బైపాస్‌ రోడ్డు ఎక్కడ వేస్తారో?

ABN , First Publish Date - 2021-08-03T04:55:17+05:30 IST

మూడేళ్లక్రితమే మంజూరైన కొత్త జాతీయరహదారి పనులకు మోక్షం కలగనుంది. దీంతో రామాయంపేట ప్రాంత రైతుల్లో బైపాస్‌ గుబులు పట్టుకుంది. సంగారెడ్డి నుంచి వరంగల్‌ జిల్లాఎల్కతుర్తి వరకు 199 కిలోమీటర్లమేర ఆర్‌అండ్‌బీ రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించింది. ఈమేరకు రోడ్డు విస్తరణ చేపడితే అక్కన్నపేట, రామాయంపేటలో గ్రామాల బయట నుంచి బైపాస్‌ రహదారులను నిర్మించనున్నారు.

బైపాస్‌ రోడ్డు ఎక్కడ వేస్తారో?
రామాయంపేటలో బైపాస్‌ జంక్షన్‌ ఏర్పాటు చేయనున్న ప్రదేశం

జాతీయ రహదారిగా సంగారెడ్డి–ఎల్కతుర్తి రోడ్డు అభివృద్ధి

త్వరలో ప్రారంభం కానున్న సర్వే పనులు

రామాయంపేట, అక్కన్నపేట వద్ద బైపాస్‌ నిర్మాణం

రైతుల భూములు సేకరించే అవకాశం

ఇప్పటి వరకు రైతులకు అందని నోటీసులు

భూములు పోతాయేమోనని అన్నదాతల్లో ఆందోళన


రామాయంపేట, ఆగస్టు 2: మూడేళ్లక్రితమే మంజూరైన కొత్త జాతీయరహదారి పనులకు మోక్షం కలగనుంది. దీంతో రామాయంపేట ప్రాంత రైతుల్లో బైపాస్‌ గుబులు పట్టుకుంది. సంగారెడ్డి నుంచి వరంగల్‌ జిల్లాఎల్కతుర్తి వరకు 199 కిలోమీటర్లమేర ఆర్‌అండ్‌బీ రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించింది. ఈమేరకు రోడ్డు విస్తరణ చేపడితే అక్కన్నపేట, రామాయంపేటలో గ్రామాల బయట నుంచి బైపాస్‌ రహదారులను నిర్మించనున్నారు. ఈ రెండు ప్రదేశాల్లో కొత్త రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించాల్సి ఉంటుంది. కొన్ని నివాస గృహాలను కూడా తొలగించాల్సి వస్తుంది. దీనిపై గతంలోనే సంబంధిత అధికారులు ప్రాథమికంగా వివరాలు సేకరించారు. పూర్తిస్థాయి సర్వే ప్రారంభించకముందే కరోనా విపత్తు ముంచుకురావడంతో పనులు నిలిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ హైవే పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవడంతో మరోసారి బైపాస్‌ రోడ్ల నిర్మాణం అంశంపై చర్చ మొదలైంది.


రెండు బైపా్‌సలు, మూడు జంక్షన్లు

సంగారెడ్డి–ఎల్కతుర్తి రహదారిపై రామాయంపేట పరిధిలో అక్కన్నపేట వద్ద గ్రామం బయట నుంచి బైపాస్‌ నిర్మించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. మెదక్‌ నుంచి వచ్చే మార్గం ప్రస్తుతం అక్కన్నపేట గ్రామం మధ్య నుంచి వెళ్తున్నది. ఇక్కడ రోడ్డు విస్తీర్ణం తక్కువగా ఉండటంతో రోడ్డు విస్తరణలో పెద్దఎత్తున్న నివాస గృహాలను కూల్చాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ గ్రామం బయట నుంచి అరకిలోమీటరు మేర బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే, రామాయంపేట వద్ద కూడా ప్రస్తుతం ఉన్న రహదారి పట్టణం మధ్యలోనుంచి ఉండటంతో బైపాస్‌ నిర్మాణం తప్పనిసరి అని అంచనావేస్తున్నారు. ఈమేరకు పట్టణం బయట నుంచి సిద్దిపేట రహదారిని కలిపేందుకు కొత్త రోడ్డు నిర్మించడం కోసం 30 మంది రైతులు పొలాలను కోల్పోయే అవకాశం ఉన్నది. ఈ మార్గంలో జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎలాంటి వంతెనలు లేకుండా, ప్రస్తుత మెదక్‌ రహదారి, హైదరాబాద్‌ పాత హైవే, సిద్దిపేట రూట్‌లో జంక్షన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీనిపై పూర్తిస్థాయి సర్వే చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి నోటీసులు అందలేదు. అయినా స్థానికంగా ఈ అంశం చర్చనీయంగా మారడంతో పలువురు రైతులు సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులను, నాయకులను కలిసి మొరపెట్టుకున్నారు. భూములను  కోల్పోకుండా రహదారి నిర్మాణం జరిగేలా చూడాలని విన్నవించారు. మూడేళ్ల నుంచి ఈ రహదారి అభివృద్ధి, బైపాస్‌ నిర్మాణంపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో భూములు కోల్పోతామని రైతుల్లో అయోమయం నెలకొన్నది. 

Updated Date - 2021-08-03T04:55:17+05:30 IST