Abn logo
Sep 28 2021 @ 11:47AM

కేన్సర్‌ గుట్టు జన్యువుల్లో...

ఆంధ్రజ్యోతి(28-09-2021)

దర్జీ ఎవరి శరీర కొలతలకు తగ్గట్టు, వారికి దుస్తులు కుడతాడు. అలాంటిది... కేన్సర్‌ విషయంలో రోగులందర్నీ ఒకే గాటన కట్టేసి....ఒకే వైద్య విధానం అనుసరించడం ఎంతవరకూ సమంజసం?వ్యాధి విస్తరణకు కారణాలు, కేన్సర్‌ తత్వాలను బట్టి చికిత్స చేయడం అవసరం.డిఎన్‌ఎ సీక్వెన్సింగ్‌, ట్యూమర్‌ ప్రొఫైలింగ్‌ లాంటి విధానాలతో కూడిన... ‘ప్రెసిషన్‌ మెడిసిన్‌’ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.ఈ అత్యాధునిక చికిత్సా విధానాలతో...కేన్సర్‌పై సంపూర్ణ విజయం సాధించే రోజులు మరెంతో దూరంలో లేవు అంటున్నారు...ప్రఖ్యాత కేన్సర్‌ నిపుణులు, డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు! ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.


డాక్టర్‌ దత్తాత్రేయుడు నోరి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు గడించిన ఆంకాలజిస్ట్‌. మూడు దశాబ్దాలుగా న్యూయార్క్‌లోని కార్నెల్‌ మెడికల్‌ సెంటర్‌, ప్రొఫెసర్‌గా, ఆంకాలజీ  ఛైర్మన్‌, కేన్సర్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా దత్తాత్రేయుడు పలు బాధ్యతలను నిర్వహించారు. కేన్సర్‌ చికిత్సలో కొత్త విధానాలను రూపొందించి, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక కేన్సర్‌ రోగులకు తోడ్పడ్డారు. కేన్సర్‌ చికిత్సలో చేసిన కృషికిగాను అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ ఆయనను మోస్ట్‌ డిస్టింగ్విష్‌డ్‌ ఫిజీషియన్‌’ అవార్డుతో సత్కరించింది. వైద్యరంగానికి ఆయన అందించిన సేవలకుగాను 2015లో భారత ప్రభుత్వం, దత్తాత్రేయుడిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.


కేన్సర్‌ మీద వైద్యుల పట్టు పెరిగింది. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొదటి దశలో గుర్తించి, నయమైపోతున్న కేన్సర్‌ కేసుల సంఖ్య ఎక్కువే! అయితే ప్రజల్లో కేన్సర్‌ పట్ల అవగాహన మరింత పెరగవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ ఎక్కువ శాతం రోగులు వ్యాధి చివరి దశల్లో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితి  వైద్యపరమైన ప్రగతికి ఆటంకంగా మారుతోంది. అయితే కేన్సర్‌లో అద్భుతమైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.


అయినప్పటికీ కేన్సర్‌కు శాశ్వత అడ్డుకట్ట వేయడంలో వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం, ఆరోగ్య విద్య లాంటివే ప్రధానం. మెరుగైన, నాణ్యమైన చికిత్సలది వాటి తర్వాతి స్థానం. అయితే కేన్సర్‌ రేసులో విజయం సాధించాలంటే, పెరిగే కేసులకు చికిత్స అందిస్తూ వెళ్లడానికి బదులుగా, కేన్సర్‌ విస్తృతిని నియంత్రించే మార్గం కనిపెట్టడం అవసరం. వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం, ఆరోగ్య విద్య... ఈ రెండే ఇందుకు తోడ్పడతాయి.


కేన్సర్‌ అడ్డుకట్ట కోసం ‘జీన్‌ సీక్వెన్సింగ్‌’

కేన్సర్‌కు సంబంధించిన మాలిక్యులర్‌ స్ట్రక్చర్‌ ఆధారంగా చికిత్స అందించే వైద్య విధానం మున్ముందు అందుబాటులోకి రానుంది. వంద మంది మొదటి దశ ఊపిరితిత్తుల కేన్సర్‌ రోగులందికీ కలిపి రెండు రకాల మందులు, కీమో థెరపీ ఇచ్చినప్పుడు, వాళ్లలో 60 మందికి చికిత్స ఫలితాన్నిస్తే, మిగతా 40 మందికి ఫలితం చూపించలేదు అనుకుందాం. అందరూ కేన్సర్‌ మొదటి దశలో, చిన్న కంతిని కలిగి ఉన్నప్పుడు సర్జరీ, కీమోథెరపీ, మందులతో వంద మందికీ చికిత్స సమాన ఫలితం చూపించాలి.


