విశాఖ ఉక్కు నేడు భారతీయుల హక్కు!

ABN , First Publish Date - 2021-08-14T06:07:48+05:30 IST

కేంద్రప్రభుత్వరంగ సంస్థ కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు, ముఖ్యంగా ఒడిశాకు చెందిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. అందువలన ఈ కర్మాగారం గురించి కేంద్ర.....

విశాఖ ఉక్కు నేడు భారతీయుల హక్కు!

కేంద్రప్రభుత్వరంగ సంస్థ కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు, ముఖ్యంగా ఒడిశాకు చెందిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. అందువలన ఈ కర్మాగారం గురించి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాల దృష్టితో, జాతి సమైక్యత దృష్టితో ఆలోచించాలి. అలాగే జాతీయ రాజకీయ పక్షాలతోపాటు ఒడిశా, బిహార్‌, బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా విశాఖ ఉక్కును జాతి సంపదగా గుర్తించి కాపాడుకోవడానికి కృషి చేయాలి. ఇప్పటికే ఉద్యమిస్తున్న వారికి మద్దతుగా నిలవాలి. 


స్వాతంత్య్ర సమరయోధులు, లోక్‌సభ పూర్వ సభ్యులు తెన్నేటి విశ్వనాథం జయంతి సభ (1986)లో, పూర్వ శాసన సభ్యులు, అధికార భాషా సంఘం తొలి అధ్యక్షులు వావిలాల గోపాల కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సభలో ఆయన ప్రసంగిస్తూ ‘‘1966లో విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో, ఎంతో స్ఫూర్తితో, ప్రాణత్యాగాలు సైతం చేసి పోరాడి విశాఖ ఉక్కును సాధించుకున్నాం. అయితే పోరాటంలో ముందు వరుసలో పాల్గొన్న మాలాంటి వాళ్ళకు ఈనాటి పరిస్థితులను చూస్తుంటే, ‘మా తరం తప్పు చేసిందేమో’ అన్న ఆవేదన కలుగుతుంటుంది. ఎందుకంటే, మేం ఆశించిన ఫలితాలు ఆంధ్రులకు, ముఖ్యంగా నిర్వాసితులకు దక్కలేదు. ఈనాటికీ వేలాదిమంది నిర్వాసితులు ఉద్యోగావకాశాలు పూర్తిగా లభించక ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులను చూస్తుంటే, తమ భూముల్ని త్యాగం చేసిన చిన్న సన్నకారు రైతులు ఈనాడు కూలీలుగా బతుకులు వెళ్లదీస్తున్న దుస్థితి చూస్తుంటే... గుండె చెరువవుతోంది. ఆంధ్రులలో ఆనాటి సమైక్యత, పట్టుదల, పోరాట స్ఫూర్తి మళ్ళీ చూడలేం. విశాఖ ఉక్కు బదులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పోరాడి సాధించుకుని ఉంటే, తెలుగువారి జీవితాలు మరోలా వుండేవి...’’ అని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి భాషా సంస్కృతులు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి అపార అవగాహన కలిగిన త్యాగధనుడు వావిలాల ఆనాడు వ్యక్తం చేసిన ఆవేదన ఈనాటికీ అక్షర సత్యంగానే కొనసాగుతోంది.


విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపన ఫలితాలు స్థానికులకు, తమ భూములు కోల్పోయి నిర్వాసితులకు తగినంత దక్కలేదన్నది చేదు నిజం. ప్రస్తుతం విశాఖ ఉక్కును కాపాడుకునే ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ప్రముఖ నాయకుడూ, ‘ఇంకా ఎనిమిది వేల అయిదు వందల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది...’ అని ప్రస్తావించటం తెలుగుజాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. విశాఖ ఉక్కు కోసం చేసిన త్యాగాలలో ఏమాత్రం భాగస్వామ్యం లేకపోయినా కేవలం సాంకేతిక అర్హతలతో ఇక్కడ ఉద్యోగాలు పొందినవారిలో ఒక్క శాతం కూడా ఈనాటికీ ఉద్యోగాలు లభించని నిర్వాసితుల పట్ల శ్రద్ధ చూపలేదు.


