‘మమతను పిలవండి... దేశాన్ని కాపాడండి...’

ABN , First Publish Date - 2021-08-07T21:02:14+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత

‘మమతను పిలవండి... దేశాన్ని కాపాడండి...’

తిరువనంతపురం : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మన దేశానికి నాయకత్వం వహించాలన్న ఆకాంక్షను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ‘దీదీని పిలవండి, భారత దేశాన్ని కాపాడండి, ఢిల్లీ చలో’ అనే నినాదంతో కేరళలో బ్యానర్లు వెలిశాయి. ఇటీవల తమిళనాడులో ఇటువంటి కొన్ని పోస్టర్లు కనిపించిన సంగతి తెలిసిందే. 


1970వ దశకంలో ఇందిరా గాంధీకి సంబంధించిన భారీ కటౌట్లు దర్శనమిచ్చేవి. ‘ఇందిరను పిలవండి, భారత దేశాన్ని కాపాడండి, చలో ఢిల్లీ’ అనే నినాదంతో అప్పట్లో బ్యానర్లు వెలిశాయి. ఇప్పుడు అదే తరహాలో మమత బెనర్జీ ఫొటోలతో భారీ కటౌట్లు కేరళలోని కొచ్చిలో కనిపిస్తున్నాయి. వీటిలో ‘దీదీని పిలవండి, భారత దేశాన్ని కాపాడండి, ఢిల్లీ చలో’ అనే నినాదం కనిపిస్తోంది. ఆమె పశ్చిమ బెంగాల్‌లో ఘన విజయం సాధించడంతో, బీజేపీని దీటుగా ఎదుర్కొనగలిగే నేతగా కొందరు పరిగణిస్తున్నట్లు విశ్లేషకులు తెలిపారు. 


దక్షిణాదిలో టీఎంసీకి సంస్థాగత నిర్మాణం లేదు. కేరళలో వామపక్షాల ప్రభుత్వం ఉంది. మమత బెనర్జీ వామపక్షాలకు పూర్తి వ్యతిరేకి. అయినప్పటికీ ఆమె రావాలని కోరుకునే వారు కనిపించడం ఆసక్తికరంగా మారింది.


ఈ పరిణామాలపై టీఎంసీ హర్షం వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా తమ నేతను ప్రజలు భావిస్తున్నారని చెప్తోంది.

Updated Date - 2021-08-07T21:02:14+05:30 IST