కరోనాతో వస్త్ర వ్యాపారి మృతి.. భార్య, కుమార్తెకు పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-01T14:36:22+05:30 IST

కరోనా మహమ్మారి ముషీరాబాద్‌ పరిధిలోని రాంనగర్‌ దయారామార్కెట్‌లో వస్త్రాల దుకాణం నిర్వహిస్తున్న

కరోనాతో వస్త్ర వ్యాపారి మృతి.. భార్య, కుమార్తెకు పాజిటివ్

  • గాంధీ ఆస్పత్రిలో భార్య, చిన్న కూతురు
  • హోంక్వారంటైన్‌లో పెద్దకూతురు
  • అంత్యక్రియలు పూర్తి చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది 

హైదరాబాద్/రాంనగర్‌ : కరోనా మహమ్మారి ముషీరాబాద్‌ పరిధిలోని రాంనగర్‌ దయారామార్కెట్‌లో వస్త్రాల దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి(60)ని బలితీసుకుంది. ఆయనకు పదిరోజుల క్రితం జ్వరం రావడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా, మూడు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. అతనికి గాంధీలో చికిత్స అందించారు. దీంతో అతని ప్రైమరీ కాంటాక్ట్‌ సభ్యులైన భార్య, ఇద్దరు కుమార్తెలకు పరీక్షలు నిర్వహించారు. భార్య, చిన్న కూతురికి పాజటివ్‌ వచ్చింది. వీరిద్దరిని గాంధీలో అడ్మిట్‌ చేశారు. పెద్ద కూతురును హోమ్‌ క్వారంటైన్‌లో పెట్టారు. ఇదిలా ఉంటే గాంధీలో చికిత్స పొందుతున్న వ్యాపారి ఆదివారం తెల్లవారుజామున ముృతి చెందాడు. అతని మృతదేహాన్ని భార్య, చిన్న కూతురుకు, పెద్దకూతురుకు, అన్నదమ్ములతో పాటు మరికొద్దిమంది బంధువులకు ఆదివారం ఉదయం గాంధీ మార్చురీ వద్ద ముషీరాబాద్‌ పోలీసులు చూసే అవకాశాన్ని కల్పించారు. 


అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుటుంబసభ్యులకు పాజిటివ్‌రావడంతో గాంధీలో ఉన్నారు. క్వారంటైన్‌లోఉన్న కూతురు ఏమీ చేయలేనిస్థితిలో ఉండడంతో బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆతని అంత్యక్రియలు ఎర్రగ డ్డ ఈఎ్‌సఐ వద్ద గల శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వహించారు. వ్యాపారి మృతి దయారామార్కెట్‌లోని స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది.


ఈ కేసును ముషీరాబాద్‌ సీఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్‌ఐ సామ్యానాయక్‌ దర్యాప్తు చేస్తున్నారు. అతని ఇంటి పరిసర ప్రాంతాలను కట్టడిచేసి శానిటైజ్‌ చేసి, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పరీక్షలు చేశారు.  వ్యాపారి చిన్నకూతురు 8వ తేదీ నుంచి జరిగే పదోతరగతి పరీక్షలకు హాజరు అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ విద్యా  సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

Updated Date - 2020-06-01T14:36:22+05:30 IST