కేన్సర్‌ను ఆదిలోనే అడ్డుకుందాం!

ABN , First Publish Date - 2020-05-05T16:26:32+05:30 IST

కేన్సర్‌ మహమ్మారి చేతిలో, కొద్ది రోజుల తేడాలోనే... ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌... ఇద్దరు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు! ఇర్ఫాన్‌కు డాక్టర్‌ నితేష్‌ రోహత్గీ, డాక్టర్‌ సెవంతీ లిమాయే అనే ఇద్దరు వైద్యులు చికిత్స చేశారు!

కేన్సర్‌ను ఆదిలోనే అడ్డుకుందాం!

ఆంధ్రజ్యోతి(05-05-2020):

కేన్సర్‌ మహమ్మారి చేతిలో, కొద్ది రోజుల తేడాలోనే... ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌... ఇద్దరు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు! ఇర్ఫాన్‌కు డాక్టర్‌ నితేష్‌ రోహత్గీ, డాక్టర్‌ సెవంతీ లిమాయే అనే ఇద్దరు వైద్యులు చికిత్స చేశారు! కేన్సర్‌ వ్యాధిని జయించే మెలకువలు, చికిత్సల గురించి ఆ ఇద్దరు వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం!



సమర్థమైన చికిత్సలున్నాయి!

న్యూరోఎండోక్రైన్‌ కేన్సర్‌తో మరణించిన ప్రముఖుల జాబితాలో ఇర్ఫాన్‌ ఖాన్‌తో పాటు, యాపిల్‌ సంస్థ వ్యవస్థాపకులు స్టీవ్‌ జాబ్స్‌ కూడా ఉన్నారు. ఈ రకం కేన్సర్ల తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. ఇందుకు కారణాలు, చికిత్సల గురించి వైద్యులు ఏమంటున్నారంటే....


‘‘ఎండోక్రైన్‌ ట్యూమర్లు మెదడుతో పాటు, చిన్న పేగులు, ఊపిరితిత్తులు, పురీషనాళాల్లో కూడా తలెత్తుతాయి. రొమ్ము, ఇతర కేన్సర్లకు అనుబంధంగా కూడా ఈ రకం కేన్సర్లు తలెత్తే వీలూ ఉంది. అయితే కేన్సర్‌ గడ్డ పరిమాణం మూలంగా కొన్ని నిర్దిష్ట లక్షణాలు బయల్పడుతూ ఉంటే, ఆ కణుతులు ఏర్పడిన వినాళగ్రంథులు విడుదల చేసే స్రావాల ప్రభావంతో మరికొన్ని లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. దాంతో ఈ రకం కేన్సర్‌ చివరి దశల వరకూ కనిపెట్టలేని పరిస్థితి నెలకొని ఉంటోంది. ఇలా జరగకుండా ఉండాలంటే లక్షణాలు ఎలాంటివైనా, లోతైన పరీక్షలు చేయించుకోవడం అవసరం. లక్షణాలు, పరీక్షల ఆధారంగా కేన్సర్‌ తీవ్రతను అంచనా వేసి చికిత్స చేయవలసి ఉంటుంది. చికిత్సలో భాగంగా కేన్సర్‌ కణితి, సంబంధిత లింఫ్‌ గ్రంధులను సమూలంగా తొలగించడంతో పాటు, కేన్సర్‌ వ్యాధి తిరగబెట్టకుండా నియంత్రించే విధానం అనుసరించాలి.  చికిత్సలో అత్యంత ప్రభావవంతమైనది టార్గెటెడ్‌ థెరపీ. కేన్సర్‌ కణాలను సూటిగా నాశనం చేయగలిగే ఈ థెరపీలో దుష్ప్రభావాలూ తక్కువే! కాబట్టి కేన్సర్‌ను తొలి దశలోనే కనిపెట్టి, ప్రభావవంతమైన చికిత్సను అందించగలిగితే, ఎండోక్రైన్‌ కేన్సర్‌ను సమర్థంగా తుదముట్టించవచ్చు’’ 


- డాక్టర్‌ ఎన్‌. గీతా నాగశ్రీ

సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, హైదరాబాద్‌



పొగాకు ప్రాణం తీస్తుంది!

ఇర్ఫాన్‌ ఖాన్‌ మంబయ్‌లోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ ఆస్పత్రిలో అంతిమ చికిత్స తీసుకున్నారు. అక్కడ ఆయనకు ప్రముఖ ఆంకాలజిస్ట్‌, డాక్టర్‌ సెవంతి లిమాయే కేన్సర్‌ చికిత్స అందించారు. తల, మెడకు సంబంధించిన కేన్సర్లలో నిపుణురాలైన డాక్టర్‌ సెవంతి ఆయా కేన్సర్ల నియంత్రణ, చికిత్సల గురించి విలువైన సూచనలు ఇస్తున్నారు. 


