Abn logo
Sep 26 2021 @ 02:40AM

‘డబుల్‌’ ఇళ్లలో కార్మికులకు ప్రాధాన్యమివ్వాలి

కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు

పటాన్‌చెరు, సెప్టెంబరు 25 : కార్మికుల హక్కులను కాలరాస్తూ, పెట్టుబడిదారీ వర్గానికి కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. కార్మిక, కర్షక వర్గాలపై పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8 నుంచి సీపీఎం, సీఐటీయూ నాయకులు వీరయ్య, భూపాల్‌, జయలక్ష్మి బృందం కార్మిక గర్జన పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఈ పాదయాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చేరుంది. ఈ సందర్భంగా పట్టణంలో పాదయాత్ర బృందానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న నిర్వహించనున్న అఖిలపక్ష బంద్‌కు టీఆర్‌ఎస్‌ కలిసి రావాలన్నారు.


ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో కార్మికులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు మాట్లాడుతూ పెట్టుబడుల బూచీ చూపించి కార్మిక హక్కులను యాజమాన్యాలకు తాకట్టు పెట్టడంలో ప్రభుత్వాలు అత్యుత్సాహం చూపిస్తున్నాయన్నారు.కనీస వేతనాలు చెల్లిస్తే పరిశ్రమలు తరలిపోతాయని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతన చట్టం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ నెల 29న సంగారెడ్డిలో పాదయాత్ర ముగింపు బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. సభకు సీఐటీయూ జాతీయ నాయకులు కెకె.పద్మనాభం వస్తున్నట్లు చెప్పారు.