Abn logo
Sep 25 2021 @ 02:00AM

కొత్తనేతలు కొలువుదీరారు

కో-ఆప్షన్‌ మెంబరు నామినేషన్‌ తిరస్కరణలో అధికారులు అన్యాయం చేశారని ధర్నా

నాలుగు చోట్ల మినహా పూర్తయిన ఎంపీపీల ప్రమాణస్వీకారం

నిండ్రలో వర్గపోరు.. గుర్రంకొండలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రం

మలిదశ ఎన్నిక తర్వాతే గుడుపల్లె ఎంపీపీ కొలిక్కి


చిత్తూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలపు విరామం తర్వాత మండలాధీశులు కొలువుదీరారు. జిల్లాలోని 65 మండలాలకు గానూ శుక్రవారం 61 చోట్ల ఎంపీపీలు ఎన్నికయ్యారు. అందరూ వైసీపీకి చెందినవారే. మండల ప్రథమ పౌరులుగా స్థానిక పాలనలో వీరంతా కీలకపాత్రధారులు కాబోతున్నారు. మూడేళ్ల పాటు ఖాళీగా ఉన్న కుర్చీలు ఇక నుంచి కొత్త నేతలతో కళకళలాడనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరిషత్‌ ఎన్నికలు జరిగినా, కోర్టు ఆదేశాలతో ఈ నెల 19న ఫలితాలు వెలువడ్డాయి. శుక్రవారం ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. గుడుపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల్లో కోఆప్షన్‌ సభ్యుడి కోసం దరఖాస్తులు అందకపోవడంతో ఎన్నికలు జరగలేదు. కోరం లేక నిండ్రలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కేవీబీ పురం, పిచ్చాటూరు మండలాల్లో కోరం లేకపోవడంతో వైస్‌ ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

పెనుమూరులో ప్రమాణస్వీకారం చేస్తున్న ఎంపీటీసీలు

నిండ్రలో ఎమ్మెల్యే వర్గానికి ఎదురుదెబ్బ


నిండ్ర మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలకు గానూ 7 వైసీపీ, ఒకటి టీడీపీ దక్కించుకున్నాయి. వైసీపీలోనూ ఎమ్మెల్యే రోజా వర్గంలో ఇద్దరుండగా,  వైసీపీ జిల్లా కార్యదర్శి భాస్కర్‌రెడ్డి వర్గంలో ఐదుగురు ఉన్నారు. ఎంపీపీ ఎన్నికలో భాగంగా శుక్రవారం ఇరువర్గాల నుంచి రెండు చొప్పున మొత్తం నాలుగు దరఖాస్తులు కోఆప్షన్‌ సభ్యుడి కోసం ఆర్వో భాస్కరయ్యకు అందించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌ దరఖాస్తు మినహా మూడింటిని ఆర్వో తిరస్కరించారు. దీంతో భాస్కర్‌రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నిక సమావేశానికి హాజరుకాలేదు. టీడీపీ ఏకైక ఎంపీటీసీ విజేష్‌, రోజా వర్గానికి మద్దతు ఇచ్చినా.. ముగ్గురే అయ్యారు. ఐదుగురు ఎంపీటీసీలుంటేనే ఎంపీపీ ఎన్నిక పూర్తవుతుంది.కాసేపటి తర్వాత మళ్లీ వచ్చిన భాస్కర్‌రెడ్డి వర్గంవారు, అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపణలు చేశారు. ఆర్వోను మార్చితేనే ఎన్నికలో పాల్గొంటామని విలేఖరులతో చెప్పారు. దీంతో నిండ్రలో ఎంపీపీ ఎన్నిక ఆగిపోయింది.

వి.కోటలో ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే వెంకటేగౌడ,వైసీపీ శ్రేణులతో కలసి ర్యాలీగా వస్తున్న ఎంపీటీసీలు

