తేలుస్తారా తప్పిస్తారా?

ABN , First Publish Date - 2022-09-09T04:06:30+05:30 IST

వనపర్తి జిల్లా పాన్‌గల్‌ పీహెచ్‌సీలో గత మేలో ప్రసవం సందర్భంగా తల్లీ బిడ్డలు మృతి చెందిన కేసు మిస్టరీ ఇంకా వీడటం లేదు. పలుమార్లు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విచారణ చేసినా దోషులెవరనే విషయం కొలిక్కి రాలేదు. మొదటి నుంచి ఈ ఘటన విషయంలో కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నారు.

తేలుస్తారా తప్పిస్తారా?
పానగల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఇంకా వీడని పానగల్‌ తల్లీబిడ్డల మృతి కేసు మిస్టరీ..

కొనసాగుతున్న విచారణ..  

డాక్టర్‌, స్టాఫ్‌ నర్స్‌లకు రీపోస్టింగ్‌

ప్రసవం చేసిన డాక్టర్‌ తప్పేలేదనట్లుగా అధికారుల తీరు

వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల విచారణపై కలెక్టర్‌ అసంతృప్తి

విచారణ బాధ్యత మెడికల్‌ కాలేజీ అధికారులకు అప్పగింత


వనపర్తి జిల్లా పాన్‌గల్‌ పీహెచ్‌సీలో గత మేలో ప్రసవం సందర్భంగా తల్లీ బిడ్డలు మృతి చెందిన కేసు మిస్టరీ ఇంకా వీడటం లేదు. పలుమార్లు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విచారణ చేసినా దోషులెవరనే విషయం కొలిక్కి రాలేదు. మొదటి నుంచి ఈ ఘటన విషయంలో కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విచారణ బాధ్యతలు వనపర్తి మెడికల్‌ కళాశాల అధికారులకు అప్పగించగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఘటన జరిగి నాలుగు నెలలైనా ఇప్పటికీ దోషులెవరో తెలియకపోవడంతో అసలు ఈ కేసు మిస్టరీని తెల్చుతారా? లేక దోషులను తప్పిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

- ఆంధ్రజ్యోతి, వనపర్తి


పాన్‌గల్‌ పీహెచ్‌సీలో తల్లీ బిడ్డలు మృతి కేసు కొనసా...గుతోంది. ఈ కేసు ప్రాథమిక విచారణ సందర్భంగా పీహెచ్‌సీ డాక్టర్‌, స్టాఫ్‌ నర్సుపై సస్పెన్షన్‌ వేటు వేసిన అధికారులు కొద్ది రోజుల కిందట వారికి రీపోస్టింగ్‌ ఇచ్చారు. డాక్టర్‌ను వీపనగండ్ల పీహెచ్‌సీకి కేటాయించగా, స్టాఫ్‌ నర్సును శ్రీరంగాపూర్‌ పీహెచ్‌సీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో విచారణ ఇంకా పెండింగ్‌లో ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు దోషులను తప్పించేందుకే ఆ రోజు ఫీల్డ్‌లో ఉన్న డాక్టర్‌పై చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, అసలు ప్రసవాన్ని చేసిన ప్రోగ్రాం ఆఫీసర్‌పై ఇప్పటివరకు నిర్దుష్టంగా చర్యలు తీసుకోకపోవడం, కేవలం మెమోతో సరిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే అప్పట్లో ఆ మొమోకు సదరు ఆఫీసర్‌ ఇచ్చిన సమాధానం కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం మెడికల్‌ కళాశాల అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగా త్వరలోనే విషయం కొలిక్కి వస్తుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వారిపై వైద్యారోగ్యశాఖ అధికారుల ఒత్తిడి ఉండదు కాబట్టి స్పష్టమైన నివేదిక కలెక్టర్‌కు అందజేసే అవకాశం ఉంది. 


తాజా ఘటనలతో మరకలు..