కానీ కొంతమందికే ఫలితం దక్కడానికి కారణం, వంద ట్యూమర్లలో ఒక్కో కంతీ తనదైన జెనెటిక్‌ మాలిక్యులర్‌ స్ట్రక్చర్‌ ఆధారంగా పెరగడమే! పరుగు పందెంలో ఒక్కో వ్యక్తి లక్ష్యాన్ని చేరుకునే సమయం, వాళ్లు పరిగెత్తిన వేగం మీద ఆధారపడి ఉన్నట్టుగా  కేన్సర్‌ పెరుగుదల కూడా, ఆ కంతి మాలిక్యులర్‌ సిగ్నేచర్‌ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టే కేన్సర్‌కు ఒకే రకమైన మంత్రం పని చేయదు. మాలిక్యులర్‌ స్ట్రక్చర్‌ ఆధారంగా చికిత్స అందించగలిగితే, అనుసరించబోయే చికిత్సా ప్రక్రియలు సదరు కేన్సర్‌ మీద ప్రభావాన్ని చూపించగలవో, లేదో ముందుగానే కనిపెట్టవచ్చు. జీన్‌ సీక్వెన్సింగ్‌... ఏ వ్యక్తికి ఎటువంటి కీమోథెరపీ ఫలితం చూపిస్తుందో, తప్పుడు కీమోథెరపీ రోగి మీద ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో తెలుపుతుంది. ఇలా జీన్‌ సీక్వెన్సింగ్‌ తోడ్పాటుతో, ప్రెసిషన్‌ ట్రీట్మెంట్‌లో భాగంగా చికిత్సను డిజైన్‌ చేసుకోవడం అవసరం.


జన్యు మార్కర్లను సరి చేయడం ద్వారా...

ఒక వ్యక్తికి అతని 50వ ఏట లంగ్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాన్ని జీన్‌ సీక్వెన్సింగ్‌తో ముందుగానే కనిపెట్టే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలనీ, సదరు వ్యక్తిని హెచ్చరించవచ్చు. ఊపిరితిత్తుల కేన్సర్‌ను నాల్గవ దశలో గుర్తించిన రోగి జీవిత కాలం ఎనిమిది నెలలకు మించదు.


అలాంటి రోగికి జన్యు పరీక్ష చేసి, అసహజంగా ఉన్న కేన్సర్‌ మార్కర్‌ను గుర్తించి, ఆ మార్కర్‌ను సరిచేసే నోటి మాత్రలు అందించడంతో, ఆ వ్యక్తి ఆయుష్షు పదేళ్లకు పైగా పెరిగింది. మరో సందర్భంలో నాల్గవ దశ ఊపిరితిత్తుల కేన్సర్‌ రోగికి అందించిన కీమో థెరపీ ఫలితం చూపించకపోగా దుష్ప్రభావాలను కలిగించింది. ఆ సందర్భంలో బయాప్సీ, జీన్‌ అనాలసిస్‌ చేసి, అసహజంగా ఉన్న జన్యువును కనిపెట్టాం. లంగ్‌ కేన్సర్‌ కారకం ఆ జన్యువే! దాన్ని సరిచేసే మందులు వాడడంతో వ్యాధి అదుపులోకి వచ్చేసింది. 


కేన్సర్‌కు జన్యువులే కారణమా?

కేన్సర్‌ వ్యాధిని ప్రేరేపిస్తున్నాయి కాబట్టి తప్పిదమంతా జన్యువులదే అనడం పొరపాటు. తప్పంతా దురలవాట్లతో ఆ జన్యువులను ప్రేరేపించే మనదే! మనం ఆ జన్యువులను ప్రేరేపించనంతకాలం అవి ఎటువంటి హాని కలిగించకుండా, నిద్రావస్థలోనే ఉంటాయి. నిజానికి శరీరాన్ని రోగగ్రస్థం చేసే ఎలాంటి కార్సినోజెనిక్‌ అయినా, కేన్సర్‌కు దారి తీస్తుంది. కాబట్టి కేన్సర్‌ కారకాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలి.


ఆహారశైలి, జీవనశైలి, అలవాట్లను ఆరోగ్యకరంగా అనుసరించడంలో అలసత్వం వహించినా, పరిమితి మీరినా కేన్సర్‌ జన్యువులు మేల్కొంటాయనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రతి విషయంలో పరిమితి పాటించాలి. గాలి నింపవలసిన ఊపిరితిత్తులను నికొటిన్‌తో నింపితే, కొత్తగా పుట్టే కణాలు చనిపోయి, ఉన్న కణాలు విచ్ఛిత్తి జరిగి ఊపిరితిత్తుల కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దురలవాట్లనూ, ఆహారపుటలవాట్ల విషయంలో పరిమితి పాటించాలి. కాబట్టి కేన్సర్‌కు జన్యువులు ఓ కారకం మాత్రమే! 