గుర్రంకొండలో నకిలీ కులపత్ర కలకలం


గుర్రంకొండ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకుగానూ రెండుచోట్ల ఎన్నికలు జరగలేదు. మిగిలిన 10 స్థానాల్లో 8 వైసీపీ, 2 టీడీపీ దక్కించుకున్నాయి. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు కేటాయించారు. తరిమడుగు ఎంపీటీసీ వెంకట లక్ష్ముమ్మను అధికార పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019 డిసెంబరులో ఈమె ఓసీ అని తహసీల్దారు కార్యాలయం నుంచి సర్టిఫికెట్‌ పొందడంతో పాటు కాపునేస్తం పథకం ద్వారా లబ్ధి పొందిందని టీడీపీ నాయకులు గురువారం ఆర్వోకు ఫిర్యాదు చేశారు. విచారించిన ఆర్వో విద్యాసాగర్‌ ఎన్నిక జరిపేందుకు అంగీకరించలేదు. ఈ కారణంగా ఎంపీటీసీలెవ్వరూ ఎన్నికకు హాజరుకాలేదు. ఆర్వో సెలవు పెట్టి వెళ్లిపోగా వాల్మీకిపురం జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌ నక్కా మోహన్‌కుమార్‌ను ఆర్వోగా నియమించారు. శనివారం ఎన్నిక జరిపేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు.

మలి ఎన్నిక జరిగితే గుడుపల్లె ఎంపీపీ


గుడుపల్లెలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కనమనపల్లెలో కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసులు నామినేషన్‌ వేసిన తర్వాత అనారోగ్యంతో మరణించారు. దీంతో అక్కడ ఎన్నిక జరగలేదు. ఆ సెగ్మెంట్‌ ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మిని అధికార పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ ఎన్నికల్లో గెలిచిన 12 స్థానాలూ వైసీపీ ఖాతాలో ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థి సెగ్మెంటులో ఎన్నిక జరగలేదు. ఈకారణంగా శుక్రవారం కోఆప్షన్‌ సభ్యుడి కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. దీంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక జరగలేదు. కనమనపల్లె ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిన తరువాత గుడుపల్లె ఎంపీపీ ఎన్నిక ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

వాల్మీకిపురంలో అందరూ డుమ్మా


వాల్మీకిపురంలో మొత్తం 13 ఎంపీటీసీలుండగా ఓటర్ల జాబితా సవరణ కారణంగా 10 చోట్ల ఎన్నికలు జరగలేదు. మూడు చోట్ల ఏకగ్రీవమయ్యాయి. 2 వైసీపీ, 1 టీడీపీకి దక్కాయి.శుక్రవారం సభ్యులు ఎవరూ హాజరుకాకపోగా నామినేషన్లు కూడా దాఖలు కాకపోవడంతో కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికను శనివారానికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.శనివారం కూడా 10 గంటల్లోపు ఎవరూ హాజరుకాకపోతే ఎన్నికను పూర్తిగా వాయిదా వేస్తారు.

 కేవీబీపురం, పిచ్చాటూరుల్లో ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా


కేవీబీపురం, పిచ్చాటూరు మండలాల్లో వైస్‌ ఎంపీపీ కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ ఎన్నిక వాయిదా పడింది. పిచ్చాటూరు మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలుండగా.. అన్నీ వైసీపీ ఖాతాలో ఉన్నాయి. శుక్రవారం జరిగిన ఎన్నికలో.. రేఖను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం ఇద్దరు పోటీ పడడంతో ఎమ్మెల్యే ఆదిమూలం చెప్పినా వినలేదు. దీంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే కేవీబీపురంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా.. అన్నీ వైసీపీకే దక్కాయి. శుక్రవారం ఎంపీపీ ఎన్నిక పూర్తికాగా.. మునిలక్ష్మిని ఎన్నుకున్నారు. వైస్‌ ఎంపీపీ ఎన్నిక జరిగే సమయంలో ఎంపీటీసీ సభ్యులందరూ లేచి బయటికి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడా వాయిదా పడింది.

జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎంపీపీలందరూ మహిళలే


వెదురుకుప్పం, సెప్టెంబరు 24:గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, గంగాధరనెల్లూరు, పాలసముద్రం, పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో ఎంపీపీలందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అందరూ మహిళా ఎంపీపీలే కావడం విశేషం. వెదురుకుప్పం ఎంపీపీగా ఎం.నాగరాణి, ఎస్‌ఆర్‌పురం ఎంపీపీగా సరిత, కార్వేటినగరం ఎంపీపీగా లత, గంగాధరనెల్లూరు ఎంపీపీగా అనిత, పాలసముద్రం ఎంపీపీగా శ్యామల, పెనుమూరు ఎంపీపీగా హేమలతారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.