కేన్సర్‌ కీహోల్‌ సర్జరీలు చిన్న కోతతో చేసే సర్జరీలు!

ABN , First Publish Date - 2021-03-02T06:06:10+05:30 IST

మిగతా వ్యాధుల్లో సర్జరీ అంతిమంగా చేసే వైద్య చికిత్స. కానీ కేన్సర్‌ వ్యాధి ఇందుకు పూర్తి విరుద్ధం. రక్తానికి చెందిన కేన్సర్‌ మినహా మిగతా అన్ని రకాల కేన్సర్‌లలో వ్యాధి నిర్థారణ జరిగిన తర్వాత, ఆ వ్యాధి తొలి దశలోనే సర్జరీ చేయవలసి ఉంటుంది

కేన్సర్‌ కీహోల్‌ సర్జరీలు చిన్న కోతతో చేసే సర్జరీలు!

మిగతా వ్యాధుల్లో సర్జరీ అంతిమంగా చేసే వైద్య చికిత్స. కానీ కేన్సర్‌ వ్యాధి ఇందుకు పూర్తి విరుద్ధం. రక్తానికి చెందిన కేన్సర్‌ మినహా మిగతా అన్ని రకాల కేన్సర్‌లలో వ్యాధి నిర్థారణ జరిగిన తర్వాత, ఆ వ్యాధి తొలి దశలోనే సర్జరీ చేయవలసి ఉంటుంది. కేన్సర్‌ కణితితో పాటు దాని చుట్టూ ఉన్న కణజాలాన్ని సర్జరీతో తొలగిస్తే, కేన్సర్‌ను పూర్తిగా నయం చేసే వీలుంటుంది. ఇందుకోసం కీహోల్‌, ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీలు ఉన్నాయి.


చిన్న కోతతో మినిమల్లీ ఇన్వేసివ్‌, లాప్రోస్కోపిక్‌, కీహోల్‌ సర్జరీలతో ఇబ్బందులు తక్కువ. నెలల తరబడి విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉండదు. హెర్నియా తలెత్తే సమస్యలూ ఉండవు. 20 సెంటీమీటర్ల కోత అవసరమయ్యే సందర్భాల్లో 0 - 0.5 సెంటీమీటర్ల సైజులో 3 లేక 4 కోతలతో ఈ సర్జరీ చేసే వీలుంది. ఇంత చిన్న పరిమాణంలోని కోతతో సర్జరీ చేస్తారు కాబట్టి సర్జరీ జరిగిన రోజే రోగి ఇంటికి వెళ్లిపోవచ్చు. కోత కూడా త్వరగా మూసుకుపోతుంది. నొప్పి, రక్తం పోవడం, హెర్నియా, కుట్ల తాలూకు మచ్చలు ఈ సర్జరీతో ఉండవు. సర్జరీ చేసే ప్రదేశాన్ని మాగ్నిఫయింగ్‌ లెన్స్‌తో పెద్దదిగా చేసి, మానిటర్‌లో చూస్తూ కణితిని కచ్చితంగా, విజయవంతంగా తొలగించే వీలుంది. సర్జరీ తర్వాత రేడియేషన్‌, కీమోథెరపీలు రోగి వయసు, కేన్సర్‌ దశ, కేన్సర్‌ రకాలను బట్టి కొంత కాలం పాటు అవసరం అవుతాయి. కొన్ని కేన్సర్‌ వ్యాధుల విషయంలో మొదట కీమోథెరపీ, రేడియేషన్‌లు తర్వాత సర్జరీ చేయవలసి రావచ్చు. 


రాడికల్‌ హిస్టరెక్టమీతో పాటు పొట్టకు సంబంఽధించిన అనేక కేన్సర్లకు, చిన్న, పెద్ద పేగు కేన్సర్లకు, మూత్రాశయం, మూత్రపిండాలు, అండాశయ కేన్సర్లకు కూడా కీహోల్‌ సర్జరీలు చేయగలుగుతున్నారు. సర్జరీ తదనంతర రేడియేషన్‌ కూడా ఈ రకం సర్జరీలు జరిగిన రెండు లేదా మూడు రోజుల్లోనే మొదలుపెట్టవచ్చు. ట్రీట్మెంట్‌ నిర్థారించడానికి కూడా కొన్ని సందర్భాల్లో కేన్సర్‌ సర్జరీలు అవసరం అవుతాయి. కొన్నిసార్లు కేన్సర్‌ చికిత్స పూర్తయిన తర్వాత బయట కనిపించే భాగాలను సరిచేయడానికి కూడా సర్జరీలు అవసరమవుతాయి. 


కేన్సర్‌ సర్జరీలో రకాలు...

ప్రివెంటివ్‌ సర్జరీ: పెద్దపేగు చివరి భాగంలో కణితులను కేన్సర్‌ లక్షణాలు లేకున్నా సర్జరీతో తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రొమ్ము కేన్సర్‌ ఉంటే, జీన్‌ మ్యుటేషన్‌ పరీక్షతో కేన్సర్‌ సంక్రమించే అవకాశాన్ని నిర్థారించి, మాస్టెక్టమీతో రొమ్మును తొలగిస్తారు. పాప్‌స్మియర్‌ పరీక్షలో తేడాలుంటే గర్భాశయాన్ని తొలగిస్తారు. 

క్యురేటివ్‌ సర్జరీ: తొలి దశలో చేసే సర్జరీ లేదా రేడియేషన్‌, కీమోథెరపీ.. లేదా ఆ రెండు చికిత్సల తర్వాత సర్జరీ చేస్తారు.

పాలియేటివ్‌ సర్జరీ: కేన్సర్‌ చివరి దశలో నాణ్యమైన జీవనాన్ని అందించడం కోసం సర్జరీతో కణితి సైజును తగ్గించి, చికిత్స అందిస్తారు. 

రిస్టొరేటివ్‌ లేదా రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ: కేన్సర్‌తో తొలగించిన రొమ్ము, నోటికి సంబంధించిన, హెడ్‌ అండ్‌ నెక్‌ కేన్సర్ల సర్జరీలు జరిగినప్పుడు అవయవాల పనితీరు మెరుగు కోసం చేసే సర్జరీ ఇది. 

డాక్టర్‌ సి.హెచ్‌ మోహన వంశీ,చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.ఫోన్‌: 9848011421

Updated Date - 2021-03-02T06:06:10+05:30 IST