Abn logo
Sep 27 2021 @ 02:27AM

చిన్నారులపై కేన్సర్‌ పడగ!

దేశంలో ఏటా 10 లక్షల కేన్సర్‌ కేసులు..

ఇందులో 50 వేల మంది పిల్లలు

8 2-14 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువ

8 3వ దశలో ఉన్నా స్వస్థతకు అవకాశం 


హైదరాబాద్‌ సిటీ, న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పిల్లలు అకస్మాత్తుగా బరువు తగ్గారా? తలనొప్పి, వాంతులు చేసుకుంటున్నారా? ఇంకేమైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇవి వివిధ రకాల కేన్సర్ల లక్షణాలు కావొచ్చునని, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు. ఇటీవల పిల్లల్లో కేన్సర్‌ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 2-14 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా కేన్సర్ల బారినపడుతున్నారు.


మనదేశంలో ఏటా 10 లక్షల కేన్సర్‌ కేసులు నమోదవుతుంటే ఇందులో 50వేల మంది పిల్లలు ఉంటున్నారు. లక్షణాలను ఆలస్యంగా గుర్తిస్తున్నారని, 2వ, 3వ దశలో వైద్యుల వద్దకు తెస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. గతంలో వైద్యానికొచ్చే పిల్లల్లో ఒకట్రెండు కేసులు వెలుగుచూసేవని, ఇప్పుడు పదుల సంఖ్యల్లో కనిపిస్తున్నాయంటున్నారు. అవగాహన తక్కువగా ఉండటం, ఆలస్యంగా వ్యాధి నిర్ధారణ వల్ల కేన్సర్‌ ఉన్న పిల్లలు అడ్వాన్స్‌ దశలోకి వెళుతున్నారు. 


ఎందుకు పెరుగుతున్నాయి! 

గతానికి భిన్నంగా బాల్యం తాలూకు సహజ ప్రవర్తనకు పిల్లలు దూరమవుతున్నారని, ఆ మేరకు వారిలో శారీరక శ్రమ లోపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలం పిల్లలకు ఆటాపాటలు లేవు, ఓ వారంలో గంట  సమయాన్ని కూడా ఆటలకు కేటాయించడం లేదు. ఆహారపు అలవాట్లలోనూ మార్పొచ్చింది. దీంతో అధిక బరువు పెరగడంతో కేన్సర్‌ వంటి జబ్బులు దరి చేరుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ పిల్లల్లో కేన్సర్లు

చిన్న వయసులో సీయూఎన్‌ఎస్‌ ట్యూమర్లు, రెటినోబ్లాస్టోమా, లుకేమియా, లింఫోమా్‌సలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూరోబ్లాస్టోమా విల్మ్‌ ట్యూమర్‌,  బోన్‌ ట్యూమర్‌, ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్‌ సార్కోమా, రాబ్డోమియా సార్కోమా వంటి ఇతర కేన్సర్లు బారిన పడుతున్నారు. పిల్లల కేన్సర్లలో అయిదు శాతం మాత్రమే జన్యుపరమైనవి. వ్యాధిని ముందుగానే గుర్తించడం, పిడియాట్రిక్‌ ఆంకాలజి్‌స్టతో ప్రొటోకాల్‌ ఆధారిత చికిత్సను చికిత్సను అందించడం వల్ల ముప్పును అధిగమించవచ్చు.


2వ, 3వ దశలోనే...

పిల్లల్లో కేన్సర్‌ గుర్తించడం కొంచెం కష్టమే. పిల్లలు చెప్పలేకపోవడం, తల్లిదండ్రులు కూడా గుర్తించపోవడం వల్ల కేసులు తీవ్రమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు అయితే పిల్లల్లో  కేన్సర్లను త్వరగా నయం అవుతుందన్నారు. పిల్లలే కేన్సర్‌ చికిత్సకు బాగా సహకరిస్తారని చెప్పారు. 3వ దశలో వచ్చిన పిల్లల్లోనూ కేన్సర్‌ నయం చేయడానికి అవకాశముందని వైద్యులు తెలిపారు.


ఏడేళ్లలో 13 లక్షలకు పైగా కేన్సర్‌ కేసులు

 జాతీయ కేన్సర్‌ నమోదు కార్యక్రమం (ఎన్‌సీఆర్పీ) కింద 2012-19 మధ్య దేశవ్యాప్తంగా 96 ఆస్పత్రుల్లో 13,32,207 కేన్సర్‌ కేసులు నమోదయ్యాయి. 

 కేన్సర్‌ కేసులు పురుషుల్లోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. 2012-19 మధ్య ఎన్‌సీఆర్పీ కింద నమోదైన కేన్సర్‌ రోగుల్లో 52.4 పురుషులు, 47.6 శాతం మహిళలు ఉన్నారు. 

 కేన్సర్‌ కేసుల్లో పొగాకు వినియోగం వల్ల వస్తున్న కేన్సర్లే ఎక్కువ. ఇవి పురుషుల్లో 48.7శాతం, మహిళల్లో 16.5 శాతం ఉన్నాయి. 

 నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ ఇన్మరేటిక్స్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీడీఐర్‌) నివేదిక ప్రకారం 2012-19 మధ్య దేశంలో కేన్సర్‌ కేసుల్లో పురుషుల్లో తల, మెడ ప్రాంతంలో పుట్టిన కేన్సర్లు దాదాపు మూడోవంతు (31.2 శాతం) ఉన్నాయి.

 మహిళల్లో వెలుగుచూస్తున్న కేన్సర్లలో సగానికన్నా మించి (51శాతం) రొమ్ము కేన్సర్లు సహా గైనకాలజీకి సంబంధించిన కేన్సర్లు ఉన్నాయి. థైరాయిడ్‌ కేన్సర్లు, గాల్‌ బ్లాడర్‌ కేన్సర్లు పురుషులకన్నా మహిళల్లోనే ఎక్కువగా ఉన్నాయి. 

 ఊపిరితిత్తుల కేన్సర్లు పురుషుల్లో 49.2 శాతం, మహిళల్లో 55.5 శాతం ఉన్నాయి. గాల్‌ బ్లాడర్‌ కేన్సర్లు పురుషుల్లో 40.9 శాతం, మహిళల్లో 45.7 శాతం ఉన్నాయి. 

 అన్ని రకాల కేన్సర్‌ రోగుల్లో 7.9శాతం పిల్లలే ఉన్నారు. ఈ మేరకు 0-14 ఏళ్లలోపు వారిపై దేశంలో ఆస్పత్రుల ఆధారిత కేన్సర్‌ రిజిస్ట్రీస్‌-2021 క్లినిక్‌పాథలాజికల్‌’ ప్రొఫైల్‌ ఆఫ్‌ కేన్సర్‌’ వెల్లడించింది. 


ఈ లక్షణాలు కనిపిస్తే 

పిల్లల్లో చేతులు, పాదాల చివరి భాగాల్లో అసాధారణ గడ్డ, లేదా వాపు ఉండటం, కంట్లో తెల్లని ప్రతిబింబం ఏర్పడటం, ముఖం చాలా ఎక్కువగా పాలిపోయినట్లుగా ఉండటం, శరీరంలో ఒకే ప్రాంతంలో నొప్పి కొనసాగడం, కుంటుతూ నడవడం, తరచుగా తలనొప్పి , వాంతులు, ఆకస్మికంగా దృష్టిలోపం, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే అప్తమత్తమవ్వాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు  చేయించాలి. 

- డాక్టర్‌ పి. విజయ్‌ కరణ్‌ రెడ్డి, 

అంకాలజిస్టు, అపోలో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