నారీ మనీ

ABN , First Publish Date - 2021-03-07T06:10:10+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో స్త్రీల విజయాల్ని స్మరించుకునేందుకు ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది మహిళా దినోత్సవం సవాళ్లను స్వీకరించే వారికి అంకితం. వ్యక్తిగత ఆర్థిక భద్రత, స్వేచ్ఛను సవాలుగా స్వీకరించి

నారీ మనీ

మహిళలు ఆర్థిక భద్రత, స్వేచ్ఛను సాధించుకోవచ్చిలా.. 


ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో స్త్రీల విజయాల్ని స్మరించుకునేందుకు ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది మహిళా దినోత్సవం సవాళ్లను స్వీకరించే వారికి అంకితం. వ్యక్తిగత ఆర్థిక భద్రత, స్వేచ్ఛను  సవాలుగా స్వీకరించి, సాకారం చేసుకోండిలా.. 


ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి.. 

చాలా మంది మహిళలు, స్వంతంగా ఆర్జిస్తున్నవారు సైతం ఆర్థిక నిర్వహణ బాధ్యతల్ని తండ్రి లేదా భర్త లేదా అన్నదమ్ములకు అప్పజెప్పేస్తుంటారు. అలాకాకుండా, మీ డబ్బును స్వంతంగా నిర్వహించుకోవడం అలవాటు చేసుకోండి. ఇందుకోసం ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి.  వ్యక్తిగత రాబడి, వ్యయాలపై సొంతంగా బడ్జెట్‌ రూపకల్పనతోపాటు డబ్బు ఆదాకూ  ప్రణాళికనూ ఏర్పాటు చేసుకోండి. డబ్బు నిర్వహణకు సంబంధించిన కథనాలను క్రమం తప్పకుండా చదవడం ద్వారా ఆర్థిక అవగాహన పెంచుకోవచ్చు. 


కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో పాలుపంచుకోండి.. 

మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో చురుకుగా పాలుపంచుకోండి. కుటుంబ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. అవసరాలు తీర్చుకోవడంతోపాటు లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషిచేయవచ్చు. ఇది వ్యక్తిగతంగానే కాకుండా మీ కుటుంబానికీ ఉపయోగపడుతుంది. 


వ్యక్తిగత లక్ష్యాల్ని విస్మరించవద్దు.. 

పిల్లల విద్య, గృహ కొనుగోలు వంటి కుటుంబ లక్ష్యాలే కాదు.. మీ వ్యక్తిగత ఆశయాలు, కోరికలనూ విస్మరించవద్దు. విహారయాత్ర, ఆభరణం లేదా ఏదేని గ్యాడ్జెట్‌ కొనుగోలు వంటి అవసరాల కోసమూ డబ్బు కూడబెట్టుకోండి. 


పెట్టుబడికి సరైన వ్యూహం 

సాధారణంగా పొదుపు విషయంలో మగవారి కంటే మహిళలే మెరుగు. కానీ, పొదుపు సొమ్మును సరైన పథకాల్లో పెట్టుబడి పెట్టడమెలాగో తెలియడమూ ముఖ్యమే. ఈ విషయంపైనా పట్టు పెంచుకోవాలి. తక్కువ రిస్క్‌, ఆకర్షణీయ ప్రతిఫలాలు అందించే ఆర్థిక సాధనాల గురించి తెలుసుకోండి. మీ వెసులుబాటును బట్టి పెట్టుబడుల్లో రిస్క్‌ తీసుకోగలిగితే, రిటర్నులూ అదే స్థాయిలో లభిస్తాయి. కాకపోతే, ఇలాంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోండి. పెట్టుబడులతోపాటు జీవిత, ఆరోగ్య బీమా సౌకర్యాన్ని సమకూర్చుకోవాలి. 


అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి.. 

ఆర్థిక అత్యవసరాలను తీర్చుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం కూడబెట్టే సొమ్మును బ్యాంక్‌లో జమ చేయడం లేదా సులభంగా నగదులోకి మార్చుకోగలిగే పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సులభంగా వెనక్కి తీసుకోగలం. కనీసం 3-6 నెలలపాటు కుటుంబ అవసరాలను తీర్చుకోగలిగే స్థాయిలో నిధిని ఏర్పాటు చేసుకోవడం మేలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-03-07T06:10:10+05:30 IST