కొను‘గోడు’

ABN , First Publish Date - 2021-11-29T06:48:05+05:30 IST

ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి ఆగమాగంగా మారింది. విత్తనం వేయాలన్నా.. పండించిన పంట అమ్ముకోవాలన్నా..నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అసలే పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి ఆందోళన చెందుతున్న

కొను‘గోడు’
శనివారం కిసాన్‌చౌక్‌లో ఆందోళన చేస్తున్న పత్తి రైతులు

పంట పండించాలన్నా.. సాగు చేయాలన్నా.. విక్రయించాలన్నా రైతులకు తప్పని తిప్పలు
పత్తి ధర తగ్గింపుతో మరింత గందరగోళం
అసలే రోజురోజుకూ పెట్టుబడి పెరుగుతోందని ఆవేదన
కుమ్మక్కైన పత్తి వ్యాపారులు, సంబంధిత అధికారులు!!
అయినా.. పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు
ఈ దఫా గరిష్టంగా పలికిన క్వింటాలు పత్తి ధర రూ.8,540

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 28: ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి ఆగమాగంగా మారింది. విత్తనం వేయాలన్నా.. పండించిన పంట అమ్ముకోవాలన్నా..నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అసలే పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి ఆందోళన చెందుతున్న రైతుకు అండగా నిలవాల్సిన వారే మార్కెట్‌లో అన్యాయం చేస్తున్నారు. దీంతో జిల్లాలో పత్తిని అమ్ముకోవాల్సిన రైతు అధికారులు, వ్యాపారుల చుట్టు తిరుగుతూ.. మార్కెట్‌లో నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో పత్తి ధర క్వింటాలుకు కొనుగోళ్లు ప్రారంభం రోజున రూ.7,970 ఉండగా క్రమంగా రూ.8100లకు పైగా కొనసాగింది. అయితే రైతుల వద్ద పత్తి ఉత్పత్తి తగ్గుతున్న కొద్ది క్వింటాలు పత్తి ధర పెంచిన వ్యాపారస్థులు కొన్ని రోజుల పాటు రూ.8130 నుంచి చెల్లించినా.. తిరిగి ఒక్కసారిగా రైతులు మార్కెట్‌కు పత్తిని తీసుకొస్తున్న క్రమంలో రూ.8130 నుంచి రూ.7900, రూ.7800, రూ.7700 ఇలా తగ్గిస్తూ చెల్లించడం మొదలు పెట్టారు. దీంతో పత్తిపైనే ఆశలు పెట్టుకున్న జిల్లా రైతులు అన్నమో రామచంద్రా అంటూ గిట్టుబాటుకాకపోయినా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెల్లించిన ధరనే తీసుకుంటూ అన్నదాత ఒకపక్క కూలీల ఖర్చులు, పెట్టుబడి పెరిగి కుదేలవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో కొంతమంది రైతులు జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లి  మహారాష్ట్ర సరిహద్దుల్లో పత్తిని విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం జిల్లాలో పత్తి క్రమంగా తగ్గుతున్న తరుణంలో ఉన్న కాస్త పత్తిని అత్యధిక ధరకు అమ్ముకుందామన్న అన్నదాత ఆశలు ఆడియాశలవుతున్నాయి.
క్రమంగా తగ్గుతున్న పత్తి ధర
ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులో గత నెల 25న ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు మొదట క్వింటాలుకు రూ.7,970 ప్రైవేట్‌ వ్యాపారులు వేలం పాట ద్వారా నిర్ణయించారు. ఈ యేడాది ప్రభుత్వ మద్దతు ధర రూ.6,050 ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి బేల్‌కు మంచి డిమాండ్‌ ఉండడం తో ధర పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో క్వింటాలు పత్తి ధర రూ.7970 నుంచి రూ.8500, రూ.8540 ఇలా పెరుగుతూ వచ్చింది. ధరను చూసి ఆశపడిన అన్నదాతకు కొద్దిరోజుల్లోనే వ్యాపారస్తులు పత్తి ధరను తగ్గించి రైతులను ఆగమాగం చేశారు. క్రమంగా వ్యాపారులు, సంబంధిత అధికారులు కుమ్మకై పత్తి ధర ను తగ్గించి రైతులను తీరని అన్యాయం చేశారు. దీంతో శనివారం జిల్లా కేంద్రానికి  500 పైచిలుకు పత్తి బండ్లు రావడంతో వ్యాపారస్థులు అంతకుముందు రూ.8130 ఉన్న ధరను ఒక్కసారిగా రూ.170 తగ్గించారు. దీంతో పత్తి రైతులు ఒక్కసారి ఆగ్రహానికి గురై మార్కెట్‌కు సుమారు నాలుగు గంటల పాటు తాళం వేసి ఆందోళన చేశారు. రైతులను ఆదుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్లారంటూ నినాదాలు చేశారు. దీంతో కిసాన్‌చౌక్‌లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత నాలుగేళ్ల కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చేలా రైతులంతా ఐక్యమత్యంతో దుకాణ సముదాయాలను మూసివేయించి ఆందో ళనను ఉధృతం చేశారు. ఇదే క్రమంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఓ అన్నదాత ఆత్మహత్యకు యత్నించడం జిల్లాలో కలకలం సృష్టించింది.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
పత్తి కొనుగోళ్లకు ముందు తామున్నామని, అధైర్యపడొద్దని, అన్నదాతను ఆదుకుంటామని ప్రకటనలు చెప్పే ప్రజాప్రతినిదులు ఒక పక్క ధర తగ్గుతున్నా, మరోపక్క పత్తి రైతులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. రైతుకు చెల్లించిందే ధరగా తీసుకుంటూ ఆవేదన చెందుతున్నా.. ఏఒక్క ప్రజాప్రతినిధి కూడా తమను పట్టించుకోవడం లేదని పలువురు పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు మీకు మేమున్నామని చెప్పే నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడేమయ్యారంటూ వారు ప్రశ్నిస్తునారు.  
అధికారులు, వ్యాపారుల కుమ్మక్కు
జిల్లాలో రైతు పండించిన ప్రతీ పంటను మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేయాలని, కొనుగోళ్లకు ముందే సమావేశాలు నిర్వహించే అధికారులు వ్యా పారులతో కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర  చెల్లించకుండా వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన అధికారులు సైతం వ్యాపారులతో చేతులు కలుపుతున్నారని విమర్శిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల ప్రారంభం రోజు నుంచి మార్కెట్‌ చుట్టు తిరిగే అధికారులు పత్తా లేకుండా పోయారని వాపోతున్నారు. రైతులను పట్టించుకోని ఈ అధికారులు వ్యాపారులతో కుమ్మకై అన్నదాతకు అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
పేరుకే అధికారులు.. పట్టించుకున్న పాపాన పోలేదు
: దండు మధుకర్‌, రైతు, తంతోలి
రైతులకు తామున్నామని చెప్పడమే తప్ప.. ఎవరూ పట్టించుకునే వారు లేరు. ఉన్న అధికారులు పేరుకే తప్ప, రైతుల కు అన్యాయం జరిగితే సమయానికి ఒక్కరు రా రు. ప్రస్తుతం పత్తి ధర పడిపోతున్న తరుణంలో రై తులు 4గంటల పాటు రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకునే దిక్కేలేకుండా పోయిం ది. అధికారులు, వ్యాపారులు రైతులకు అన్యాయం చేస్తున్నారు.

Updated Date - 2021-11-29T06:48:05+05:30 IST