రేపు కేబినెట్‌ భేటీ

ABN , First Publish Date - 2021-07-31T08:21:15+05:30 IST

రాష్ట్ర మంత్రిమండలి ఆదివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది.

రేపు కేబినెట్‌ భేటీ

దళితబంధు మార్గదర్శకాలపై చర్చ

ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌?


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రిమండలి ఆదివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇంతకుముందు ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు కేబినెట్‌ భేటీ జరిగిన విషయం తెలిసిందే. పక్షం రోజుల్లోనే మళ్లీ సమావేశం కావడానికి.. దళిత బంధు మార్గదర్శకాలు, ఉద్యోగ ఖాళీల భర్తీ వంటి అంశాలే కారణమని తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అంశం వేడెక్కుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్‌ నుంచే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో దీని మార్గదర్శకాల రూపకల్పన కోసం మంత్రిమండలిని భేటీకి పిలిచినట్లు సమాచారం. మార్గదర్శకాలు ఎలా ఉండాలనే దానిపై కేబినెట్‌లో చర్చించి తగు సూచనలు చేస్తారని తెలిసింది. మార్గదర్శకాలు ఖరారు కాగానే.. పథకాన్ని ప్రారంభించే అవకాశాలుంటాయి. దీనికితోడు ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం కూడా పెండింగ్‌లో పడిపోయింది.


రాష్ట్రంలో 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇదివరకు అధికారులు తేల్చారు. కానీ, జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఖాళీలను మరోసారి సమీక్షించి, ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంతకుముందు కేబినెట్‌ సమావేశం ఆదేశించింది. ఈ గడువు ఈ నెల 19తో పూర్తయింది. అదే రోజు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్ని శాఖల అధికారులతో ఖాళీలపై సమీక్షించారు. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఖాళీల పూర్తి వివరాలను పంపించినట్లు తెలిసింది. దీనిని కేబినెట్‌లో సమీక్షించి, ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. దీంతోపాటు చేనేత బీమా, వ్యవసాయం, పోడు భూములు, సాగునీటి పారుదల రంగంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగునీటి ప్రాజెక్టుల సమస్య కూడా చర్చకు రానున్నట్లు తెలిసింది. కృష్ణా జలాల వాటాలను తేల్చేందుకు కొత్త ట్రైబ్యునల్‌ను వేయాలంటూ రాష్ట్రం డిమాండ్‌ చేస్తోంది. పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలను అడ్డుకోవాలంటూ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఈ అంశాలన్నింటిపై కేబినెట్‌లో చర్చ జరుగుతుందని సమాచారం.

Updated Date - 2021-07-31T08:21:15+05:30 IST