చిట్‌ఫండ్‌ల మోసాలకు అడ్డుకట్ట పడేనా?

ABN , First Publish Date - 2022-01-19T05:14:19+05:30 IST

సొంత ఇళ్లు కట్టుకుందామనో.. బిడ్డ పెళ్లి చెద్దామనో.. పిల్లల చదువులకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చూసుకుందామనో.. ఎన్నో ఆశలు, మరెన్నో కళలు కంటూ చిట్‌ఫండ్‌ కంపెనీలలో నమ్మిన వారు ఏజెంట్లుగా ఉన్నారని డబ్బులు చెల్లిస్తే సదరు కంపెనీలు మోసం చేయడంతో ఎందరో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు.

చిట్‌ఫండ్‌ల మోసాలకు అడ్డుకట్ట పడేనా?
కస్లమర్లకు డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్న ఏజెంట్‌

- రోజుకో చోట చిట్‌ ఫండ్‌ కంపెనీల లీలలు బట్టబయలు

- ఏజెంట్లకు భారీ కమీషన్‌లు ఇస్తూ అమాయకులకు గాలం

- డబ్బులు కట్టించే వరకే కనిపిస్తున్న ఏజెంట్లు.. చిట్టి వస్తే ఇప్పించేందుకు కాదు

- నెలల తరబడి చెల్లింపులకు తప్పని ఎదురుచూపులు

- బాధితులు ఫిర్యాదులు చేసినా కట్టడి చేయని అధికారులు

- దీంతో జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న చిట్‌ఫండ్స్‌

- ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ప్రజలకు తప్పనున్న ఆర్థిక ఇబ్బందులు


కామారెడ్డి టౌన్‌, జనవరి 18: సొంత ఇళ్లు కట్టుకుందామనో.. బిడ్డ పెళ్లి చెద్దామనో.. పిల్లల చదువులకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చూసుకుందామనో.. ఎన్నో ఆశలు, మరెన్నో కళలు కంటూ చిట్‌ఫండ్‌ కంపెనీలలో నమ్మిన వారు ఏజెంట్లుగా ఉన్నారని డబ్బులు చెల్లిస్తే సదరు కంపెనీలు మోసం చేయడంతో ఎందరో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. నెలవారి చీటీల పేరుతో పల్లె, పట్టణాల్లోని ప్రజలకు ఏజెంట్ల ద్వారా అమాయకులకు గాలం వేస్తున్నారు. తీరా డబ్బులు కట్టే వరకే ఏజెంట్లు కనిపిస్తుండగా చీటి లేపిన తర్వాత మాత్రం ఇప్పించేందుకు రాకపోవడం, కొందరు ఏజెంట్లు తమను నమ్మి డబ్బులు కట్టారని ఎంతో కొంత మానవత్వం చూపిస్తున్నారని కార్యాలయానికి వస్తే సదరు కంపెనీ నిర్వాహకులు కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్నారని తెలుస్తోంది. 

చీటి డబ్బులు ఇవ్వడం లేదని ఏజెంట్‌ ఆగ్రహం

ఆర్మూర్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ గత 15 సంవత్సరాలుగా కామారెడ్డిలోని చైత్రరథ చిట్‌ఫండ్‌ కంపెనీలో ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. తన తరఫున సుమారు 200 మంది సభ్యులను కంపెనీలో చేర్పించి చీటీ డబ్బులను చెల్లిస్తున్నాడు. అయితే గత 14 నెలలుగా చీటీలు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వడానికి చిట్‌ఫండ్‌ మేనేజర్‌ దయాకర్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. కొన్ని రోజుల క్రితం తన ఇంటికి డబ్బులు కట్టినా బాధితులు వచ్చి ఇంట్లోని ఫ్రిజ్‌ను పగులగొట్టారని పేర్కొన్నాడు. కస్టమర్లకు ఇవ్వాల్సిన చీటీలో తనకు రావాల్సిన కమీషన్‌ తీసుకుని ఇవ్వాలని మేనేజర్‌కు కోరినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆర్మూర్‌లో సుమారు 50 మందికి రూ.13లక్షల వరకు చీటీ డబ్బులు రావాల్సి ఉందని తెలిపాడు. చీటి డబ్బులు చెల్లించిన బాధితులు తన ఇంటిచుట్టు తిరుగుతున్నారని, కంపెనీ వాళ్లు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. 