ఈ కర్మాగారాన్ని సాధించుకునేందుకు జరిగిన ఉద్యమ కాలంలో, ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అన్న నినాదం సరైనదే కావచ్చు. కానీ ఈనాడు, ఆ కర్మాగారాన్ని పరాధీనం చేయడానికి కంకణం కట్టుకున్నామని కేంద్రప్రభుత్వం  కుండ బద్దలుకొడుతున్నప్పుడు, ఆ నినాదం సరైనది కాదు. ఈ విషయాన్ని ఉద్యమనేతలు, ఉక్కు ఉద్యోగులు, అధికారులు, కార్మికులు గుర్తించాలి. ఎందుకంటే, ఈ కర్మాగారం నవరత్నాలలో ఒకటిగా పేరుమోసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. ‘దీనిపై పూర్తి హక్కు కేంద్రానిదే’ అని, ఉక్కు బ్లాస్ట్‌ ఫర్నేస్‌-2 ప్రారంభోత్సవ సభలో నాటి ప్రధాని వి.పి.సింగ్‌ పరోక్ష సంకేతాలిచ్చిన సంగతి చాలామందికి గుర్తుండి ఉంటుంది. నాటి వేదికపైన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికే సరైన స్థానం లభించలేదు. శాసన సభ, లోక్‌సభ వేదికగా ఉక్కు ఉద్యమం చేసిన (కర్మాగారం ప్రారంభోత్సవం నాటికి సజీవులుగా వున్న) నాటి ఉక్కు ఉద్యమ సారథులు వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతు లచ్చన్న, మోటూరు హనుమంతరావు, జె. ఈశ్వరిబాయి, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వై.వి.కృష్ణారావు వంటి వారికి కానీ, విశాఖ ఉక్కు సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న పత్తి శేషయ్య, విశాఖ ఉక్కు ఉద్యమం నాటికి సీనియర్‌ జన సంఘ్ నాయకులు పి.వి.చలపతిరావు వంటి వారికి కానీ ఆ సందర్భంలో కనీస గౌరవం దక్కలేదు.


జనతాపార్టీ అగ్రనేతగా తెన్నేటి విశ్వనాథం విజ్ఞప్తి మేరకు, జనతా ప్రభుత్వంలో ఉక్కుశాఖామంత్రి బిజూపట్నాయక్‌ (ఒడిశా) వెయ్యికోట్ల రూపాయలను ఉక్కు నిర్మాణం కోసం కేటాయించారు. దాంతో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అదే ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉక్కుశాఖామంత్రి హయాంలో నేడు విశాఖ ఉక్కు విక్రయానికి, లేదా మూసివేయడానికి పూనుకుంటున్నారంటే ఏమనుకోవాలి?


ఒకనాడు రూర్కేలా, భిలాయ్‌ ఉక్కు కర్మాగారాల్లో ఎందరో తెలుగువారు ఉన్నతాధికారులుగా విధులు నిర్వర్తించారు. కానీ వారు ఏనాడూ ప్రాంతీయ, రాగద్వేషాలతో వ్యవహరించలేదు. కానీ, ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న విశాఖ ఉక్కులో అనేకసార్లు ఒడిశాకు చెందిన ఉన్నతాధికారుల హయాంలో స్థానికులైన వారు వివక్షను ఎదుర్కొన్నారు. దాని పరిష్కారం కోసం పరిశ్రమ లోపలి తెలుగువారు ప్రయత్నించటమేగానీ, ఏనాడూ తెలుగు సమాజం, తెలుగు పాలకులు స్పందించిన దాఖలాలు లేవు.


కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు, ముఖ్యంగా ఒడిశాకు చెందిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. అందువలన ఈ కర్మాగారం గురించి కేంద్రప్రభుత్వం దేశ ప్రయోజనాల దృష్టితో, జాతి సమైక్యత దృష్టితో ఆలోచించాలి. అలాగే జాతీయ రాజకీయ పక్షాలతోపాటు ఒడిశా, బిహార్‌, బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా విశాఖ ఉక్కును జాతి సంపదగా గుర్తించి కాపాడుకోవడానికి కృషి చేయాలి. ఇప్పటికే ఉద్యమిస్తున్న వారికి మద్దతుగా నిలవాలి. 


ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్‌లో అంతంతమాత్రంగా ఉన్న బీజేపీకి తమ భవిష్యత్తుపై ఆశలు ఉన్నట్లు లేదు. అందుకే ఇంత బరితెగిస్తున్నదనుకోవాలి. జరగరానిదేమైనా జరిగితే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వచ్చే శాసన సభ ఎన్నికల్లోనైనా ఒడిశాలో అధికారం చేజిక్కించుకుంటామనే ఆశలతో ఉన్న బిజెపి అధిష్ఠాన వర్గంపైన, కేంద్రప్రభుత్వంపైన ఒడిషా బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చి ఈ అనాలోచిత నిర్ణయాన్ని విరమింప చేయాలి.


విశాఖ ఉక్కు భూములను చంద్రబాబు నాయుడు గంగవరం పోర్టు నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా కట్టబెడితే, నేటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉక్కు కర్మాగారం భూములను అమ్మి అప్పులు తీర్చవచ్చునని ఒక దశలో ప్రకటించారు. విధిలేక, ఇప్పుడు రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇంకా ఐక్యవేదిక విస్తృతం కావాలి. జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ బదులు ‘విశాఖ ఉక్కు–భారత హక్కు’ నినాదంతో, పరిశ్రమ ప్రాధాన్యతను జాతీ యావత్తూ అర్థం చేసుకునేలా కృషి చేయాలి.


బి.వి.అప్పారావు

విశాఖపట్నం

Updated Date - 2021-08-14T06:07:48+05:30 IST