రోడ్డుపై ఆగి ఉన్న కారు.. సడెన్‌గా కుంగిన రోడ్డు!

ABN , First Publish Date - 2020-11-28T16:59:52+05:30 IST

రోడ్డుపై సడెన్‌గా ఓ భారీ గుంత ప్రత్యక్షమైతే ఏం చేయాలి? అందులో ఓ ఖరీదైన కారు పడిపోయుంటే? అమెరికాలోని న్యూయార్క్ నగర వాసులకు థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఇలాంటి దృశ్యమే కళ్లబడింది.

రోడ్డుపై ఆగి ఉన్న కారు.. సడెన్‌గా కుంగిన రోడ్డు!

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డుపై సడెన్‌గా ఓ భారీ గుంత ప్రత్యక్షమైతే ఏం చేయాలి? అందులో ఓ ఖరీదైన కారు పడిపోయుంటే? అమెరికాలోని న్యూయార్క్ నగర వాసులకు థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఇలాంటి దృశ్యమే కళ్లబడింది. పండుగ రోజు సరదాగా గడుపుదామని బయటకు వచ్చిన ప్రజలకు ఓ కారు కనిపించింది. దాని ముందు భాగం ఓ భారీ గుంతలో పడిపోయి ఉంది. దాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో కూడా తెలియదని స్థానికులు అంటున్నారు.


అదృష్ట వశాత్తూ ఈ ప్రమాదం జరిగి, కారు గుంతలో పడినప్పుడు వాహనంలో ఎవరూ లేరు. ఎవరైనా ఉండి ఉంటే కచ్చితంగా గాయాల పాలయ్యే వారని అధికారులు చెప్పారు. ఈ ఎస్‌యూవీ కారు డ్రైవర్ పేరు థుప్టేన టోప్జీ. ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను.. తన షిప్ట్ ప్రారంభం అయ్యే సమయానికే ఈ కారు గుంతలో పడిపోయిందట. కాసేపు ఉండుంటే అతన కారులో ఎక్కేవాడు. దాంతో గాయాల పాలయ్యేవాడు. ఈ విషయంపై థుప్టేన్ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా అదృష్ట వంతుడిని అనుకుంటున్నా. లేదంటే చాలా బాధ పడాల్సి వచ్చేది’’ అని చెప్పాడు.


న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ నగర కౌన్సిల్ మ్యాన్ రాబర్ట్ హోల్డెన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ప్రమాదం కారణంగా స్థానికంగా ఉన్న కొన్ని రోడ్లను మూసి వేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఘటన గురించి సమాచారం అందగానే స్థానిక పోలీసు శాఖ, అగ్నిమాపక దళం ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఈ శాఖల అధికారులు స్పష్టం చేశారు. థుప్టేన్ సోదరుడు ఇంటిలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా థుప్టేన్ సోదరుడి ఇంటి ముందే ఈ భారీ గుంత ప్రత్యక్షం అయింది.


ఇలా దాదాపు ఓ కారును మింగేసే అంత భారీ గుంత సడెన్‌గా ప్రత్యక్షం అవడం స్థానికుల్లో అలజడికి కారణమైంది. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. సరైన కారణాలు కూడా ఎవరూ చెప్పలేక పోతున్నారు. అయితే న్యూయార్క్ నగరంలో ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు. 2015లో బ్రూక్లీన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఉదయం నిద్ర లేచే సరికే నడిరోడ్డుపై ఓ భారీ గుంత ప్రజలకు కనిపించింది. రాత్రికి రాత్రి ప్రత్యక్షమైన ఈ గుంతను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Updated Date - 2020-11-28T16:59:52+05:30 IST