కర్ఫ్యూ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి.. కెనడియన్ మహిళ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-01-14T01:25:28+05:30 IST

కెనడాలో కర్ఫ్యూ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఓ మహిళ చెప్పిన కారణం, దాని తాలుకూ దృశ్యాలు అక్కడి పోలీసులకు షాకిచ్చినంత పని చేసింది.

కర్ఫ్యూ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి.. కెనడియన్ మహిళ ఏం చేసిందంటే..

ఒట్టావా: కెనడాలో కర్ఫ్యూ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఓ మహిళ చెప్పిన కారణం, దాని తాలుకూ దృశ్యం అక్కడి పోలీసులకు షాకిచ్చినంత పని చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కెనడా సర్కార్ శనివారం నుంచి దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ నెల 9వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ఫ్యూ విధించిన మొదటి రోజే క్యూబెక్ అనే ప్రాంతంలో ఓ వింత ఘటన ఎదురైంది అక్కడి పోలీసులకు. విధుల్లో ఉన్న పోలీసులకు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో స్థానికంగా ఓ జంట బయట తిరగడం కనిపించింది. కర్ఫ్యూ సమయంలో వారు అలా బయట తిరగడం చూసిన పోలీసులు ఆ దంపతులను ఆపారు. 


రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ ఉంది.. ఈ సమయంలో మీరు బయట తిరగడం ఏంటని వారిని ప్రశ్నించారు. దానికి భార్య చెప్పిన సమాధానం విన్న పోలీసులకు మతిపోయినంత పనైంది. కర్ఫ్యూ నిబంధనల ప్రకారం ఇంటి నుంచి కిలోమీటర్ దూరం వరకు పెంపుడు జంతువులతో వాకింగ్ వెళ్లే వెసులుబాటు ఉంది కదా. అందుకే నా కుక్కతో వాకింగ్‌కు వచ్చానని చెప్పింది. అప్పటికే ఆ దంపతుల వద్ద పెంపుడు జంతులేవీ లేకపోవడం పోలీసులు చూశారు. కానీ ఆమె చెప్పిన సమాధానం విన్న పోలీసులు కంగుతిన్నారు. వెంటనే ఎక్కడ నీ కుక్క అని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు అలా అడగడమే ఆలస్యం ఆమె వెంటనే తన భర్తను చూపించింది. దాంతో పోలీసులకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘన కింద ఆ దంపతులకు 1500 డాలర్లు(రూ.1,09,934) జరిమానా విధించారు. దాంతో ఆ దంపతులు జరిమానా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉంటే.. కెనడాలో తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.74 లక్షల మందికి సోకగా.. 17వేలకు పైగా మంది మరణించారు.  

Updated Date - 2021-01-14T01:25:28+05:30 IST