నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-23T06:09:49+05:30 IST

రానున్న రోజుల్లో నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేయాలని సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ అన్నారు.

నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు కృషి చేయాలి
కేక్‌ కట్‌ చేసి సిబ్బందికి తినిపిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

 నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు కృషి చేయాలి

సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

పాయకాపురం, అక్టోబరు 22 : రానున్న రోజుల్లో నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి  చేసేందుకు శాయశక్తులా కృషి చేయాలని సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ అన్నారు.  దేశంలో నూరు కోట్ల టీకాలు వేయడంలో భాగస్వామ్యులైన ప్రతీ ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం ఆశా, ఏఎన్‌ఎంలతో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, తదితర సిబ్బంది మన దేశాన్ని గర్వపడేలా చేశారని, వారి సేవలు తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఇది ఒత్తిడితో కూడిన పని అయినా ప్రజారోగ్యం కోసం గొప్పగా పని చేశారన్నారు. వైద్యులు క్షేత్రస్థాయిలో సందర్శనలతో అనేక గంటలు సమన్వయంతో నిర్విరామంగా పని చేశారని చెప్పారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించడం, మొబిలైజేషన్‌ చేయడంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితర మండల అధికారులు, వలంటీర్లు వివిధ శాఖల సహకారం ఎంతో ఉందన్నారు. ప్రజల పక్షాన నిలబడి నాయకత్వం వహిస్తున్న అందరికీ సబ్‌ కలెక్టర్‌ మరొకసారి ధన్యవాదాలు తెలిపారు.

టీచర్స్‌ కాలనీలో ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ 

సత్యనారాయణపురం:  31వ డివిజన్‌ టీచర్స్‌ కాలనీ, శ్రీనగర్‌ కాలనీలో శుక్రవారం ఇంటింటికీ వ్యాక్సినేషన్‌  కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరేటర్‌ పెనుమత్స శిరీష సత్యం పాల్గొని వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. వ్యాక్సిన్‌ పట్ల అపోహలను వీడి వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని సూచించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ వేశారు. సచివాలయం, మలేరియా విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.             



Updated Date - 2021-10-23T06:09:49+05:30 IST