ఉపాధి ఎంతమందికి లభిస్తుందనే దానిపై అంచనాలు ఉండాలి. ఒప్పందం చేసుకోవాలి. కానీ అటువంటిదేమీ లేకుండా ప్రకటన ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీపీపీలో ఇది కూడా వైసీపీ పెద్దలకు అప్పగించడానికే ఈ ప్లాన్‌ వేశారా? అని ఐటీ వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.

Updated Date - 2021-06-23T05:35:59+05:30 IST