Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూడు చట్టాల రద్దుతో మురిసిపోలేం!

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఈ మధ్య ఒక యూనివర్సిటీ సెమినార్ జరిగింది. దేశవ్యాప్త రైతుల ఉద్యమంతో చట్టాలు రద్దు చేశారు సరే, మరి కొనసాగుతున్న వ్యవసాయ కుటుంబాల సంక్షోభానికి పరిష్కారం ఏమిటి? ఏ విధానాలు అవసరం? అనే ప్రశ్న చాలామంది నుంచి వచ్చింది. పరిష్కారం పేరుతో ప్రభుత్వాలు తీసుకువచ్చే ఏ ఒక్క చట్టమో, లేదా విధానమో అన్నిసార్లూ సమస్యలను పరిష్కరించకపోగా, కొన్ని సందర్భాలలో సమస్యలను మరింత పెంచుతున్నాయి. ఈ ప్రక్రియలో వనరులు చేతుల్లో ఉన్నవాళ్ళు బాగుపడుతున్నారు, లేనివాళ్ళు నలిగిపోతున్నారు. అందుకే ఏ ప్రభుత్వమైనా సమస్యల పరిష్కారంలో రాజ్యాంగబద్ధ పాలనను, సామాజిక న్యాయాన్ని, పర్యావరణ స్పృహను ప్రాతిపదికగా ఉంచుకోవాలి. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలూ వీటిని మర్చిపోయాయి కనుకనే రైతులు వ్యతిరేకించారు. 


వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి నిజమైన చర్యలు తీసుకోవాలంటే ముఖ్యంగా మూడు దశల్లో ప్రభుత్వాల మద్దతు అందాలి. పంటల ఉత్పత్తికి ముందు దశలోను, ఉత్పత్తి దశలోను, మార్కెటింగ్ దశలోను– ఈ మూడు దశల్లోనూ సమస్యలు వేరువేరుగా ఉన్నప్పుడు పరిష్కారాలు కూడా వేరువేరుగా ఉండాలి కదా. కేంద్ర చట్టాలు మొదటి రెండు దశలనూ పట్టించుకోకుండా, మూడవ దశకు సంబంధించి కొన్ని సమస్యలకు తప్పుడు పరిష్కారాలను ప్రతిపాదించాయి. అందుకు కూడా రైతులు వ్యతిరేకించారు.


గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధికి అత్యంత కీలకమైన వనరులు భూమి, అడవులు. ఈ వనరులు వ్యవసాయాన్ని, అటవీ ఉత్పత్తుల సేకరణను జీవనోపాధిగా ఎంచుకుందామని భావిస్తున్న కోట్లాదిమంది స్థానిక ప్రజలకు హక్కుగా అందుబాటులో ఉండాలి. ఉదాహరణకు 2011లో విడుదలైన సామాజిక, ఆర్థిక, కులగణన నివేదిక ప్రకారం తెలంగాణ గ్రామీణ జనాభాలో సగంమందికి ఒక్క సెంటు కూడా సాగుభూమి లేదు. భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని ఇవ్వడానికి 2014లో విడుదలైన జీవో నంబర్ 1, రాష్ట్రంలో 3 లక్షల దళిత కుటుంబాలకు అసలు భూమి లేదని స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక కూడా ఈ విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది. కానీ భూమి లేని పేదలకు సాగు భూములను అందించడానికి 1973 భూ గరిష్ట పరిమితి చట్టం కూడా అమలు కావడం లేదు.


అడవులపై ఆదివాసీలకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పూర్తి హక్కులు లభించనే లేదని పోడు రైతుల బాధలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సాగుభూమి అందుబాటులో లేని కారణంగానే రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఎటువంటి మద్దతు, సహాయమూ అందక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రోజూ వార్తలు చూస్తున్నాం. కానీ కౌలురైతుల హక్కుల కోసం 1956, 2011లో వచ్చిన చట్టాలను ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదు. 1977 అసైన్డ్ భూముల రక్షణ చట్టమూ అమలు కాక, లబ్ధిదారుల చేతుల్లోంచి, ఆ భూములు జారిపోవడమూ చూస్తున్నాం. పంటల ఉత్పత్తికి ముందు దశలో గ్రామీణ ప్రజలకు న్యాయం చేయాల్సిన ఈ చట్టాలు అమలు కాక గ్రామీణ రైతులు సంక్షోభంలో ఉన్నారు. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు ఈ అంశాలను ప్రస్తావించను కూడా లేదు. 


పంటల ఉత్పత్తి దశలో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందడం లేదు. పంటల సాగుకు అవసరమైన సంస్థాగత పెట్టుబడి అందడం లేదు. సస్యరక్షణకు అవసరమైన సూచనలు కూడా ప్రభుత్వ విస్తరణ వ్యవస్థ నుంచి అందుతున్నది తక్కువ. నష్టం జరిగినప్పుడు తట్టుకోవడానికి పంటల బీమా పథకాలు అమలు కావడం లేదు. తీవ్ర నష్టాలు జరిగినప్పుడు అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీలు కూడా అందడం లేదు.


