ఈ ఏడాదీ వరుణుడి కరుణ

ABN , First Publish Date - 2021-04-14T08:35:53+05:30 IST

రాష్ట్రంలో ఇప్పుడు ఎండలు బాగా ఉన్నా.. వర్షాకాలం మొదలైన వెంటనే వానలు సమృద్ధిగా కురుస్తాయని పండితుడు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ప్రవచించారు.

ఈ ఏడాదీ వరుణుడి కరుణ

సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి

ఆర్థికంగా రాష్ట్ర పురోభివృద్ధి

ప్రతి కుటుంబానికీ సంక్షేమం

సీఎం జగన్‌ జాతకం భేష్‌

ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌లో పంచాంగ పఠనం


అమరావతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పుడు ఎండలు బాగా ఉన్నా.. వర్షాకాలం మొదలైన వెంటనే వానలు సమృద్ధిగా కురుస్తాయని పండితుడు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ప్రవచించారు. భూభాగమంతా సస్యశ్యామలంగా ఉంటూ.. పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటారని.. ప్రతి కుటుంబానికీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తారని తెలిపారు. ఉగాదిని పురస్కరించుకుని.. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సమక్షంలో సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. ‘ముఖ్యమంత్రి వ్యక్తిగత జాతకం బాగుంది. ఆయనకు గురుబలం పెరుగుతుంది. చక్కటి పాలన అందిస్తారు.


ప్రజలకు మరింత చేరువవుతారు. ఆయన పాలనను ప్రజలు అభినందిస్తారు. ఈ ఏడాది రాష్ట్రాన్ని ప్లవ రాశి ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. వర్షాలు బాగా ఉంటాయి. కుంభం, గురువు సంచారం వల్ల సస్యశ్యామలంగా ఉంటుంది. రైతు సంక్షేమం మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. విద్యా విధానంలో కొత్త విధానాలు,  ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. విద్య, ఆర్థిక, వ్యవసాయం బాగా ఉంటుంది. గత ఏడాది కరోనా సమయంలో దేశంలోనే రాష్ట్రంలో అత్యంత మంచి వైద్య సేవలు అందించారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి వ్యక్తిగత జాతక దృష్ట్యా కరోనాను జయిస్తారు. వ్యాక్సినేషన్‌లోనూ విజయవంతమవుతారు. ఈ ఏడాది వ్యాపారులకూ అనుకూలం. మకరంలోనూ.. కుంభంలోనూ గురువు సంచారం వల్ల మిత్రత్వం.. వ్యవస్థాపక విజయం సాధిస్తారు. సంక్షేమ, నవరత్న పథకాలు అందరూ పొందుతారు. వ్యవసాయ, విద్యా, వ్యాపారాభివృద్ధి, స్త్రీలు జీవన వృద్ధిని సాధిస్తారు’ అని  సోమయాజులు చెప్పారు.


కరోనా పీడ శాశ్వతంగా పోవాలి: జగన్‌

రాష్ట్రంలో కరోనా పీడ శాశ్వతంగా పోవాలని... ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సరం చీకటినుంచి వెలుగులోకి వచ్చే నావగా పండితులు చెప్పారని అన్నారు. రైతులందరికీ మేలు జరగాలని.. ప్రతి అక్క చెల్లెమ్మకు ఆర్థికంగా లబ్ధి చేకూరాలని.. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు , సిరిసంపదలు నిండాలని.. ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని సీఎం ఆకాంక్షించారు.

Updated Date - 2021-04-14T08:35:53+05:30 IST