టెన్త్‌ పరీక్షలు రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-04-21T09:37:27+05:30 IST

పది, ఇంటర్‌ పరీక్షల విషయంలో మొండి పట్టుదలకు పోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల క్షేమం దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

టెన్త్‌ పరీక్షలు రద్దు చేయండి

  • ఇంటర్‌ వాయిదా వేయండి: లోకేశ్‌ 

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): పది, ఇంటర్‌ పరీక్షల విషయంలో మొండి పట్టుదలకు పోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల క్షేమం దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పది, ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం ఆయన తమ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నేతలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి చర్చించారు. ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అధ్యయనం ప్రకారం ఏప్రిల్‌ ఇరవై నుంచి జూన్‌ పది మధ్యలో కరోనా కేసులు అనూహ్యంగా పెరగనున్నాయని తేలింది. మన రాష్ట్రం కూడా కరోనా కోరల్లో ఇరుక్కొంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 27 మంది చనిపోయారు. కరోనా పరీక్షల్లో మన రాష్ట్రంలో 12.5 శాతం మందికి పాజిటివ్‌గా వస్తోంది. ఇది దేశ సగటు కంటే బాగా ఎక్కువ. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదు. పరీక్షలను విద్యార్థుల పాలిట విషమ పరీక్షలుగా మార్చవద్దు’ అని ఆయన కోరారు. సీబీఎ్‌సఈ పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. అనేక రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేశాయి. రాష్ట్రం కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. పరిస్థితి తీవ్రతను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఒక కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-04-21T09:37:27+05:30 IST