Abn logo
Sep 27 2021 @ 23:11PM

ప్రశాంతంగా బంద్‌

ఆలూరులో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గిడ్డయ్య, ప్రభాకర్‌ రెడ్డి

  1. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత
  2. పాల్గొన్న పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు
  3. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన టీడీపీ, వామపక్ష నాయకులు


ఆదోని/ ఆదోని(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 27: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఆదోనిలో వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బంద్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమిత మయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆయా పార్టీ నాయకులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. వాణిజ్య దుకాణాలు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా పట్టణంలో ద్విచక్ర వాహనాలు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాలు, విద్యార్థి జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలు, ఎస్‌టీయూ, యూటీఎఫ్‌ నాయకులు పట్టణంలో ర్యాలీకి మద్దతు తెలిపి భీమాస్‌ కూడలిలో బైఠాయించి తమ నిరసన గళం విప్పారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్‌చౌదరి మాట్లాడుతూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీఎస్‌ రాధాకృష్ణ, సీపీఎం నాయకులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ, సీపీఐ నాయకులు సుదర్శన్‌, వీరేష్‌, సీపీఐ ఎంఎల్‌ నాయకులు మల్లికార్జున, మన్నెమ్మ, వెంకప్ప మాట్లాడుతూ దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని కుట్ర చేస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరుద్యోగులు భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సాబీర్‌బాషా, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.నాగరాజు, ఇంద్రరెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని నిర్వీర్యం చేసే మూడు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఒక సంవత్సర కాలంగా దేశ రాజధాని సరిహద్దులో రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు శివలోకేష్‌, సోమశేఖర్‌, జయకర్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు జయసూర్య, గురు, నూర్‌, సాయి, కిషోర్‌, బీడీఎస్‌ఎఫ్‌ నాయకులు ఉదయ్‌, సాయి, చరణ్‌, మనీష్‌, కృష్ణ పాల్గొన్నారు.

ఆస్పరి మండల కేంద్రంలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకలు శేషాద్రి, ఎంపీటీసీ నర్సప్ప, రంగస్వామి, కృష్ణ, నారాయణ, శ్రీనివాస్‌గౌడ్‌, సుదర్శన్‌, సతీష్‌కుమార్‌, రామదాసు, నౌనేపాటిచౌదరి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


ఆలూరు: రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన బంద్‌ ఆలూరులో విజయవంతం అయింది. ఉదయం 6 గంటల నుంచే దుకాణాలు బంద్‌ చేయించి రోడ్డుపై బైఠాయించారు. సీపీఎం, సీపీఐ, టీడీపీ, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో  రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున, తెలుగురైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు.  ఆలూరు సర్పంచ్‌ అరుణదేవి, సీపీఎం నాయకుడు కేపీ నారాయణస్వామి, సీపీఐ నాయకుడు భపేష్‌, టీడీపీ మండల కన్వీనర్‌ రాంభీంనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు దేవేంద్రప్ప, నాయకులు రఘుప్రసాద్‌రెడ్డి, ప్రహ్లాదరెడ్డి, నరసప్ప తదితరులు పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు: కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల పక్షపార్టీలు ఇచ్చిన భారత్‌బంద్‌ ఎమ్మిగనూరు పట్టణంలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూత పడ్డాయి. అలాగే బ్యాంకులు, ఎల్‌ఐసీతో పాటు ప్రైవేటు బ్యాంకులు సైతం లావాదేవీలు నిలిచిపోయాయి. బంద్‌తో పట్టణంలోని ప్రధానరహదారుల్లో ఉన్న దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలు మూసివేశారు. వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు వేకువజామున బస్టాండ్‌ దగ్గరకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అలాగే పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తు కేంద్రప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ర్యాలీ చేసి, శివసర్కిల్‌లో బైఠాయించారు. అనంతరం టీడీపీ, వామపక్షపార్టీలు, కాంగ్రేస్‌, ఎస్‌డీపీఐ, బీఎస్‌పీల నాయకు లు, కార్యకర్తలు సోమప్పసర్కిల్‌లో నిరసనవ్యక్తం చేశారు. బంద్‌కు ఉపా ధ్యాయ సంఘాలు మద్దతుతెలిపి నిరసనవ్యక్తం చేశాయి. వామపక్షపార్టీల నాయకులు రామాంజనేయులు, హనుమంతు, పంపన్నగౌడ్‌, రాజు, ప్రసాద్‌, ఖాదీర్‌బాషా, టీడీపీ నాయకులు సుందరరాజు, రామదాసుగౌడ్‌, కాంగ్రేస్‌నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, కాశీం వలి పాల్గొన్నారు.  పట్టణ సీఐ శ్రీనివాసనాయక్‌ ఆధ్వర ్యం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.