నేను కాకుండా ఇంకెవరు ?: ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2022-01-21T21:28:20+05:30 IST

''నేను కాకుండా ఇంకెవరు ఉంటారు?. మీరు ఎక్కడ చూసినా అక్కడ నేనే కనిపిస్తున్నాను కదా..'' అని ప్రియాంక గాంధీ వాద్రా..

నేను కాకుండా ఇంకెవరు ?: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ''నేను కాకుండా ఇంకెవరు ఉంటారు?. మీరు ఎక్కడ చూసినా అక్కడ నేనే కనిపిస్తున్నాను కదా..'' అని ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.  ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని అడిగిన ప్రశ్నకు ప్రియాంక గాంధీ బుధవారంనాడు ఇచ్చిన సమాధానం ఇది. 


యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10తో పోలింగ్ మొదలై మార్చి 7వ తేదీతో పోలింగ్ ముగుస్తుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం యూపీలో అంతంతమాత్రంగానే ఉంటూ వచ్చింది. అయితే, ఈసారి యువత, మహిళలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తూ ఎన్నికలకు వెళ్తోంది. తమ పార్టీ వైపు మళ్లీ ప్రజలు చూస్తున్నారని, గెలుపు తమదేననని ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రియాంక సారథ్యం వహిస్తున్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోగా, తదనంతర క్రమంలో అక్కడ ఎన్నికల ప్రచార బాధ్యతను ప్రియాకం తన భుజాలపై వేసుకున్నారు.


యూపీని 1967లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పాలించారు.ఆ తర్వాత తిరిగి 1969 నుంచి 1970 వరకూ కాంగ్రెస్ పాలన సాగింది. కాంగ్రెస్ నేత ఎన్‌డీ తివారీ ఆ పార్టీ చివరి సీఎంగా ఉన్నారు. 1976 నుంచి 1977, 1984 నుంచి 1985, 1988 నుంచి 1989 వరకూ మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాష్ట్రాన్ని పాలించలేదు. కాగా, ఈసారి యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గట్టి ఆశలే పెట్టుకున్నప్పటికీ ఒపీనియన్ పోల్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు ఉనికి కోల్పోవచ్చని, 2 నుంచి 5 సీట్లకు పరిమితం కావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అభిప్రాయంగా ఉంది.

Updated Date - 2022-01-21T21:28:20+05:30 IST