టార్గెటెడ్‌ ట్రీట్మెంట్‌, డిజైనర్‌ డ్రగ్స్‌

రోగి కేన్సర్‌ తత్వం, జన్యు నిర్మాణం ఆధారంగా ఎంచుకునే చికిత్సలో అనవసరపు మందులు, చికిత్సల వాడకం తగ్గుతోంది. మాలిక్యులర్‌ అనాలసిస్‌ ఫలితం ఆధారంగా ఎటువంటి మందులతో వ్యాధి అదుపులోకి వస్తుందో గ్రహించి, ఆ మందులనే అందించడం జరుగుతోంది. ఇది కేన్సర్‌ వైద్య చికిత్స సాధించిన ప్రగతి. ఇటువంటి చికిత్సా విధానం అంతటా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి సంప్రదాయ కీమోథెరపీతో కేన్సర్‌ అదుపులోకి రావడం లేదని గ్రహించినప్పుడు, సత్వరం ఆ చికిత్సను ఆపి, బయాప్సీని పునఃపరీక్షించి చికిత్సను మార్చుకోవడం అవసరం. కీమోథెరపీ... సాలిడ్‌ ట్యూమర్లకు, లింఫోమా, ల్యుకేమియాలకు సమర్థంగా పని చేయగలదు.


ముదిరినా నిలువరించవచ్చు

మొదటి, రెండవ దశ కేన్సర్లను పూర్తిగా నయం చేసే వీలుంది. మూడు, నాల్గవ దశ కేన్సర్లను పూర్తిగా నయం చేయలేకపోయినా, అవి మరింత పెరగకుండా నిలువరించే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మధుమేహం మాదిరిగా మందులు వాడుకుంటూ, నాణ్యమైన జీవితాన్ని గడిపే వీలుంది.


కేన్సర్‌ పంచ సూత్రాలు

కేన్సర్‌ వ్యాధికి కారణం కచ్చితంగా తెలియదు కాబట్టి, వ్యాధి వచ్చినా దాంతో సమర్థంగా పోరాడే రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచుకోవాలి. ఇందుకోసం ఈ పంచ సూత్రాలు పాటించాలి.


1. ఒత్తిడి దరిచేరనీయవద్దు: పరిమితమైన ఒత్తిడి వ్యాధినిరోధక వ్యవస్థను చేతనంగా ఉంచుతుంది. అయితే అది పరిమితికి మించితే ఇమ్యూనిటీ దెబ్బ తింటుంది. కాబట్టి వ్యాయామం చేయడం, స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయడం, నచ్చిన అభిరుచిలో నిమగ్నమవడం లాంటి ఒత్తిడిని తగ్గించే అలవాట్లు అనుసరించాలి.


2. నిద్ర ముఖ్యం: నిద్ర లోపంతో మెరుగైన ఆహారం, వ్యాయామాల ఫలం దక్కకుండా పోతుంది. నిద్రలో కణాలు తమను తాము మరమ్మతు చేసుకంటాయి. అలాంటి నిద్ర తగ్గితే, దాంతో పాటు వ్యాధినిరోధకశక్తి తగ్గి, తేలికగా రుగ్మతల బారిన పడతాం. నిద్ర విషయంలో సమయం, నాణ్యత రెండూ ముఖ్యమే! కంటి నిండా నిద్రతో ఇమ్యూనిటీకి చెందిన కణాల విధి నిర్వహణ మెరుగవుతుంది. కొత్తవీ, బలమైన కణాలు పుడతాయి. పాతవి అంతరిస్తాయి. కాబట్టి పగటి వేళ, నిద్రకు దూరం చేసే అంశాల అంతు చూసి, రాత్రికి కంటి నిండా నిద్రపోవాలి. ప్రతి రోజూ 6 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్ర పోవాలి.


3. మంచి ఆహారం: ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహించే శక్తిని జీర్ణవ్యవస్థ కోల్పోకుండా కాపాడుకోవాలి. పోషకాలు కలిగిన సమతులాహారం తీసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పెరుగు, ప్రొబయాటిక్‌ సప్లిమెంట్లు పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడతాయి.


4 వ్యాయామం: వ్యాయామంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్‌ఫెక్షన్లు, ఒత్తిడిలను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం 20 నిమిషాలకు తగ్గకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అవసరం.


5. విటమిన్‌ డి లోపం: డి విటమిన్‌ కోసం రోజూ శరీరానికి ఎండ తగలనిస్తూ ఉండాలి. చేపలు, చేప నూనెలు, గుడ్లను తీసుకుంటూ ఉండాలి.