Abn logo
Jul 14 2020 @ 00:36AM

క్యాన్సర్‌ కబళించింది

గంటల వ్యవధిలో క్యాన్సర్‌ మహమ్మారి ఇద్దరు కథానాయికలను కబళించింది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాన్‌ ట్రవోల్టా భార్య, నటి కెల్లీ ప్రీస్టన్‌ (57) ఆదివారం మరణించారు. ఆమెకు రొమ్ము క్యాన్సర్‌. రెండేళ్లుగా ఈ వ్యాధితో ఆమె పోరాడుతున్నారు. పోరాటంలో చివరకు క్యాన్సర్‌కు తలొగ్గక  తప్పలేదు. తన భార్య మరణవార్తను బాధాతప్త హృదయంతో జాన్‌ ట్రవోల్టా ప్రకటించారు. కెల్లీ ప్రీస్టన్‌కు చికిత్స చేసిన వైద్యులు, నర్సులను తమ కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్‌ కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన మరో నాయిక దివ్యా చౌక్సే. ఆమె వయసు 29 సంవత్సరాలే. సుమారు ఏడాదిన్నరగా క్యాన్సర్‌తో పోరాటం చేసి చేసి అలసి సొలసి శ్వాస వదిలారు. హిందీలో దివ్యా చౌక్సే సినిమాలు, సీరియల్స్‌ చేశారు. ‘హై అప్నా దిల్‌ తో అవారా’ (2016) ఆమెకు తొలి చిత్రం. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె, చిన్న వయసులో క్యాన్సర్‌ కారణంగా ప్రాణాలు కోల్పోవడం శోచనీయం. ఆమె మృతి, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆమె చిట్టచివరి పోస్ట్‌ పలువుర్ని కంటతడి పెట్టించింది. ‘‘నా భావాలు చెప్పడానికి పదాలు సరిపోవు. నేను కొన్ని నెలలుగా ప్రేక్షకుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాను. నాకు వాళ్ల నుంచి చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను అంపశయ్యపై ఉన్నాను. ఎటువంటి బాధలు లేని మరో జన్మ కోసం వేచి చూస్తున్నా. నో క్వశ్చన్స్‌ ప్లీజ్‌. మీ అందరికీ నేనెంత విలువ ఇస్తానో భగవంతుడికి తెలుసు’’ అని మరణించడానికి ఒక్క రోజు ముందు దివ్యా చౌక్సే పోస్ట్‌ చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని పలువురు హిందీ తారలు గుర్తు చేసుకున్నారు. నివాళులు అర్పించారు.


Advertisement
Advertisement
Advertisement