‘‘తల, మెడకు సంబంధించిన కేన్సర్లు ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న అత్యంత సాధారణ కేన్సర్లలో ఆరో స్థానంలో ఉన్నాయి. మన దేశంలో ఎక్కువ శాతం కేన్సర్‌ కారక మరణాలు నోటి కేన్సర్లకు సంబంధించినవే! ఈ కేన్సర్‌ స్త్రీపురుషుల్లో సమానంగా ఉంటోంది. నోటి కేన్సర్లలో 85శాతం కేన్సర్లకు కారణం పొగాకు వాడకం! పొగాకు నమలడం, ధూమపానం, అతిగా మద్యం సేవించడం లాంటి అలవాట్లన్నీ తల, మెడకు సంబంధించిన కేన్సర్లకు దారి తీస్తాయి. ఏ రూపంలో ఉన్న పొగాకు వాడకమైనా ప్రాణానికి హానికరమే! కాబట్టి పొగాకు వాడకాన్ని మానుకోవాలి. అలాగే ఆ అలవాటు ఉన్నవాళ్లు... దంతవైద్యులు లేదా ముక్కు, చెవి, గొంతు నిపుణులు, లేదా తల, మెడకు సంబంధించిన నిపుణులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు, లేదంటే ఆరు నెలలకు తప్పనిసరిగా వైద్యులను కలిసి, నోటిని పరీక్షించుకుంటూ, కేన్సర్‌ పుండ్లు తలెత్తుతూ ఉన్నాయేమో కనిపెడుతూ ఉండాలి. నోటి కేన్సర్లను ఎంత త్వరగా గుర్తిస్తే, అంత తక్కువగా కోత పడే వీలు ఉంటుంది. ఓరల్‌ కేవిటీ కేన్సర్లకు తొలి చికిత్స సర్జరీ ఒక్కటే! ప్రారంభంలో పడే చిన్న కోతతో జీవిత నాణ్యత మరింత దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. తొలి దశలో గుర్తించిన కేన్సర్లు పూర్తిగా నయమై, జీవితకాలం పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ప్రధానంగా పొగాకు వాడకం మానేయాలి. తరచుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కేన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించాలి. చివరి దశలో గుర్తించిన కేన్సర్లకు కీమోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ, కాంప్రహెన్సివ్‌ జీనోమిక్‌ ప్రొఫైలింగ్‌లను కలిపి చికిత్స చేసే వీలుంది. బయోమార్కర్ల ఆధారంగా ఎవరికి ఎలాంటి చికిత్స సత్ఫలితం ఇస్తుందో ఎంచుకునే వెసులుబాట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.’’ 


- డాక్టర్‌ సెవంతీ లిమాయే

కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, ముంబయ్



కూకటివేళ్లతో పెకలించే వీలుంది!

2012లో డాక్టర్‌ నితేష్‌ భారత క్రికెట్‌ జట్టు మెడికల్‌ టీమ్‌లో కీలక సభ్యులు. ఆ సమయంలో భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు రెండు ఊపిరితిత్తుల మధ్య జెర్మ్‌ సెల్‌ కణితి తలెత్తి, కేన్సర్‌గా మారింది. యువరాజ్‌కు అమెరికాలో కేన్సర్‌ చికిత్స అందించి, ఆయన పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడ్డారు డాక్టర్‌ నితేష్‌. కీమోథెరపీకి యువరాజ్‌ చక్కగా స్పందించారనీ, ఆత్మస్థైర్యంతో వ్యవహరించారనీ కొనియాడారు. తాజాగా హిందీ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌కు కూడా నితేష్‌ అమెరికాలో కేన్సర్‌ చికిత్సను అందించారు. రొమ్ము కేన్సర్‌, నాడీ సంబంధ కేన్సర్‌ చికిత్సలో నిష్ణాతుడైన డాక్టర్‌ నితేష్‌ కేన్సర్‌ వ్యాధి గురించి పలు సందర్భాల్లో విలువైన సమాచారాన్ని అందించారు.


‘‘రొమ్ములో చిన్న రబ్బరు బంతిలా చేతికి తగిలే గడ్డలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆ గడ్డ రోజులు, లేదంటే వారాల వ్యవధిలో పెరుగుతున్నా కేన్సర్‌ గడ్డగా అనుమానించాలి. రొమ్ము కేన్సర్‌ చికిత్సలో ఎంతో పరిణతి పొందాం. రొమ్ము కేన్సర్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించే వీలుంది. రొమ్ముకు కేన్సర్‌ సోకితే పూర్తిగా తొలగించే మాసెక్టమీ, పాక్షికంగా తొలగించే లంపెక్టమీలతో కేన్సర్‌ నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. అయితే కొందరికి సర్జరీతో పాటు, కీమోథెరపీ, రేడియేషన్‌, హార్మోన్‌ థెరపీలు అవసరం పడతాయి. చికిత్స పెరిగేకొద్దీ దుష్ప్రభావాలూ పెరుగుతాయి. అయితే వైద్యుల సలహాలు, సూచనలు క్రమం తప్పక పాటిస్తూ, వారి పర్యవేక్షణలో మసలుకుంటే ఈ దుష్ప్రభావాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో రొమ్ము కేన్సర్‌ 50 ఏళ్లు దాటిన తర్వాతే తలెత్తుతుంది. అయితే అంతకంటే ముందే ఎర్లీ ఏజ్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ కూడా రావచ్చు. కాబట్టి టీనేజ్‌లోకి అడుగు పెట్టింది మొదలు, మెనోపాజ్‌కు చేరుకునే వయసు వరకూ ప్రతి మహిళా రొమ్ములను స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబంలో, లేదా వంశంలో రక్త సంబంధీకులకు కేన్సర్‌ ఉంటే, రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. 


స్క్రీనింగ్ తప్పనిసరి!

రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లను ముందుగానే గుర్తించే స్ర్కీనింగ్‌ పరీక్షలు ఉన్నాయి. మామోగ్రామ్‌, పాప్‌స్మియర్‌ అనే ఈ రెండు పరీక్షలతో కేన్సర్లను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. ఇలా ప్రారంభంలోనే గుర్తిస్తే, చికిత్స కాలం, దుష్ప్రభావాల తీవ్రత తగ్గుతాయి. కేన్సర్‌ను పూర్తిగా నయం చేసే అవకాశాలూ పెరుగుతాయి!’’


- డాక్టర్‌ నితేష్‌ రోహత్గీ,

ఆంకాలజిస్ట్‌, న్యూఢిల్లీ

Updated Date - 2020-05-05T16:26:32+05:30 IST