ప్రచారపర్వంలో పార్టీలు... అభ్యర్థుల తరపున రంగంలోకి ముఖ్య నేతలు

ABN , First Publish Date - 2021-04-21T06:04:45+05:30 IST

కార్పొరేషన్‌ పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో ఖమ్మంలో రాజకీయం వేడుక్కుతోంది. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన క్షణం నుంచే అన్ని పార్టీలు ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి.

ప్రచారపర్వంలో పార్టీలు... అభ్యర్థుల తరపున రంగంలోకి ముఖ్య నేతలు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్లకు బాధ్యతలప్పగించిన టీఆర్‌ఎస్‌

ఇతర పార్టీలకు ఆయా పార్టీల అగ్రనాయకులే అండ

పొత్తులు, సీట్ల సర్ధుబాటుపై వీడని ఉత్కంఠ

వేడెక్కుతున్న ఖమ్మం రాజకీయం

ఖమ్మం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌ పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో ఖమ్మంలో రాజకీయం వేడుక్కుతోంది. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన క్షణం నుంచే అన్ని పార్టీలు ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి. బరిలో ఉన్న అభ్యర్ధులు తమ డివిజన్ల ఓటర్లను కలుస్తున్నారు. పొత్తుల్లో భాగంగా తమ సీటు ఎవరికి కేటాయిస్తారో అన్న అనుమానాలున్నవారు మినహా మిగిలిన డివిజన్లలో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ఎవరికి వారు తమ అస్త్రాలను సంధిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తమ అభ్యర్థులకు అండగా పార్టీల అగ్రనాయకులు రంగంలోకి దిగారు. 

అధికారపార్టీ అభ్యర్థుల తరపున మంత్రి, నేతలు 

టీఆర్‌ఎస్‌ తరపున పువ్వాడ అజయ్‌కుమార్‌ కార్పొరేషన్‌ ప్రచార బాధ్యతలు తీసుకోగా.. డివిజన్ల వారీగా జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌, కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు పలువురు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. వారితోపాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కూడా త్వరలో విస్తృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే మంత్రి కేటీఆర్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాము చేసిన అభివృద్ధినే అజెండాగా చూపుతూ అధికార పార్టీ ముందుకెళ్తోంది. 

ఇతర పార్టీలకు అగ్రనాయకులే అండ.. 

విపక్ష పార్టీల తరపున నామినేషన్లు వేసిన అభ్యర్ధులు కూడా తమ స్థాయికి తగ్గట్టుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాగా వారికి తమ తమ పార్టీల్లోని అగ్రనాయకత్వమే అండగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలు, టీడీపీ తరపున ఆయాపార్టీల్లోని ముఖ్య నాయకులు ప్రచారాన్ని నిర్వహించి అధికారపార్టీ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు పీసీసీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇప్పటికే పలు డివిజన్లలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బలరాంనాయక్‌ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. వారితోపాటు కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు తమ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయి నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీడీపీ, సీపీఎం తమ ఉనికిని చాటుకునేలా నాయకత్వంతో ప్రచారం చేసుకుంటుండగా.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. సీపీఐ నుంచి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ ప్రచారంలో పాల్గొంటున్నారు. 

సర్ధుబాట్లపై ఉత్కంఠ..

ఖమ్మం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు గాను పలు పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్ధుబాటుపై ఉత్కంఠ వీడలేదు. టీఆర్‌ఎస్‌- సీపీఐ పొత్తు పెట్టుకోగా.. ఐదు డివిజన్లలో సీపీఐ నామినేషన్లు వేయగా.. టీఆర్‌ఎస్‌ 59డివిజన్లలో నామినేషన్‌ దాఖలు చేసింది. ఆ రెండు పార్టీల పొత్తులో ఒక్క డివిజన్‌ మాత్రమే లెక్కతేలగా.. మిగిలిన డివిజన్ల పరిస్థితేంటో తేలాల్సి ఉంది. ఉదాహరణకు 50వ డివిజన్‌లో ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన రాపర్తి శరత్‌ టీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేయగా.. సీపీఐ నుంచి మేకల రవికుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అలా మిగిలిన మూడు డివిజన్లలోనూ ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. అంతేకాదు టీఆర్‌ఎస్‌లోనూ కొన్ని డివిజన్లలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ వేయగా ఆయా డివిజన్లలోని స్థానిక నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. కాగా బీ ఫారాలు అందించేవరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ - జనసేన జట్టుగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా.. ఇరు పార్టీల మధ్య ఇప్పటికే 10 డివిజన్లకు ఒప్పదం కుదరగా.. జనసేన మాత్రం 12 డివిజన్లకు నామినేషన్‌ దాఖలు చేసింది. ఇక సీపీఎం 30 డివిజన్లలో, కాంగ్రెస్‌ 60డివిజన్లలో, టీడీపీ తరపున 16డివిజన్లకు నామినేషన్లు వేశారు. 22వతేదీన ఉపసంహరణ సమయానికి లెక్కలు తేలనున్నాయి.


Updated Date - 2021-04-21T06:04:45+05:30 IST