పంచాయతీలో రచ్చ!

ABN , First Publish Date - 2021-06-20T04:56:38+05:30 IST

కరోనా వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వార్డు సభ్యుడిని అధికార పార్టీ నేతలు ఏకంగా పంచాయతీ సమావేశానికి తీసుకువచ్చి అందరిలో అలజడి రేపారు. ఇందుకు సంబంధించిన వివరాలివి.

పంచాయతీలో రచ్చ!
సమావేశ మందిరంలో కొవిడ్‌ సోకిన వార్డు సభ్యుడు (ముఖానికి గ్లాసు కలిగిన వ్యక్తి)

పాలకవర్గ సమావేశానికి కొవిడ్‌ సోకిన వార్డు సభ్యుడ్ని తీసుకువచ్చిన అధికార పార్టీ నాయకులు 

సర్పంచ్‌తో పాటు పలువురు సభ్యుల నిలదీత


మాకవరపాలెం, జూన్‌ 19: కరోనా వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వార్డు సభ్యుడిని అధికార పార్టీ నేతలు ఏకంగా పంచాయతీ సమావేశానికి తీసుకువచ్చి అందరిలో అలజడి రేపారు. ఇందుకు సంబంధించిన వివరాలివి.


మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం పంచాయతీ సర్పంచ్‌ పోతల రామలక్ష్మి శనివారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు ఐదుగురు వార్డు సభ్యులు టీడీపీ బలపరిచినవారు గెలుపొందగా, వైసీపీ మద్దతుతో ఏడుగురు విజయం సాధించారు. అయితే వైసీపీ మద్దతుతో గెలుపొందిన రెండో వార్డు సభ్యుడు పొలిరెడ్డి సన్నిబాబు కరోనా సోకడంతో ఈ నెల 15న అనకాపల్లి ఆస్పత్రిలో చేరారు. శనివారం పంచాయతీ సమావేశంలో విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ కాలువల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకులు తమ సభ్యులు ఆరుగురే వుండడంతో...మెజారిటీ లేకపోతే ఏం జరుగుతుందోననే ఉద్దేశంతో  అనకాపల్లి ఆస్పత్రిలో వున్న వార్డు సభ్యుడ్ని పంచాయతీ సమావేశానికి తీసుకువచ్చేశారు. కొవిడ్‌ సోకిన వ్యక్తిని సమావేశానికి ఎలా తీసుకువస్తారని  సర్పంచ్‌ రామలక్ష్మితో పాటు పలువురు వార్డు సభ్యులు నిలదీశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నాయకులు సదరు వార్డు సభ్యుడిని తిరిగి కారులో అనకాపల్లి తరలించారు. అనంతరం పంచాయతీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు సర్పంచ్‌ ప్రకటించారు. ఇదిలావుంటే, ఆస్పత్రిలో వున్న కరోనా రోగిని ఇక్కడికి ఎలా తీసుకు రాగలిగారన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-06-20T04:56:38+05:30 IST