అమరావతినే కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-08-03T10:24:30+05:30 IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు.

అమరావతినే కొనసాగించాలి

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు

అమరావతి కాదంటే కర్నూలును  రాజధాని చేయాలి 

మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి  


ఎమ్మిగనూరు టౌన్‌, ఆగస్టు 2: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్వగృహంలో సేవ్‌ అమరావతి, సేవ్‌ ఏపీ పేరుతో అమరావతి రైతులు, కూలీలకు సంఘీభావంగా భౌతికదూరం పాటిస్తూ నిరసన తెలిపారు. రాజధాని వికేంద్రకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ మీద, అక్కసుతోనే 5 కోట్లమంది ప్రజల కలల రాజధాని అమరావతిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకునేందుకు, సీఎం హైదరాబాద్‌లో ఆస్తులను కాపాడుకునేందుకు అమరావతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో చెప్పిన అసత్యపు మాటలను నమ్మి వైసీపీని అధికారంలోకి తెస్తే నిలువునా మోసం చేశారన్నారు. 


రాజధాని కోసం  ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 33వేల ఎకరాలు  ఇచ్చిన రైతులను కూడా సీఎం జగన్‌ దగా చేశారని మండిపడ్డారు. వంద రోజులుగా ఆందోళన చేస్తున్నా.. 70మందికి పైగా చనిపోయినా కరగలేదన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని అడ్డుకునే కుట్రకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడం తెలుగు ప్రజల ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అమరావతి కోసం చంద్రబాబు దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు.


కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, దీంతో రాయలసీమ అభివృద్ధి జరుగదన్నారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలును రాజధానిగా చేయాలన్నారు. న్యాయ రాజఽధానిని స్వాగతిస్తున్నామని, బీజేపీ నాయకులు అనడం సరైంది కాదని, దమ్ముంటే కర్నూలును రాజధానిగా పెట్టించాలన్నారు.  చంద్రబాబు కట్టిన గృహాలను క్వారైంటైన్లుగా, కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చారని, ఒక ప్రస్తుత పట్టాల సంగతి ఎలా ఉంటుందో అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ కళ్లు తెరవాలని, అమరావతిని రాజధానిగా కొనసాగిం చాలని, లేకుంటే పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. 


‘రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు’

మద్దికెర: మాజీ ముఖ్యమంత్రి చంద్రనాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని మాజీ ఎంపీపీ పద్మావతి, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు ధనుంజయుడు అన్నారు. ఆదివారం వారు విలేఖరులతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని చేసి 33వేల ఎకరాల భూమి రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.10వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఒప్పుకుని ఇప్పుడు మాట తప్పడం దురదృష్టకరమని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు శివప్రసాద్‌, మల్లికార్జున పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T10:24:30+05:30 IST