Abn logo
Sep 26 2021 @ 12:38PM

భారత ప్రయాణికులకు తీపి కబురు చెప్పిన Canada..

ఒట్టావా: భారత ప్రయాణికులకు కెనడా తీపి కబురు చెప్పింది. భారత విమానాలపై నిషేధాన్ని తొలగించింది. దీంతో ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలపై ఐదు నెలలకు పైగా కొనసాగిన బ్యాన్ తొలిగిపోయింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే సోమవారం(సెప్టెంబర్ 27) నుంచి భారత్‌కు డైరెక్ట్ విమానాలు నడపనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ కెనడా తాజాగా ప్రకటించింది. రేపు ఎయిర్ కెనడాకు చెందిన తొలి విమానం భారత్ నుంచి కెనడాకు బయల్దేరనుంది. ఈ నెల 30 నుంచి ఎయిర్ ఇండియా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తుంది. 

"డైరెక్ట్ విమానంలో కెనడాకు వచ్చే  ప్రయాణికులు తప్పనిసరిగా జర్నీకి 18 గంటల ముందు ఢిల్లీ విమానాశ్రయంలో తీసుకున్న ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. క్యూఆర్ కోడ్‌తో కూడిన సర్టిఫికేట్‌ను విమానాశ్రయంలో ఇస్తారు. కనుక బోర్డింగ్‌కు ముందు చెక్ చేసుకోవాలి." అని ట్రాన్స్‌పోర్ట్ కెనడా పేర్కొంది. అలాగే ఇంతకుముందు కరోనా బారిన పడి కోలుకున్నవారు సైతం నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణానికి 14 రోజుల నుంచి 180 రోజుల ముందు సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా ఈ షరతులకు లోబడి లేకుంటే ఎయిర్‌లైన్లు బోర్డింగ్‌కు నిరాకరించవచ్చని స్పష్టం చేసింది. 


ఇక భారత విమానాలపై కెనడా నిషేధాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఒట్టావాలోని భారత హై కమిషనర్ అజయ్ బిసరియా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య రాకపోకలకు మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత విమానాలపై కెనడా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని తొలగించడంతో దాదాపు ఐదు నెలల తర్వాత ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. కాగా, ఈ నెల 22న ఢిల్లీ నుంచి కెనడా వెళ్లిన మూడు విమానాల్లోని భారత ప్రయాణికులకు నెగెటివ్ రావడంతో తాజాగా రెండు దేశాల మధ్య విమానాల సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ట్రాన్స్‌పోర్ట్ కెనడా అంగీకరించింది.  

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...