కెనడా రక్షణకు మన మహిళ!

ABN , First Publish Date - 2021-10-28T03:56:05+05:30 IST

కొవిడ్‌ సమయంలో ఆమె మంత్రిగా చురుగ్గా స్పందించి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆ చురుకుదనమే ఇప్పుడు రక్షణశాఖ.l.....

కెనడా రక్షణకు మన మహిళ!

కొవిడ్‌ సమయంలో ఆమె మంత్రిగా చురుగ్గా స్పందించి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆ చురుకుదనమే ఇప్పుడు రక్షణశాఖ బాధ్యతలను అందుకునేలా చేసింది. ఆమే భారత సంతతికి చెందిన 54 ఏళ్ల అనితా ఆనంద్‌.  ఇటీవలే ఆమె కెనడా రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 


భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌కు కీలకమైన రక్షణశాఖ మంత్రి పదవి దక్కింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా హర్జిత్‌ సజ్జన్‌ స్థానంలో ఆమెకు ఈ అవకాశం దక్కింది. సైనికవిభాగంలో లైంగిక ఆరోపణలకు సంబంధించిన విమర్శలు తీవ్రం కావడంతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో హర్జిత్‌ను తప్పించి అనితా ఆనంద్‌ను రక్షణశాఖ మంత్రిగా తీసుకున్నారు. హర్జిత్‌ సజ్జన్‌ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే. రక్షణ శాఖ బాధ్యతలను తప్పించిన సజ్జన్‌కు ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ మంత్రిగా కొత్త బాధ్యతలు అప్పగించారు.


పనితీరు మెచ్చి....

కొత్తగా బాధ్యతలు చేపట్టిన అనితా ఆనంద్‌  రక్షణరంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో సైనికవిభాగంలో ప్రవర్తన సరిగ్గా లేని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం కెనడా సైనికరంగంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వీటన్నింటికి అనితా ఆనంద్‌ చెక్‌ పెడుతుందని భావిస్తున్నారు. ఆనిత గతంలో న్యాయవాదిగా పనిచేశారు. ఫైనాన్షియల్‌ మార్కెట్‌, కార్పొరేట్‌ గవర్‌నెన్స్‌, షేర్‌ హోల్డర్‌ రైట్స్‌ వంటి అంశాలపై పరిశోధన చేశారు. ఈ అంశాలపై మీడియాలో జరిగే చర్చల్లో పాల్గొనే వారు. ఆ తరువాత 2015లో ఆమెను ప్రభుత్వం ఒంటారియో ఎక్స్‌పర్ట్‌ కమిటీకి ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా నియమించింది. అనితా ఆనంద్‌ ఓక్‌విల్లే నుంచి సుమారు 46 శాతం ఓట్‌ షేర్‌తో ఘన విజయం సాధించారు. కొవిడ్‌ సమయంలో ఆమె ప్రొక్యూర్‌మెంట్‌ మినిస్టర్‌గా చురుగ్గా పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. 


తల్లిదండ్రుల్దిదరూ వైద్యులే!

ప్రస్తుతం కెనడా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. అనితా ఆనంద్‌తో పాటు సజ్జన్‌, బర్దిష్‌ చాగర్‌ మంత్రులుగా ఉన్నారు. అనిత తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తల్లి సరోజ్‌ డి.రామ్‌ అనెస్ఠీషియాలజిస్టుగా, తండ్రి ఎస్‌.వి ఆనంద్‌ జనరల్‌ సర్జన్‌గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి తమిళనాడు, తల్లి పంజాబ్‌కు చెందినవారు. అనితా ఆనంద్‌కు గీతా ఆనంద్‌, సోనియా ఆనంద్‌ అని ఇద్దరు సిస్టర్స్‌ ఉన్నారు. గీతా ఆనంద్‌ టొరంటోలో ఎంప్లాయిమెంట్‌ లాయర్‌గా, సోనియా ఆనంద్‌ మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీలో మెడికల్‌ డాక్టర్‌గా, పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు.

Updated Date - 2021-10-28T03:56:05+05:30 IST