పంట కోత అనంతర దశలో రైతులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో లేవు. రైతులకు న్యాయమైన ధరలు అందడం లేదు. ఈ అన్ని కారణాల వల్లా రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో దిగబడుతున్నాయి. కాలం గడిచిన కొద్దీ ఆర్థిక, మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. రైతుల బలవన్మరణాలు పెరగడానికి ఇదే కారణం. కేంద్రం రూపొందించిన మూడు చట్టాలూ ఈ సమస్యలను ఏ మాత్రం ప్రస్తావించకపోగా, సరైన పరిష్కారాలనూ సూచించలేదు. పైగా ఈ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మౌనంగా ఉంటున్నాయి లేదా కొన్ని పథకాలను తప్పుడు పద్ధతుల్లో అమలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. 


ఈ నేపథ్యంలో 2020 జూన్ 6 నుంచీ మూడు చట్టాలు ఉనికిలోకి రాక ముందు వ్యవసాయ కుటుంబాలలో ఉన్న సంక్షోభ పరిస్థితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ సంక్షోభ నివారణకు నిర్ధిష్ట పరిష్కారాలు వెతకాల్సి ఉంది. ప్రభుత్వాలు ఆ పరిష్కారాలకు అవసరమైన చర్యలు చేపట్టేలా రైతు ఉద్యమం కొనసాగాల్సి ఉంది. 


గ్రామీణ, ఆదివాసీ ప్రజల హక్కులకు హామీ పడే అవసరమైన అన్ని చట్టాలను అమలు చేస్తూ, ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధ పాలన అందించాలి. అంతే కాదు - ‘I’ అనే ఇంగ్లిష్ అక్షరంతో ప్రారంభమయ్యే 7 చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేపడితే, ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. 1. ఐడెంటిటీ – గ్రామీణ, ఆదివాసీ ప్రాంత రైతులను మిగిలిన సమాజంలోని పౌరులతో సమానంగా గౌరవించడం. వ్యవసాయంలో వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు, పోడు, మహిళా, అసైన్డ్ రైతులను గుర్తించడం. వ్యవసాయ కూలీలను కూడా వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న శక్తిగా గుర్తించడం. 2) ఇండిపెండెన్స్ – రైతులకు కూడా స్వాతంత్ర్యం ఉందని అంగీకరించడం. నియంత్రిత, నియంతృత్వ పద్ధతులతో కాకుండా, వారి జీవితాలతో బంతాట ఆడుకోకుండా వ్యవహరించడం. ఆంతర్జాతీయ మార్కెట్ల నుంచి అడవి జంతువుల వరకూ, దళారీల నుంచి ప్రభుత్వ అధికారుల వరకూ రైతుల స్వేచ్ఛా స్వాతంత్ర్యం హరిస్తున్న దశలో రైతులు కూడా మనుషులనే స్పృహను కలిగి ఉండడం. 3) ఇన్ఫర్మేషన్ – రైతులకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి అందుబాటులో ఉంచడం. నష్టం చేసే తప్పుడు సమాచారం ఆధారంగా రైతులు నిర్ణయాలు తీసుకోకుండా, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో సహా, అన్ని విషయాలపై వారికి అవసరమైన శిక్షణలు ఇవ్వడం. 4) ఇన్వెస్ట్‌మెంట్ – రైతుల వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి సకాలంలో అందించడం. బ్యాంకుల నుండి వడ్డీ లేని పంట రుణాలతో పాటు, వాస్తవ సాగుదారులకే రైతుబంధు సహాయం అందించడం. మారిన పరిస్థితులకు అనుగుణంగా నూతన సబ్సిడీ పథకాలను రూపొందించి అమలుచేయడం. 5) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ – గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో వ్యవసాయానికి, పశుపోషకులకు అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయడం. గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, డ్రయ్యింగ్ యార్డులు, పొలాల మధ్య దారులు, పొలం చెరువులు లాంటివి నిర్మించడం, ప్రాసెసింగ్ యూనిట్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం. 6) ఎన్‌కం సెక్యూరిటీ – ఉద్యోగులకు మాదిరిగానే, వ్యవసాయ కుటుంబాలకు కూడా ఆదాయభద్రత కల్పించడం లక్ష్యంగా పని చేయడం. సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్ధతు ధరలను ప్రకటించి, వాటికి చట్టబద్ధత కల్పించడం, ఆవసరమైన ప్రత్యేక సందర్భాలలో నేరుగా నగదు బదిలీ పథకాలు అమలుచేయడం. 7) ఇన్సూరెన్స్ – అకాల, అనారోగ్య మరణాలు సంభవిస్తున్న దశలో కేవలం భూమి యజమానులకే కాకుండా, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల మొత్తం కుటుంబాలకు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న దశలో కేవలం కొన్ని పంటలకే కాకుండా అన్ని పంటలకు, పశువులకు, పనిముట్లకు సమగ్ర బీమా పథకాలను అమలుచేయడం.


ఇలా చట్టబద్ధ పాలనతో పాటు, ప్రతి సంవత్సరం బడ్జెట్టులో అవసరమైన నిధులు కేటాయించి ఈ ఏడు చర్యలనూ ప్రభుత్వాలు అమలు చేయగలిగితే చాలా వరకూ వ్యవసాయ కుటుంబాలు సంక్షోభం నుంచి బయటపడతాయి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Advertisement
Advertisement