భారత విమానాలపై బ్యాన్‌ను మరోసారి పొడిగించిన కెనడా!

ABN , First Publish Date - 2021-08-10T17:12:16+05:30 IST

కెనడా మరోసారి భారతీయ విమాన సర్వీసులపై బ్యాన్‌ను పొడిగించింది. భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది.

భారత విమానాలపై బ్యాన్‌ను మరోసారి పొడిగించిన కెనడా!

ఒట్టావా: కెనడా మరోసారి భారతీయ విమాన సర్వీసులపై బ్యాన్‌ను పొడిగించింది. భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న తొలిసారి భారత విమానాలపై కెనడా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాన్‌ను పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఐదోసారి నిషేధాన్ని పొడిగించింది. అయితే, కార్గో, ఇతర అత్యావసర విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని, పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా కెనడా అధికారులు వెల్లడించారు.


సెప్టెంబర్ 21, రాత్రి 11.59 గంటల వరకు భారత్ నుంచి వచ్చే అన్ని కమర్షియల్, ప్రైవేట్ ప్యాసెంజర్ విమానాలపై బ్యాన్ కొనసాగుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. కాగా, నేరుగా వచ్చే విమానాల ద్వారా కాకుండా ఇతర దేశాల గుండా కెనడా వచ్చే భారతీయులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూఏఈ‌తో పాటు ఇతర కొన్ని దేశాలు భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రయాణాలపై పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.    

Updated Date - 2021-08-10T17:12:16+05:30 IST