Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిలువు దోపిడీ

తేమ సాకుతో తక్కువ ధరకే ధాన్యం కొనుగోళ్లు

మద్దతు ధర రూ.1450... ఇస్తున్నది రూ.1200

ఆర్‌బీకేల ద్వారా మిల్లులకు ట్యాగింగ్‌ లేదు


రైతులను పాత కష్టమే పదేపదే వెంటాడుతోంది. అకాల ప్రకృతి వైపరీత్యాలు చేతికొస్తుందనుకున్న పంటను నిలువునా ముంచేస్తున్నాయి. ఒకవేళ ఈ కష్టాలన్నింటినీ అధిగమించి పంటను దక్కించుకున్నా, తేమ సాకుతో తక్కువ ధర చెల్లిస్తారు మిల్లర్లు, వ్యాపారులు. మద్దతు ధర ప్రకటించి, ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాటలకే పరిమితమవుతుంది. దీంతో పెట్టిన పెట్టుబడి గిట్టుబాటుకాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : ప్రతి ఏడాదీ మాదిరిగానే ఈ  సంవత్సరం కూడా రైతులు ధాన్యానికి సరైన మద్దతు ధర లభించక నష్టపోతున్నారు. బస్తా ధాన్యం రూ.1440కు కొనాల్సి ఉండగా, రూ.1150 నుంచి 1200 వరకే ధర పలుకుతోంది. దీంతో రైతులు కల్లం వద్దే బస్తాకు రూ.250 నష్టపోవాల్సి వస్తోంది. ఎరువులు, పురుగు మందులు, భూమి కౌలు, కూలిరేట్లు పెరిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి, వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎలాగోలా పంటను కోసి, విక్రయిద్దామంటేప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదని రైతులు దిగాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధనలు రైతులను నష్టాలబాట పట్టిస్తున్నాయి. నవంబరు నెలంతా తుఫానులతో సతమతమైన రైతులను డిసెంబరు నెలలోనూ వాయుగుండం భయం వెంటాడుతూనే ఉంది. ఏ క్షణంలో వర్షం రూపంలో విపత్తు మీదికి వస్తుందోననే భయం రైతులను వెంటాడుతోంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఽధాన్యం కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.  


తేమ శాతం పేరుతో ధరలో కోత 

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 2.38 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. సుమారు 12 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది వ్యవసాయశాఖ అంచనా. నవంబరులో కురిసిన భారీవర్షాలు, వీచిన బలమైన గాలుల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్నవరి పైరు నేల వాలింది. దీంతో కోతలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నేలవాలిన పైరును కోయాలంటే ఎకరాకు రూ.6 వేల నుంచి 7,500 వరకు కూలీ తీసుకుంటున్నారు. కట్టివేత, కుప్పనూర్పిళ్ల ధరలు అమాంతం పెరిగాయి. ఇంత ధర చెల్లించి, కోతకోసి కుప్పనూర్చే బదులు వరికోత యంత్రాలద్వారా కోతలు పూర్తి చేసి, ధాన్యాన్ని విక్రయించడం మేలనే భావనతో రైతులు ప్రయత్నిస్తున్నారు. దీనిని సాకుగా తీసుకుని వ్యాపారులు, మిల్లర్లు ధాన్యం ధరలో కోత పెడుతున్నారు. ధాన్యంలో 17 శాతం తేమ ఉంటేనే కొనుగోలుకు అవకాశం ఉంటుందని మిల్లర్లు, ఆర్‌బీకేలలో ఉన్న సిబ్బంది చెబుతున్నారు. భారీవర్షాలు కురిసి పొలంలోని నీరు ఇప్పటి వరకు బయటకు పోలేదు. యంత్రాలతో కోసిన ధాన్యంలో  25 నుంచి 28 శాతం వరకు తేమ ఉంటోంది. దీంతో 75 కిలోల బస్తాకు మద్దతు ధర  రూ.1440 ఇవ్వాల్సి ఉండగా, వ్యాపారులు, మిల్లర్లు  తేమ శాతాన్ని సాకుగా చూపి, రూ.1150 నుంచి 1200 వరకే ధర చెల్లిస్తావని ఖరాఖండిగా చెబుతున్నారు. బస్తాకు రూ.250 ధర తగ్గుతుండటంతో ఎకరానికి ఏడు వేలకు పైగా రైతులు నష్టపోతున్నారు. భూమినే నమ్ముకున్న రైతులకు నష్టాలు మిగులుతుండగా, మిల్లర్లు, వ్యాపారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు.


అటు వాతావరణం.. ఇటు నిబంధనలు

వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. కోతలు పూర్తి చేసినా, పొలంలోని ధాన్యం తడవకుండా భద్రపరుచుకునేందుకు జాగాలేక రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. నవంబరు నెలంతా వాయుగుండాలు వెంటాడాయి. ఇప్పుడు మరో తుఫాను భయం.  ఇలాంటి పరిస్థితుల్లో  ఽధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాల్సిన అధికారులు తాము సూచించిన నిబంధనలు పాటించాల్సిందేనని భీష్మించుకుని  కూర్చుంటున్నారు. ఆర్‌బీకేల ద్వారా మాత్రమే ఽధాన్యం కొనుగోలు చేయాలని చెబుతూనే, ఆర్‌బీకేలకు, మిల్లులకు ఽధాన్యం కొనుగోలుకు సంబంధించిన ట్యాగింగ్‌ ప్రక్రియను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే చెక్‌పోస్టుల వద్ద దోపిడీ మరో రూపంలో ఉంటోంది. ధాన్యం రవాణా సమయంలో పెడన చెక్‌పోస్టు వద్ద లారీకి, ట్రాక్టరుకు లెక్కగట్టి, ముక్కుపిండి ముడుపులు వసూలు చేస్తున్నారని ఆయా ప్రాంతాల రైతులు చెబుతున్నారు.  

Advertisement
Advertisement