కరోనా ప్రభావం భారత్‌లో ఇలానే కొనసాగితే మే నాటికి...

ABN , First Publish Date - 2020-03-27T02:18:24+05:30 IST

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్‌లో అధికారిక లెక్కల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు...

కరోనా ప్రభావం భారత్‌లో ఇలానే కొనసాగితే మే నాటికి...

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్‌లో అధికారిక లెక్కల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 694కి చేరాయి. గురువారం కరోనా సోకిన వారిలో ఇద్దరు చనిపోయారు. దీంతో.. భారత్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. కరోనా ప్రభావం ఇలానే కొనసాగితే మే నెల రెండో వారం ముగిసేసరికి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13లక్షలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.


అయితే... కరోనా దెబ్బకు మొదటి దశలోనే కుదేలైన ఇటలీ, అమెరికాలతో పోలిస్తే కరోనాను కట్టడి చేయడంలో భారత్ జాగ్రత్త పడిందని నిపుణుల బృందం అధ్యయనంలో తేల్చింది. అయితే.. కరోనా విషయంలో భారత్ ఓ ప్రధానమైన విషయంలో బోర్లా పడిందని.. నిజంగా ఎంతమంది ప్రజలు కరోనా బారిన పడ్డారో గుర్తించడంలో భారత్ లెక్క తప్పిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 


భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు సంఖ్యాపరంగా తక్కువగానే ఉండొచ్చు గానీ వైరస్ లక్షణాలు కనిపించే లోపు కరోనా బాధితుడి నుంచి ఎంతమందికి కరోనా వ్యాపిస్తుందో.. ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడం కష్టమని నిపుణులు వారి నివేదికలో రాశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆసుపత్రుల బయట, ఆసుపత్రుల లోపల ఎంతమంది కరోనా బారిన పడ్డారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


కరోనా వైరస్ భారత్‌లో వ్యాప్తి చెందుతున్న స్థాయిని చూస్తుంటే.. వైరస్ కట్టడికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్‌లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని.. పెరగనున్న పాజిటివ్ కేసులతో పోలిస్తే బెడ్స్ సంఖ్య అత్యంత స్వల్పంగా ఉందని నిపుణులు తెలిపారు. భారత్‌లో లక్ష మందికి కేవలం 70 హాస్పిటల్ బెడ్స్ మాత్రమే ఉన్నాయని అంచనా వేశారు. 

Updated Date - 2020-03-27T02:18:24+05:30 IST