రియల్‌ సెటిల్‌మెంట్లకేనా పిస్తోల్‌ కొనుగోలు?

ABN , First Publish Date - 2022-01-20T05:12:46+05:30 IST

గన్‌ కల్చర్‌పై పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. రౌడీ షీటర్‌ సాజిద్‌ వద్ద లభించిన పిస్తోల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సెటిల్‌మెంట్‌ల కోసమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

రియల్‌ సెటిల్‌మెంట్లకేనా పిస్తోల్‌ కొనుగోలు?
పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్తోలు

- రౌడీషీటర్‌కు కొనుగోలు చేయించింది ఎవరు

- కూపీలాగుతున్న పోలీసులు

- ఓ వీఆర్వో ఫాంహౌజ్‌లోనే పిస్తోల్‌కు బీజం

- మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

- కోర్టు నుంచి ఆర్డర్‌ తీసుకుని రౌడీషీటర్‌ను విచారించనున్న పోలీసులు


కామారెడ్డి, జనవరి 19: గన్‌ కల్చర్‌పై పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. రౌడీ షీటర్‌ సాజిద్‌ వద్ద లభించిన పిస్తోల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సెటిల్‌మెంట్‌ల కోసమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భూ కబ్జాలపై పూర్తి అవగాహన ఉన్న ఓ మాజీ వీఆర్వోతో చేతులు కల్పిన రౌడీషీటర్‌ సాజిద్‌కు పిస్తోల్‌ను కొనుగోలు చేయించి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పిస్తోల్‌ను సాజిదే కొనుగోలు చేశాడా లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేసి ఇచ్చారా అనే విషయం విచారణలో తేలనుంది. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి గట్టెక్కాలని భావించిన రౌడీషీటర్‌ సాజిద్‌కు ఊహించని విధంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పిస్తోల్‌ను కొనుగోలు చేసిన వ్యక్తిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్న ఓ మాజీ వీఆర్వోతో పాటు మరికొందరి భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్‌ల కోసం సాజిద్‌ను ఉపయోగించుకోవాలని భావించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న కొందరు ఓ ఫాంహౌజ్‌లో దావత్‌ చేసుకుని పిస్తోల్‌కు పురుడు పోసినట్లు తెలుస్తోంది. పిస్తోల్‌ పట్టుకుని వచ్చి సెటిల్‌మెంట్‌లకు, బెదిరింపులకు పాల్పడేవిధంగా సాజిద్‌ను సిద్ధం చేయగా పర్సంటేజీలుగా పంచుకునేందుకు ఫాంహౌజ్‌లోనే ఒప్పందం చేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి పట్టణ శివారులోని కొన్ని రియల్‌ ఎస్టేట్‌ భూములలో బెదిరింపులకు పాల్పడి సెటిల్‌మెంట్‌లు చేయడంలో సాజిద్‌కు ఎంతో అనుభవం ఉందని గ్రహించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొందరు పిస్తోల్‌ను వాడితే సెటిల్‌మెంట్‌లు తొందరగా జరుగుతాయనే ఉద్దేశ్యంతోనే సాజిద్‌కు పిస్తోల్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తెచ్చి ఇచ్చారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఉద్యోగాన్ని లెక్క చేయకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కలిసి రావడంతో ఓ వీఆర్వో సస్పెండ్‌ కావడంతో పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపైనే ఉంటూ భూ కబ్జాలలో ఉన్న వాటిని తక్కువ ధరలో కొని అమ్మకాలు సాగిస్తూ ఎవరైన ఎదురుగా వచ్చిన వారికి సెటిల్‌మెంట్‌లతో ఒప్పుకొకుంటే పిస్తోల్‌ పెట్టి బెదిరించేందుకు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం భారీగా సాగడంతో రెండు సార్లు పోస్టింగ్‌ ఆర్డర్‌ వచ్చినా కూడా ఉద్యోగం వైపు వెళ్లకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్నే కొనసాగిస్తూ సెటిల్‌మెంట్‌లకు సంబంధించిన భూములను తీసుకుని అమ్మడం వంటి కార్యక్రమాలను తన ఫాంహౌజ్‌ నుంచే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్‌ వ్యాపారంలోనే సాజిద్‌ కలిసినట్లు తెలుస్తోంది. రెండు, మూడు సార్లు సిట్టింగ్‌లతో దగ్గరైన సాజిద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పడంతోనే సాజిద్‌కు పిస్తోల్‌ను కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పిస్తోల్‌ వ్యవహారంలో పోలీసులు మరో ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గన్‌ కల్చర్‌ ఉండకుండా తొందరగానే రౌడీషీటర్‌ వద్ద లభించిన పిస్తోల్‌ కేసును తేల్చాలనే ఉబలాటంలో పోలీసులు ఉన్నారు. ఎంత తొందరగా కేసును ఛేదించి బయటపెట్టాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో కేసును ఛేదించి పిస్తోల్‌తో సంబంధం ఉన్న వారినందరిని పట్టుకుని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే రౌడీషీటర్‌ సాజిద్‌ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముందుగా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన సాజిద్‌ ప్రత్యేక విచారణలో ఏ విధంగా పోలీసులకు సహకరిస్తాడో లేడో అనే విషయం తెలియాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లోనే కేసును ఛేదించేందుకు పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కోర్టు నుంచి ఆర్డర్‌ తీసుకుని రిమాండ్‌లో ఉన్న రౌడీషీటర్‌ సాజిద్‌ను విచారణ కోసం తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-20T05:12:46+05:30 IST