కేసులు భారీగా పెరగడంతో.. కాలిఫోర్నియా, ఆరెగాన్‌లలో మళ్లీ ఆంక్షలు!

ABN , First Publish Date - 2020-07-14T21:28:29+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. నిత్యం దాదాపు 70 వేల కేసులు నమోదవుతుండటంతో అ

కేసులు భారీగా పెరగడంతో.. కాలిఫోర్నియా, ఆరెగాన్‌లలో మళ్లీ ఆంక్షలు!

వాషింగ్టన్: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. నిత్యం దాదాపు 70 వేల కేసులు నమోదవుతుండటంతో అనేక రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్ ఆంక్షలను విధిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియా, ఆరెగాన్ రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్రంలోని అన్ని బార్లు మూసివేయాలని, రెస్టారెంట్స్, థియేటర్స్‌లలో ఇండోర్ ఆపరేషన్స్‌ జరపకూడదంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదేశాలు జారీచేశారు. మరోపక్క ఆరెగాన్ ప్రభుత్వం కూడా ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు, తదితర ఇండోర్ హాళ్లలో పది మంది కంటే ఎక్కువ గుమిగూడకూడదని ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా బయటకు వస్తే ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో, అట్లాంటాలలో స్కూళ్లు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో.. లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడానికి సిద్దమైన అనేక రాష్ట్రాలు ఇప్పటికే తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాయి. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 33 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. లక్షా 32 వేలకు పైగా కరోనా బారిన పడి మృతిచెందారు. గత వారం రోజుల లెక్కలను పరిశీలిస్తే.. అమెరికాలోని 20 రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరిగాయి. ఫ్లోరిడాలో అత్యధికంగా ఆదివారం 15 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అమెరికాలో ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని కేసులు రావడం ఇదే మొదటిసారి. 

Updated Date - 2020-07-14T21:28:29+05:30 IST