మీడియాను నియంత్రించలేం

ABN , First Publish Date - 2021-05-04T07:45:48+05:30 IST

‘‘ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, న్యాయస్థానాల్లో వాదోపవాదాల సందర్భంగా వ్యక్తం చేసే అభిప్రాయాలను, న్యాయమూర్తుల పరిశీలనలను రాయవద్దని మీడియాను నియంత్రించలేం...

మీడియాను నియంత్రించలేం

  • కోర్టుల నైతిక స్థైర్యాన్నీ దెబ్బతీయలేం: సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, న్యాయస్థానాల్లో వాదోపవాదాల సందర్భంగా వ్యక్తం చేసే అభిప్రాయాలను, న్యాయమూర్తుల పరిశీలనలను రాయవద్దని మీడియాను నియంత్రించలేం. తీర్పులు లేదా ఆదేశాలు ఎంత ముఖ్యమో.. వాదోపవాదాలు కూడా అంతే ముఖ్యం. అదే సమయంలో, ప్రశ్నలు వేయకుండా సంయమనం పాటించాలంటూ ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైన హైకోర్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేం’’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుల్లో వాదోపవాదాలు స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షించింది. తమను ఉద్దేశించి మద్రాసు హైకోర్టు ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ఎన్నికల కమిషన్‌ చేసిన అభియోగాలను తమ తుది ఆదేశాల్లో పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రెండు రాజ్యాంగ సంస్థల మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. కోర్టుల్లో విచారణ సందర్భంగా చేసే వ్యాఖ్యలను రాయకుండా మీడియాను నిరోధించాలన్న ఎన్నికల కమిషన్‌ వినతి మరీ వాస్తవ దూరంగా ఉందని అభిప్రాయపడింది. దేశంలో కొవిడ్‌ కేసులు పెరగడానికి ఎన్నికల కమిషన్‌దే బాధ్యతని, ఈసీ అధికారులపై హత్య అభియోగాలు నమోదు చేయాలని ఇటీవల మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని తప్పుబడుతూ ఎన్నికల కమిషన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా హైకోర్టు ఆ వ్యాఖ్యలు చేసిందని, దానిని సరైన స్ఫూర్తితో తీసుకోవాలంటూ ఈసీ పిటిషన్‌ను జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం సోమవారం తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్‌ను అకారణంగా విమర్శించడంగా హైకోర్టు వ్యాఖ్యలను భావించవద్దని, చర్చలు సుదీర్ఘంగా సాగుతున్న సమయంలో ‘అప్రయత్నం’గా వాటిని చేసి ఉండవచ్చని, అందుకే, ఆదేశాల్లో ఆ వ్యాఖ్యలు పేర్కొనలేదని గుర్తుచేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కోర్టుల్లో జరిగే వాదనలను మీడియా వెల్లడిస్తుందని, ఈవిషయంలో దాన్ని అడ్డుకోలేమని వ్యాఖ్యానించింది.


కొవిడ్‌ నియంత్రణ మా పని కాదు: ఈసీ

ప్రభుత్వాలను ఎన్నికల కమిషన్‌ నిర్వహించడం లేద ని, కొవిడ్‌-19 నిర్వహణ దాని ప్రత్యేకాధికారం కాదని ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వ్యాఖ్యానించారు. దాంతో, ఎవరినీ ఎవరూ విమర్శించడం లేదని, ఎన్నికల కమిషన్‌ చాలా మంచి పని చేసిందని వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను సరైన కోణంలో అర్థం చేసుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.


Updated Date - 2021-05-04T07:45:48+05:30 IST