Californiaలోని ప్రవాస భారతీయులకు ముఖ్య గమనిక.. జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్త రూల్..!

ABN , First Publish Date - 2021-12-09T22:30:27+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇళ్లల్లోని ఆహార వ్యర్థాలను చెత్తబుట్టల్లో వేయకూడదనే కొత్త నిబంధనను రూపొందించింది.

Californiaలోని ప్రవాస భారతీయులకు ముఖ్య గమనిక.. జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్త రూల్..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లల్లోని ఆహార వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఓ కొత్త విధానం రూపొందించింది. దీని ప్రకారం... ఆహార వ్యర్థాలన్నీ ఇకపై మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేయబోయే ప్రత్యేక ఆకుపచ్చ రంగు బకెట్లల్లో వేయాల్సి ఉంటుంది. మునుపటి వలె చెత్త బుట్టల్లో వేయకూడదు. ఆహారవ్యర్థాల కారణంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా సేకరించిన వ్యర్థాలతో బయోగ్యాస్ లేదా కంపోస్ట్ తయారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిబంధన అమలు కానుంది. 


గతంలో ప్రభుత్వ సిబ్బంది ఇళ్లలో సేకరించిన ఆహార వ్యర్థాలన్నిటినీ ల్యాండ్ ఫిల్‌కు తరలించేవారు. అయితే.. ఆహారం కుళ్లిపోయే సమయంలో ల్యాండ్‌ఫిల్‌ నుంచి వెలువడే మిథేన్ వాయువు పర్యావరణానికి హానికారకంగా మారుతుండడంతో ప్రభుత్వం పాత విధానానికి స్వస్థిపలికేందుకు నిర్ణయించింది. ఇతర కర్బన ఉద్గారాల కంటే మీథేన్ శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువని, దీని వల్ల భూతాపం మరింతగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు.  అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియా కావవడంతో అక్కడ ఆహారవ్యర్థాల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. 


కాగా.. అమెరికాలో ఆహారవ్యర్థాలకు సంబంధించి ఇటువంటి స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న రెండో రాష్ట్రం కాలిఫోర్నియా. గతేడాది వెర్మాంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా విధానాన్ని ప్రవేశ పెట్టింది. ‘‘వ్యర్థాల రీసైక్లింగ్‌కు సంబంధించి 1980ల తరువాత జరిగిన అతిపెద్ద మార్పు ఇదే’’ అని రాష్ట్ర వ్యర్థాల రీసైక్లింగ్ నిర్వహణ శాఖ డైరెక్టర్ రేచల్ వ్యాగ్నర్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పుల నిరోధానికి ప్రతి వ్యక్తి తన వంతుగా చేపట్టగలిగిన సులువైన పని ఇది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. 


ఇక బయోవేస్ట్ కూడా వాతావరణ మార్పులకు కారణమన్న స్ఫృహ ప్రజల్లో పెరిగిందనడానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడ్డుతున్నారు. కాలిఫోర్నియా ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం.. 2025 నాటికల్లా రాష్ట్రంలోని బయోవ్యర్థాల విడుదలను 2014 నాటి స్థాయిలో పోలిస్తే 75 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిర్ణయం అమలుకు కావాల్సిన ఏర్పాట్లు జనవరి కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కాస్త తక్కువగానే ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-12-09T22:30:27+05:30 IST