మహిళా భద్రత మా బాధ్యత

ABN , First Publish Date - 2021-03-08T05:54:10+05:30 IST

మహిళల భద్రత తమ బాధ్యత అని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హిందూ కళాశాల కూడలి నుంచి పోలీసు అధికారులు, మహిళలు, విద్యార్థినులతో కలిసి లాడ్జి సెంటరు వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

మహిళా భద్రత మా బాధ్యత
క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొన్న డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీలు అమ్మిరెడ్డి, విశాల్‌గున్నీ

క్యాండిల్స్‌ ర్యాలీలో డీఐజీ త్రివిక్రమ వర్మ

గుంటూరు, మార్చి 7: మహిళల భద్రత తమ బాధ్యత అని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఆదివారం హిందూ కళాశాల కూడలి నుంచి పోలీసు అధికారులు, మహిళలు, విద్యార్థినులతో కలిసి లాడ్జి సెంటరు వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీసు కార్యాలయంలో అమెరికన్‌ అంకాలజీ ఆస్పత్రి వారి సహకారంతో క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ మహిళా భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఎవరికి ఎటువంటి సమస్య ఏర్పడినా డయల్‌ 100కు గానీ లేదంటే దిశ యాప్‌ ద్వారా గానీ సమాచారం ఇస్తే పోలీసులు సత్వరం స్పందించి చర్యలు తీసుకుంటారన్నారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రూరల్‌ జిల్లా పరిధిలో ఈ మూడు రోజుల్లో ఎక్కడైనా విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారి గానీ, సిబ్బందితో గానీ సెల్ఫీ ఫొటో లేదా వీడియో తీసి ఫేస్‌బుక్‌లోగానీ, ట్విట్టర్‌లో గానీ పోస్టు చేస్తే వారందరిలో ఒకరిని ఎంపిక చేస్తామన్నారు. వారిని ఒకరోజు అంతా ఓ పోలీసు ఉన్నతాధికారితో కలిసి ఆయన నిర్వహించే విధులు, బాధ్యతలు అన్నింటిని ప్రత్యక్షంగా తెలుసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు గంగాధరం, ఈశ్వరరావు, మనోహరరావు, డీఎస్పీలు సుప్రజ, జెర్సి ప్రశాంతి, సీతారామయ్య, రమణకుమార్‌, వెంకటేశ్వర్లుతోపాటు సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనూరాధ, ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థినులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:54:10+05:30 IST