2030 నాటికి భారతే టాప్: మాజీ రాయబారి

ABN , First Publish Date - 2021-08-03T18:57:57+05:30 IST

2030 నాటికి అన్ని విభాగాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉంటుందని మాజీ అమెరికన్ అంబాసిడర్(భారత్‌కు) రిచర్డ్ వర్మ అన్నారు.

2030 నాటికి భారతే టాప్: మాజీ రాయబారి

వాషింగ్టన్: 2030 నాటికి అన్ని విభాగాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉంటుందని మాజీ అమెరికన్ అంబాసిడర్(భారత్‌కు) రిచర్డ్ వర్మ అన్నారు. సోమవారం జరిగిన జిందాల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న వర్మ మాట్లాడుతూ.. "2030 ఏడాది కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది నాటికి భారత్ అన్ని విభాగాల్లో ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టివేయడం ఖాయం. అధిక జనాభా, ఎక్కువ కళాశాల గ్రాడ్యుయేట్స్, అధిక మధ్యతరగతి జనాభా, అధిక ఫోన్, ఇంటర్నెట్ వినియోగదారులు ఇండియాలో ఉండనున్నారు. అలాగే సైన్యం, ఆర్థిక వ్యవస్థలో మూడో దేశంగా అవతరించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పాతికేళ్లకు లోపు వయసు గల 600 మిలియన్ల మంది ఇలా అన్ని విభాగాల్లో భారత్ 2030 నాటికి టాప్‌లో ఉంటుందని" వర్మ అన్నారు.


ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ప్రస్తుతం భారత్ ముందు వరుసలో ఉందని, వచ్చే దశాబ్ధ కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏకంగా రెండు ట్రిలియన్ డాలర్లు వెచ్చించబోతుందని తెలిపారు. 2030 నాటికి కావాల్సిన మౌలిక వసతులను ఇప్పటి నుంచే ఇండియా ఏర్పాటు చేసుకునే పనిలో ఉందన్నారు. దీనిలో భాగంగా సొంతంగా 100 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక భారత్ వద్ద ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  

Updated Date - 2021-08-03T18:57:57+05:30 IST