అదరగొట్టిన కెనరా బ్యాంక్‌

ABN , First Publish Date - 2021-10-27T08:07:07+05:30 IST

క్యూ2 లాభంలో మూడింతల వృద్ధి.. రూ.1,333 కోట్లుగా నమోదు....

అదరగొట్టిన కెనరా బ్యాంక్‌

క్యూ2 లాభంలో మూడింతల వృద్ధి.. రూ.1,333 కోట్లుగా నమోదు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.1,333 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలం (రూ.444 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా మూడింతలు పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో మొండి పద్దుల చేసిన కేటాయింపులు తక్కువగా ఉండటంతో పాటు వడ్డీయేతర ఆదాయం, నిర్వహణా లాభం గణనీయంగా పెరగటం ఎంతగానో కలిసి వచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ అన్నారు. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.20,793.92 కోట్ల నుంచి రూ.21,331.49 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ కాలంలో నిర్వహణా లాభం 22 శాతం వృద్ధితో రూ.4,597 కోట్ల నుంచి రూ.5,604 కోట్లకు పెరగగా వడ్డీయేతర ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.4,268 కోట్లుగా నమోదైందని వెల్లడించారు. కాగా మొండి పద్దుల (ఎన్‌పీఏ) కోసం చేసిన కేటాయింపులు రూ.3,533 కోట్ల నుంచి రూ.2,678 కోట్లకు తగ్గాయని తెలిపారు. స్థూల ఎన్‌పీఏలు 8.23 శాతం నుంచి 8.42 శాతానికి పెరగగా నికర ఎన్‌పీఏలు మాత్రం 3.42 శాతం నుంచి 3.21 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి స్థూల ఎన్‌పీఏలు 7.5 శాతం, నికర ఎన్‌పీఏలు 2.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్రైమాసిక కాలంలో దేశీయ డిపాజిట్లు 7.61 శాతం వృద్ధి చెంది రూ.9,80,337 కోట్లకు చేరుకోగా అడ్వాన్సులు 5.71 శాతం పెరిగి రూ.6,62,991 కోట్లకు చేరుకున్నాయని బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి రేటు 7.5 శాతం, రిటైల్‌ రుణాల్లో 10 శాతానికి పైగా వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ప్రభాకర్‌ తెలిపారు. విలీనం అనంతరం బ్యాంకు శాఖల సంఖ్య 9,800కు చేరుకుందన్నారు.  

Updated Date - 2021-10-27T08:07:07+05:30 IST