Abn logo
Sep 25 2021 @ 00:22AM

మోకాళ్లతో నడిచినా, మోచేతులతో అంబాడినా నా ప్రజలను కొనలేరు

వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

- చెక్కులతో పాటు కత్తులు ఇచ్చి కేసీఆర్‌ నన్ను పొడవమంటున్నాడు

- సీఎం సీటు కోసం కాదు... నిరుద్యోగుల కోసం ప్రశ్నించా...?

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌


వీణవంక, సెప్టెంబరు 24: మోకాళ్లతో నడిచినా, మోచేతులతో అంబాడినా నా ప్రజలను కొనలేరు.. సీఎం సీటు కోసం కాదు.. నిరుద్యోగుల కోసం ప్రశ్నించానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్‌ తిప్పని సమ్మయ్య తన అనుచురులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ చెక్కులతో పాటు కత్తులు ఇచ్చి కేసీఆర్‌ నన్ను పొడవమంటున్నాడని అన్నారు. ఉద్యోగాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఐకేపీ సెంటర్లు ఉండాలని ప్రశ్నించానన్నారు. పొద్దున్నే నా భార్య ఒక మాట అడిగింది. నీ చుట్టూ తిరిగే వాళ్లు లేకుండా చేశారు. ఇక డ్రైవర్‌ను కూడా ఉంచరట అని అన్నది. అది సరే నిన్నన్న ఉంచుతారా లేదా అని అడిగానని ఈటల అన్నారు. ఇక్కడ అడ్డా పెట్టిన మంత్రి హుకుం జారీ చేస్తున్నాడని ఇంకా ఈటల రాజేందర్‌ వెంబడి తిరిగేవాళ్లు ఉంటున్నారు. అందరినీ తీసుకురండి అంటున్నారని అన్నారు. ఆత్మగౌరవానికి వెలకట్టి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వాళ్లు కొన్నట్లు భావిస్తున్నారు. మనవాళ్లు అమ్ముడు పోయినట్లు నటిస్తున్నారన్నారు.  నా పోరాటం ఒక్కడి కోసం కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ పోరాటమన్నారు. ఈ పోరాటం మన బతుకు సమస్య అన్నారు. కేసీఆర్‌ పథకాల పేరుతో మీకు చెక్కుతో పాటు కత్తి కూడా ఇస్తున్నారు. ఆ కత్తితో ఈటల రాజేందర్‌ను పొడవమని చెబుతున్నారు. కత్తితో పొడుస్తారో.. కడుపులో పెట్టుకొని మీ బిడ్డను ఆశీర్వదిస్తారో మీరే తేల్చాలని అన్నారు. మహిళల మీద నిజంగానే ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు వడ్డీ లేని రుణాలతో పాటు హుజూరాబాద్‌లో ఇచ్చే ప్రతి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలన్నారు. టీఆర్‌ఎస్‌ది 20ఏళ్ల చరిత్ర అయితే అందులో 18ఏళ్లు నాది ఉంది. నన్ను మధ్యలో వచ్చి మధ్యలో పోయిన అంటున్నారు. అది వాళ్లకే తెలియన్నారు. కులాల ప్రయోగం చేస్తూ ఓ మామూలు వాన్ని పెట్టి నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారన్నారు. నిరుద్యోగుల కోసం కొట్లాడిన, మాట్లాడిన నేనేనని, నిరుద్యోగభృతి 3,016ఇస్తానని ఇచ్చావా అని ప్రశ్నించారు. ఎవరి జాగాలో వారికి వాళ్లు కట్టుకొనే జీవో ఇవ్వమని అడిగిన. వడ్లు కొనమని అడిగి చివరికి మంత్రిగా కాకపోయినా మనిషిగా చూడమని అడిగినందుకే భూములు లాక్కున్నాడని నిందలు వేశారన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరి దగ్గరనైనా ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే నా ముక్కు నేలకు రాస్తానన్నారు. వారికి ఎదరు లేకుండా పోయింది వారు చెప్పిందే వేదం అయిపోయింది. ప్రశ్నించే వారు లేరని భావిస్తున్నారు కానీ అడగడానికి నేనున్నానన్నారు. కేసీఆర్‌ ఇచ్చే డబ్బులు ఆయనవి కావు అవన్నీ మన డబ్బులే. ఎన్ని ఇచ్చినా తీసుకోండి కానీ ధర్మం తప్పకండన్నారు. సోషల్‌ మీడియాలో నా అన్నలు, అక్కలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే వారి కాళ్లు మొక్కాలనిపిస్తుందన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ధర్మం వైపు ఉండి తనకు మద్దతు ఇవ్వా లన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, నాయకులు మారముల్ల కొంరయ్య, పరిపాటి పవన్‌రెడ్డి, మడ్గూరి సమ్మిరెడ్డి, పుప్పాల రఘు, ఐలవేని కుమార్‌, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, వివిధ కుల సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.