జిల్లా కేంద్రంలో రోజుకో చోట చిట్‌ఫండ్‌ కంపెనీల లీలలు బట్టబయలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజుకో చోట చిట్‌ఫండ్‌ కంపెనీల లీలలు బట్టబయలు అవుతున్నాయి. వ్యాపార, వాణిజ్యపరంగా అన్ని రకాలుగా జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతుండడంతో పుట్టగొడుగుల్లా చిట్‌ఫండ్‌ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త బస్టాండ్‌ నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీ వరకు, సిరిసిల్లా రోడ్‌, నిజాంసాగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన కొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలపై డబ్బులు కట్టించుకొని మోసగిస్తున్నారని ఫిర్యాదులు కోకొల్లలుగా వస్తున్నాయి. కొందరు లోలోపల సర్దుబాటు చేసుకుంటుండగా మరికొందరు దౌర్జన్యాలు చేయడం, మధ్యవర్తులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పదుల సంఖ్యలోనే రోజుకో చిట్‌ఫండ్‌లపై ఫిర్యాదులు వచ్చినా వాటిపై చర్యలు మాత్రం కరువయ్యాయని దీంతో ఒకరిని చూసి మరొక్కరు ప్రజలను మోసగిస్తున్నారని సమాచారం. ఇటీవల మద్నూర్‌,బోధన్‌, జుక్కల్‌ మండలాలకు చెందిన ఓ ముగ్గురు వ్యక్తుల చేత నిజాంసాగర్‌ రోడ్డులోని ఓ ఫైనాన్స్‌ కంపెనీ రూ.10లక్షల చీటిని వేస్తున్నామంటూ నెలకు రూ.21వేలు కట్టించుకుని 14 నెలల వరకు చీటి ప్రారంభించలేదు. దీంతో సదరు కంపెనీకి వెళ్లి నిలదీసిన బాధితులు గతంలో పని చేసిన వారికి మాకు ఎలాంటి సంబంఽధాలు లేవని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వాహకులు చీటీలు వేసిన వారికి డబ్బులు ఇచ్చే సమయానికి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించుకోవడంతో కార్యాలయంలో గొడవకు దిగడంతో కార్యాలయాన్ని మూసివేసి ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసుకున్నారు.

అడుగడుగునా నిబంధనల పాతర

చిట్‌ఫండ్‌ కంపెనీ యాక్ట్‌ ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసే చిట్‌ గ్రూపులకు సంబంధించిన వివరాలన్నింటిని జిల్లా రిజిస్ట్రార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం ఎన్ని గ్రూపులు నిర్వహిస్తున్నారనే అంశంతో పాటు ఆ గ్రూపులో చేరిన సభ్యులు, చెల్లింపుల వ్యవహారాలు లాంటి అన్ని అంశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అలాగే ప్రతీ గ్రూపునకు సంబంధించిన సమాచారాన్ని సదరు రిజిస్ట్రార్‌కు అందుబాటులో ఉంచాలి. ప్రైవేట్‌ సైన్యంతో బకాయిలు వసూళ్లు చేపట్టరాదు. బకాయిలు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప వేధింపులకు పాల్పడవద్దన్న నిబంధనలున్నాయి. ఇలాంటి నిబంధలన్నింటిని తుంగలో తొక్కి ధనార్జనే ధేయ్యంగా ఈ చిట్‌ఫండ్‌ కంపెనీలు వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చిట్‌ఫండ్‌ కంపెనీల మోసాలను అరికట్టాల్సిన సంబంధితశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాఽధికారులు చిట్‌ఫండ్‌ మోసాలపై దృష్టి సారిస్తేనే ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పనున్నాయి.

Updated Date - 2022-01-19T05:14:19+05:30 IST