ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వరేం?

ABN , First Publish Date - 2021-01-17T08:29:04+05:30 IST

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించలేదేమని సీఎం జగన్‌ను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశ్నించారు.

ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వరేం?

  • కృష్ణాపై 15, గోదావరిపై 4 ప్రాజెక్టులు 
  • వాటన్నింటికీ నివేదికలు ఇవ్వాల్సిందే 
  • అసంపూర్తిగా సీమ ఎత్తిపోతల డీపీఆర్‌ 
  • తెలంగాణలోనూ 15 ప్రాజెక్టులకు ఇవ్వాలి 
  • తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్‌ లేఖ


న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించలేదేమని సీఎం జగన్‌ను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశ్నించారు. ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక అసంపూర్తిగా ఉంది. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షత వహించే అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి. అంతర్‌ రాష్ట్ర నదీ జలాలపై నిర్మించే సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ కేంద్ర జలశక్తి శాఖతో సహా కేంద్ర జలసంఘం, అటవీ- పర్యావరణ అనుమతులు అవసరం. ఈ ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక ఆమోదం పొందాలి. కానీ ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై 15, గోదావరిపై నిర్మిస్తున్న 4 ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకూ డీపీఆర్‌లు సమర్పించలేదు.


గత డిసెంబరు 16న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయాన్ని అమలు చేయడం లేదు’’ అని షెకావత్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఎందుకు సమర్పించలేదని ఈ నెల 5న జగన్‌కు రాసిన లేఖలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ సమావేశంలో అంతర్‌ రాష్ట్ర నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ డీపీఆర్‌లు సమర్పించాలని నిర్ణయించామని సీఎం జగన్‌కు షెకావత్‌ గుర్తు చేశారు. ఇప్పటి వరకూ కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ సమర్పించారని, అదీ అసంపూర్తిగా ఉందన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కోరిన సమాచారమే అందులో లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి మూడో దశ ప్రాజెక్టు నివేదికలను పంపలేదన్నారు.


పురుషోత్తపట్నం నివేదికను గత నెల 21న పంపారన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె సప్లిమెంటేషన్‌, గురు రాఘవేంద్ర ఎ్తపోతల, పులికనుమ, సిద్దాపురం, శివభాష్యం, మున్నేరు, రాజోలిబండ కుడి కాలువ విస్తరణ, ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీ, గోదావరి- పెన్నా నది అనుసంధానం మొదటి దశలో భాగంగా హరిశ్చంద్రపురం- నకిరేకల్లు మధ్య ప్రాజెక్టు, వేదాద్రి నది ఎత్తిపోతల పథకం, నాగులదిన్నె ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, తుంగభద్రపై కొత్త ప్రాజెక్టు, బనకచర్ల కాంప్లెక్స్‌ ద్వారా 80వేల క్యూసెక్కులను మళ్లించే రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లను తక్షణమే సమర్పించాలని షెకావత్‌ కోరారు. అలాగే గోదావరిపై నిర్మిస్తున్న పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలతో సహా గోదావరి- పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలను వినియోగించే పథకాల డీపీఆర్‌లను సమర్పించాలని సీఎం జగన్‌కు కేంద్ర మంత్రి సూచించారు. కాగా, తెలంగాణలో మొత్తం 15 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉందని సీఎం కేసీఆర్‌కు రాసిన మరో లేఖలో షెకావత్‌ కోరారు. వీటిలో కృష్ణానదిపై 8, గోదావరిపై 7 చొప్పున ఉన్నాయని, ఈ కొత్త ప్రాజెక్టులకు కేంద్ర అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-01-17T08:29:04+05:30 IST