కెనరా బ్యాంక్‌ లాభంలో మూడింతల వృద్ధి

ABN , First Publish Date - 2021-07-28T06:52:37+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.

కెనరా బ్యాంక్‌ లాభంలో మూడింతల వృద్ధి

జూన్‌ త్రైమాసిక లాభం రూ.1,177 కోట్లు 

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మొండి పద్దుల (ఎన్‌పీఏ) కోసం చేసిన కేటాయింపులు తగ్గటంతో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా మూడింతలు పెరిగి రూ.1,177 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.406 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదా యం రూ.20,685.91 కోట్ల నుంచి రూ.21,210.06 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,096 కోట్ల నుంచి రూ.6,147 కోట్లకు పెరిగింది. త్రైమాసిక కాలంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 8.84 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గగా.. నికర ఎన్‌పీఏలు 3.95 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గాయి. కాగా ప్రొవిజన్‌ కవరేజీ రేషియో (పీసీఆర్‌) 78.95 శాతం నుంచి 81.18 శాతానికి మెరుగుపడింది. 


వసూళ్లు పెరుగుతున్నాయ్‌: జూన్‌ త్రైమాసికం ముగిసే నాటికి బకాయిల వసూళ్ల సామర్థ్యం 91 శాతానికి చేరుకుందని కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. రుణదాతలు బకాయిలను తిరిగి చెల్లిస్తుండటమే ఇందుకు కారణమని  ఆయన పేర్కొన్నారు. రిసొల్యూషన్‌ ప్రక్రియ, రుణాల పునర్‌ వ్యవస్థీకరణ కింద రుణదాతలకు అవసరమైన పరిష్కారం చూపుతుండటంతో ఒత్తిడి తగ్గుతూ వస్తోందని ఆయన అన్నారు. ఆర్‌బీఐ రిసొల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 కింద రూ.13,234 కోట్ల విలువైన రుణాలను పునర్‌ వ్యవస్థీకరించినట్లు ప్రభాకర్‌ తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో రిటైల్‌, ఎంఎ్‌సఎంఈ, చిన్న వ్యాపారుల నుంచి బకాయిల వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్లను రికవరీ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే మార్చి కన్నా ముందే దీన్ని అందుకోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 


డిపాజిట్లలో 11.6 శాతం వృద్ధి : జూన్‌ ముగిసే నాటికి దేశీయ డిపాజిట్లు 11.6 శాతం వృద్ధితో రూ.9,70,481 కోట్లకు చేరుకోగా స్థూల దేశీయ అడ్వాన్సులు 5.94 శాతం పెరిగి రూ.6,61,236 కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 2021-22లో రుణ వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని బ్యాంక్‌ అంచనా వేస్తోంది. కాగా బ్యాంక్‌ గ్లోబల్‌ టర్నోవర్‌ రూ.17 లక్షల కోట్లకు చేరుకుంది. 

Updated Date - 2021-07-28T06:52:37+05:30 IST