తమ్ముడా మజాకా..!

ABN , First Publish Date - 2020-08-13T09:16:55+05:30 IST

నందిగామ మండలంలోని నందిగామ..

తమ్ముడా మజాకా..!

కొండను తొలిచేసి రూ. కోట్ల అక్రమార్జన

నందిగామ మండలంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు

పల్లగిరి, రాఘవాపురం, పెద్దవరంలో మాయమవుతున్న కొండలు

సెంటు పట్టా స్థలాల మెరకకూ ఈ గ్రావెలే..!

ఆ పేరుతో ఉపాధి నిధులు ఉఫ్..


విజయవాడ(ఆంధ్రజ్యోతి): పేదలకు ప్రభుత్వం ఇచ్చే సెంటు పట్టా భూములు అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూసేకరణలో కమీషన్ల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నది కొందరైతే, నివాసయోగ్యం కాని భూముల్లో మెరక తోలకం పేరుతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నవారు మరికొందరు. నందిగామ నియోజకవర్గంలో సాక్షాత్తూ అధికార పార్టీ నేత తమ్ముడే యథేచ్ఛగా కొండలను పిండిచేసి అక్రమంగా గ్రావెల్‌ను తరలించేసి రూ.కోట్లు వెనకేస్తున్నారు.


నందిగామ మండలంలోని నందిగామ, పెద్దవరం, పల్లగిరి, రాఘవాపురంలో ఉన్న మట్టి కొండలు అధికార పార్టీ నేతల చేతుల్లో పడి పిండవుతున్నాయి. అధికార పార్టీ నేత తమ్ముడి ఆధ్వర్యంలోనే ఇక్కడ యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పల్లగిరి గట్టు కొండలను ఇప్పటికే సగంపైగా తొలిచేసిన ఈ ముఠా మిగిలిన గ్రామాల్లో విస్తరించి ఉన్న కొండలను పిండి చేసేందుకు సిద్ధమవుతోంది.


ఇక్కడి నుంచి రోజుకు 100 లారీలకు తగ్గకుండా గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. ఒక్కో లారీ గ్రావెల్‌ను రూ.16వేలకు అమ్ముతున్నారు. అంటే రోజుకు ఈ అక్రమార్కుల ఆదాయం రూ.16 లక్షలు. సుమారు రెండు నెలలుగా ఈ గ్రావెల్‌ దోపిడీ సాగుతోంది. అంటే సుమారు రూ.10 కోట్ల మేర గ్రావెల్‌ దోపిడీ జరిగింది. ఇదంతా ఒక ఎత్తయితే, సెంటు పట్టా భూములకు మెరక పేరుతో జరిగిన దోపిడీ మరో ఎత్తు. 


మెరక పేరుతో మాయ

పేదలకు సెంటు పట్టా స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరించింది. అయితే, ఈ భూములన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో వీటిని మెరక చేయడం పెద్ద ప్రహసనంగా మారింది. ఈ భూములను మెరక చేసే పనిని అధికార పార్టీ నేతలే చేజిక్కించుకున్నారు. ఎకరా భూమిని మెరక చేసినందుకు ఉపాధి హామీ నిధుల నుంచి రూ.12 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే, ఈ భూములను మెరక చేసేందుకు ఉపయోగించే గ్రావెల్‌ను అనుమతి పొందిన క్వారీల నుంచే తరలించాల్సి ఉంటుంది.


కానీ, అధికార పార్టీ నేతలు ఎక్కడా అనుమతి పొందిన క్వారీల నుంచి గ్రావెల్‌ను తరలించడం లేదు. మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కొండలను ఇష్టారాజ్యంగా తొలిచేసి ఆ గ్రావెల్‌ను సెంటు పట్టా స్థలాలను మెరక చేసేందుకు తరలించి ‘ఉపాధి’ సొమ్మును స్వాహా చేస్తున్నారు. అనధికార క్వారీల నుంచి తరలించిన గ్రావెల్‌తో మెరక చేస్తే అలాంటి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకూడదన్న నిబంధనలు ఉన్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ఒక్క నందిగామ నియోజకవర్గంలోనే సుమారు 100 ఎకరాలను మెరక చేసి రూ.12 కోట్ల మేర బిల్లులు తీసుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.


మైలవరం నియోజకవర్గంలోనూ సుమారు 200 ఎకరాలు మెరక చేసి రూ.24 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసేందుకు రంగం సిద్ధమైంది. అక్రమ క్వారీల నుంచి గ్రావెల్‌ను తరలిస్తుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ కూడా చేరటం లేదు.


రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు మౌనం

కొండలను అక్రమంగా తవ్వి పెద్ద ఎత్తున గ్రావెల్‌ను తరలించుకుపోతున్నా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు కాసుల మత్తులో పడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక అధికార పార్టీ నేతల అండతో జరుగుతున్న గ్రావెల్‌ దోపిడీని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ముందుకు రావాలని స్థానికులు డిమాండ్‌  చేస్తున్నారు. 

Updated Date - 2020-08-13T09:16:55+05:30 IST