75 ఏళ్ల తర్వాత తొలిసారి..వింబుల్డన్‌ రద్దు

ABN , First Publish Date - 2020-04-02T10:01:45+05:30 IST

కరోనా మహమ్మారి సెగ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌కూ తగిలింది. పురాతనమైన గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ టెన్నిస్‌ టోర్నీని కొవిడ్‌-19 కారణంగా రద్దు ...

75 ఏళ్ల తర్వాత తొలిసారి..వింబుల్డన్‌ రద్దు

లండన్‌: కరోనా మహమ్మారి సెగ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌కూ తగిలింది. పురాతనమైన గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ టెన్నిస్‌ టోర్నీని కొవిడ్‌-19 కారణంగా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. దీంతో 75 ఏళ్ల (చివరిసారి 1945లో) తర్వాత తొలిసారిగా ఈ టోర్నీ రద్దయినట్టయింది. వాస్తవంగా జూన్‌ 29 నుంచి జూలై 12 వరకు ఈ ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ టోర్నీ జరగాలి. తదుపరి టోర్నీ 2021 జూన్‌ 28 నుంచి జూలై 11 వరకు జరగనున్నట్టు వెల్లడించారు. 143 ఏళ్ల క్రితం అంటే...1877లో ప్రారంభమైన వింబుల్డన్‌ను ఇప్పటివరకు పదిసార్లు మినహా నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1915 నుంచి 1918 వరకు (4 సార్లు), రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 నుంచి 1945 వరకు (6 సార్లు) జరపలేదు. ఇక..కరోనా వైరస్‌తో ఫ్రెంచ్‌, యూఎస్‌ ఓపెన్‌లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-04-02T10:01:45+05:30 IST