వనపర్తి వైద్యారోగ్యశాఖ అధికారుల తీరుపై ఇటీవల పలు విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అక్రమార్కులకు అండదండలు అందించడం, దోషులను పక్కకు తప్పించి డిప్యూటేషన్లు ఇప్పించడం, ఒకరికి బదులు మరొకరు డ్యూటీలు చేయడం వంటి విషయాల్లో అనేక ఆరోపణలను వైద్యారోగ్యశాఖ అధికారులు ఎదుర్కొంటున్నారు. పలు పత్రికల్లో పతాక శీర్షికన వార్తా కథనాలు ప్రచురితమవుతున్నా ఇప్పటికీ చాలా అంశాల్లో అధికారులు చర్యలకు ఉపక్రమించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించి, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను గణనీయంగా పెంచింది. ఈ క్రమంలో పానగల్‌ తల్లీబిడ్డల మృతి కేసు నమోదు కావడం, కేసుకు సంబంధం లేని డాక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు వేయడం, తర్వాత ఆ డాక్టర్‌ ఇచ్చిన సంజాయిషీ తర్వాత రీపోస్టింగ్‌ ఇవ్వడం వంటి విషయాలతో చాలామంది డాక్టర్లు ప్రసవాలు చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టు వైద్యులుగా పని చేస్తున్న చాలా మంది ఇదే అభిప్రాయంలో ఉన్నారు. తల్లీబిడ్డల మృతి కేసులో దోషులెవరో తేల్చితే.. మిగతా డాక్టర్లకు తప్పు జరిగినప్పుడు సరైన చర్యలు ఉంటాయనే భరోసా ఏర్పడేది. కానీ ప్రస్తుతం అవలంభిస్తున్న నాన్చుడు ధోరణి వల్ల భరోసా దెబ్బతినే అవకాశం ఉంది. కేవలం తమ శాఖలో పనిచేసే అధికారిని వెనకేసుకు వచ్చే ప్రయత్నాలు చేయడం వల్లనే అధికారుల తీరుపై నమ్మకం సన్నగిల్లుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అక్రమార్కుల్లో ధీమా..

సాధారణంగా కింది స్థాయి అధికారులు ఏదైనా తప్పు చేస్తే సరైన సమయంలో నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడు తప్పు చేసిన వారిలో భయం కలుగుతుంది. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆ తప్పులు చేయడానికి జంకుతారు. కానీ వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమార్కులు మరింత ధీమాగా ఉండటానికి ఉన్నతాధికారులు నిర్దుష్టంగా చర్యలు తీసుకోకపోవడమే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర అధికారుల నుంచి ఒత్తిడి వస్తే తప్ప చర్యలకు ఉపక్రమించకపోవడం, చర్యలు తీసుకున్నా వెంటనే ఇతర జిల్లాలకు డిప్యూటేషన్‌పై పంపడం వంటివి కూడా సిబ్బందికి ఎనలేని ధీమాను కలిగిస్తున్నాయి. పానగల్‌ తల్లీబిడ్డల మృతి కేసుకు సంబంధించి కూడా కొందరిని కాపాడటానికి మాత్రమే ఇప్పటివరకు విచారణ జరిగినట్లు ఉన్నతాధికారులకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. అందుకే పలుమార్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన విచారణ నివేదికపై వారు అసంతృప్తిగా ఉండి, ఆ బాధ్యతలను వేరొకరికి అప్పగించడం అందులో భాగమనే చెప్పొచ్చు. దుర్ఘటన జరిగి నాలుగు నెలలు పూర్తవుతోంది. మొదట్లోనే అధికారులు సరైన నివేదిక ఇచ్చి, దోషులెవరో తెలిసి ఉంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగడంతోపాటు కేసులో తప్పు లేకున్నా ఇబ్బందులు పడ్డవారికి ఉపశమనం లభించేదనే అభిప్రాయం ఉంది. 


విచారణ జరుగుతోంది

పానగల్‌ తల్లీ బిడ్డల మృతి కేసుపై కలెక్టర్‌ కమిటీ వేసి విచారణ చేయించారు. ప్రాథమికంగా సస్పెండ్‌ చేసిన డాక్టర్‌కు వీపనగండ్ల పీహెచ్‌సీలో, నర్సుకు శ్రీరంగాపూర్‌ పీహెచ్‌సీకి పోస్టింగ్‌ ఇచ్చాం. ప్రస్తుతం మెడికల్‌ కాలేజీ అధికారుల కమిటీ ఏం తేల్చితే దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. విచారణ అంటే ఒక్కరోజులో ముగియదు కదా? మొదట్లో చేసిన విచారణ సరిగా లేకపోవడంతోనే మళ్లీ విచారణకు ఆదేశించారు. అసలు ఆ మృతి కేసులో ప్రోగ్రాం ఆఫీసర్‌ తప్పులేదు. ఆమెను రిక్వెస్ట్‌ చేస్తే డెలివరీ చేసి వచ్చారు. తర్వాత చూసుకోవాల్సింది సదరు పీహెచ్‌సీ డాక్టర్‌, సిబ్బందే. వారి నిర్లక్ష్యం వల్లనే ఘటన జరిగింది. 

- డాక్టర్‌ రవిశంకర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో, వనపర్తి 

Updated Date - 2022-09-09T04:06:30+05:30 IST