ఛాతీ ఎక్స్‌రేతో చెప్పేయొచ్చు!

ABN , First Publish Date - 2021-05-08T09:31:42+05:30 IST

కరోనా సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఇప్పుడు మనకున్న పరమప్రామాణికమైన టెస్టు.. ఆర్టీపీసీఆర్‌. కొవిడ్‌ తీవ్రతను గుర్తించడానికి సీటీ స్కాన్‌ చేస్తున్నారు. వీటిలో ఆర్టీపీసీఆర్‌ టెస్టు

ఛాతీ ఎక్స్‌రేతో చెప్పేయొచ్చు!

కరోనా సోకిందీ లేనిదీ నిర్ధారించే ఏఐ టూల్‌..

అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో.. త్వరలో అందుబాటులోకి


బెంగళూరు, మే7: కరోనా సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఇప్పుడు మనకున్న పరమప్రామాణికమైన టెస్టు.. ఆర్టీపీసీఆర్‌. కొవిడ్‌ తీవ్రతను గుర్తించడానికి సీటీ స్కాన్‌ చేస్తున్నారు. వీటిలో ఆర్టీపీసీఆర్‌ టెస్టు ఫలితం రావడానికి బాగా ఆలస్యమవుతోంది. ఎక్కువ మంది పరీక్ష చేయించుకుంటుండడంతో రిజల్ట్‌ రా వడానికి 24 నుంచి 36 గంటలు కూ డా పడుతోంది. ఇక సీటీ స్కాన్‌ ఖర్చెక్కువ. ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. ఈ నేపథ్యంలో.. మామూలు ఛాతీ ఎక్స్‌రే ద్వారా ఒక వ్యక్తికి కరోనా ఉ న్నదీ లేనిదీ గుర్తించే కృత్రిమ మేధను (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథమ్‌) రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. 5సీ నెట్‌వర్క్‌, హెచ్‌సీజీ అకడమిక్స్‌ సహకారంతో డీఆర్‌డీవోలోని ‘సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ (కెయిర్‌)’ రూపొందించిన ఈ టూల్‌ పేరు ‘ఆత్మన్‌ ఏఐ’.


ఇది ఛాతీ ఎక్స్‌రేలను స్ర్కీనింగ్‌ చేసి, వైరస్‌ ఉనికిని, దాని వల్ల ఊపిరితిత్తులు ఎంతవరకూ ప్రభావితమయ్యాయ నే విషయాన్ని గుర్తిస్తుందని హెచ్‌సీజీ అకడమిక్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోనే అతి పెద్ద రేడియాలజిస్టుల నెట్‌వర్క్‌ అయిన 5సి నెట్‌వర్క్‌ ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తుందని వెల్లడించింది. ఆర్టీపీసీఆర్‌లా కాకుండా కొవిడ్‌ అనుమానిత పేషెంట్లను ఈ పద్ధతిలో మరింత చౌకగా, సమర్థంగా గుర్తించవచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ముఖ్యంగా.. సీటీ స్కానింగ్‌ లభ్యత లేని చిన్నచిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు ఈ టూల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని హెచ్‌సీజీ అకడమిక్స్‌ తన ప్రకటనలో వివరించింది. అంతేకాదు.. ఇది అం దుబాటులోకి వస్తే రేడియాలజిస్టులపై భారం తగ్గుతుందని, సీటీ స్కానింగ్‌ యంత్రాలను ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడేవారికి ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఆస్పత్రుల్లో వివిధ దశల్లో ఉన్న కొవిడ్‌ పేషెంట్ల ఛాతీ ఎక్స్‌రేలను కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించి ఈ కొత్త టూల్‌ను అభివృద్ధి చేశారు. ఈ అల్గారిథమ్‌ 96.73% కచ్చితత్వంతో పనిచేస్తున్నట్టు హెచ్‌సీజీ అకడమిక్స్‌ తెలిపింది. కరోనా నిర్ధారణ వేగంగా చేసేందుకు డీఆర్డీవో చేస్తున్న కృషిలో ఇది ఒక భాగమని డీఆర్‌డీవోలోని కెయిర్‌ విభాగం డైరెక్టర్‌ యూకే సింగ్‌ అన్నారు.


ఈ టూల్‌.. ఛాతీ ఎక్స్‌రేలను సెకన్లలోన విశ్లేషించి, కేసుల తీవ్రతను వేగంగా అంచనా వేయడంలో ఉపయోగపడనుంది.ఈ టూల్‌ మారుమూల ప్రాంతాలవారికి కూడా అందుబాటులోకి వస్తుందని 5సీ నెట్‌వర్క్‌ సీఈవో కల్యాణ్‌ శివశైలం తెలిపారు. కాగా.. దేశవ్యాప్తంగా 1000కి పైగా ఆస్పత్రులతో 5సీ నెట్‌వర్క్‌ అనుసంధానమై ఉందని.. ఆ సంస్థ ఈ ఆత్మన్‌ ఏఐ టూల్‌ను అందుబాటులోకి తెస్తుందని హెచ్‌సీజీ అకడమిక్స్‌ తన ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2021-05-08T09:31:42+05:30 IST