బెంజమిన్‌కు బైబై

ABN , First Publish Date - 2021-06-17T09:39:49+05:30 IST

బెంజమిన్‌కు బైబై

బెంజమిన్‌కు బైబై

ఇజ్రాయెల్‌ని పన్నెండేళ్ళు పరిపాలించి, ఇంకా అధికారంలో కొనసాగాలని ఆశపడ్డ బెంజమిన్‌ నెతన్యాహూ ఎట్టకేలకు ప్రధాని పదవినుంచి దిగిపోవలసి వచ్చింది. మిగతాపక్షాలన్నీ ఊహకు కూడా అందని రీతిలో పొత్తులు గట్టి, కక్షగట్టి మరీ ఆయనను దించేశాయి. ఇజ్రాయెల్‌ చరిత్రలో ఇంతటి అపవిత్ర కలయిక ఎన్నడూ లేదని నెతన్యాహూతో పాటు మితవాదులూ ఛాందసులూ తెగబాధపడుతున్నారు. మాన్సూర్‌ అబ్బాస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ అరబ్‌ లిస్ట్‌ అనే అరబ్బుల పార్టీ చొరవ కారణంగా నెతన్యాహూకు పదవి దక్కకుండా పోయింది. హిబ్రూభాషలో ఈ పార్టీ సంక్షిప్త రూపం ‘రామ్‌’. హమాస్‌కీ, దీనికీ పుట్టుకలోనూ మతమూలాల్లోనూ పెద్ద తేడాలేదని కూడా విమర్శకులు అంటారు.


ఇజ్రాయెల్‌ ప్రభుత్వంలో ఒక అరబ్బు పార్టీ చేరడం ఆ దేశ చరిత్రలో ఇదే ప్రథమం. 1948లో ఇజ్రాయెల్‌ ఏర్పడిన దగ్గరనుంచి అరబ్‌పార్టీలు అంటరానివిగా, దూరంగానే ఉంటూ వచ్చాయి. 1990లో కొందరు అరబ్‌ ప్రజాప్రతినిధులకు ఇజాక్‌ రాబిన్‌ తన ప్రభుత్వంలో చోటివ్వడం వినా ఏ ఒక్క పార్టీ ఇప్పటివరకూ ఇజ్రాయెలీ ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. అందువల్లనే, అధికారంలో ‘రామ్‌’ ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. ప్రధాన స్రవంతి యూదుపార్టీలు, ఆరబ్‌పార్టీలు పరస్పరం దూరంగా ఉంటున్న నేపథ్యంలో, ఇజ్రాయెలీ అరబ్బులు బాగుపడాలంటే అధికారంలో పాలుపంచుకోవాల్సిందేనని వాదించి, అదే వాదనతో ఎన్నికల్లో పోటీచేసి, ఎవరూ ఊహించనిరీతిలో మంచి ఓట్లు, ఐదు సీట్లు సాధించింది ఈ పార్టీ. ఈ వాదనవల్ల మన్సూర్‌ అబ్బాస్‌ మిగతా అరబ్‌పార్టీల దృష్టిలో ద్రోహి, శత్రువు అయ్యాడు కూడా. అరబ్బుల, యూదుల శాంతియుత సహజీవనం సాధ్యమేననీ, అధికారంలో చేరితేనే ఇజ్రాయెలీ జనాభాలో ఐదోవంతు ఉన్న అరబ్బులకు అణచివేతలూ, అవిశ్వాసాలనుంచి ఉపశమనం లభిస్తుందని ఆయన నమ్మకం. అవసరమైతే అరబ్‌పార్టీ చేయూతతోనైనా అధికారంలోకి రావాలని నెతన్యాహూ కూడా ఊగిసలాడినా, ఆయన పార్టీలోని అత్యధికులు భవిష్యప్రయోజనాల రీత్యా పడనివ్వలేదని అంటారు.


‘రామ్‌’ చక్రం తిప్పిన కారణంగా ఇప్పుడు నెఫ్టాలీ బెన్నె్‌ట్‌ ప్రధానిగా ఉన్న కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో మితవాదులనుంచి వామపక్షవాదులవరకూ అనేకులు భాగస్వాములైనారు. బెంజమిన్‌కు బెన్నెట్‌కూ సైద్ధాంతికంగా పెద్ద తేడాలేదు. ఆయన బాటలోనే ఈయన సాగవచ్చు. అంతర్జాతీయ అంశాల్లోనూ, పాలస్తీనా విషయంలోనూ కొత్తపుంతలు తొక్కేదీ ఉండకపోవచ్చు. కానీ, నెతన్యాహూ లాగా అధికార దాహంతో మతాలమధ్యా మంటలుపెట్టబోనని కొత్తప్రధాని హామీ ఇస్తున్నారు.


కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో పార్లమెంటు విశ్వాసాన్ని చూరగొన్న కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఎంతకాలం మనగలుగుతోందో తెలియదు. నెతన్యాహూను దించడమే లక్ష్యంగా విభిన్న సిద్ధాంతాలున్న పార్టీలన్నీ చేతులుకలిపి పదవీకాలాన్ని కూడా పంచుకుంటున్న నేపథ్యంలో, ఏ సారూప్యతలు లేని సంకీర్ణం మనుగడమీద అనుమానాలు సహజం. ఏడాదిన్నర కాలంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగినా, ఇజ్రాయెలీలు సుస్థిర ప్రభుత్వాన్ని సాధించలేకపోయారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నెతన్యాహూ యుద్ధవిన్యాసాలు చేస్తూనే ఉన్నారు. గత నెలలో జెరూసలేంలోని అల్‌ అక్సా మసీదు వద్ద ఘర్షణలు రేగడం, హమాస్‌తో నిర్విరామంగా పదిరోజులు భారీ యుద్ధం చేయడం వెనుక కూడా నెతన్యాహూ రాజకీయలక్ష్యాలున్నాయని అనేకుల అనుమానం. ఇజ్రాయెలీ రక్షకుడిగా కనిపించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ప్రజల మనసులు పెద్దగా తాకింది కూడా లేదు. ఇప్పుడు ఆయన పదవీచ్యుతుడు కాగానే వేలాదిమంది వీధుల్లోకి వచ్చి వేడుకచేసుకున్నారు. అయితే, అవకాశవాద సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందనీ, ప్రజలు తిరిగి తనకు హారతులు పడతారని నెతన్యాహూ నమ్మకం. కానీ, ‘రామ్‌’ చొరవతో ఊహకు కూడా అందని పార్టీలమధ్య సయోధ్య సాధ్యమైనందువల్ల ఆ సానుకూల ప్రభావం ఇజ్రాయెలీ అరబ్బులూ యూదుల సంబంధాలపైనే కాక, ఇజ్రాయెలీలూ పాలస్తీనియన్ల మీద కూడా ఉంటుందని కొందరి ఆశ.

Updated Date - 2021-06-17T09:39:49+05:30 IST