ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నా.. నీరసం తగ్గేదెలా?

ABN , First Publish Date - 2020-05-09T16:25:07+05:30 IST

నా వయసు 40. బరువు 78 కేజీలు. లాక్‌డౌన్‌ మొదట్లో హుషారుగా పనులన్నీ చేసుకున్నాను. కానీ నెమ్మదిగా బద్దకం పెరుగుతూ వస్తోంది. ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా శక్తి ఉండడం లేదు. ఎక్కువ సమయం పడుకునే ఉంటున్నా.

ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నా.. నీరసం తగ్గేదెలా?

ఆంధ్రజ్యోతి(09-05-2020)

ప్రశ్న: నా వయసు 40. బరువు 78 కేజీలు. లాక్‌డౌన్‌ మొదట్లో హుషారుగా పనులన్నీ చేసుకున్నాను. కానీ నెమ్మదిగా బద్దకం పెరుగుతూ వస్తోంది. ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా శక్తి ఉండడం లేదు. ఎక్కువ సమయం పడుకునే ఉంటున్నా. అలా అని పనిపైన ఆసక్తి తగ్గలేదు. కానీ నీరసంగా ఉంటోంది. ఎండ వల్ల ఇలా అవుతోందా? నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నా ఉపయోగం కనిపించడం లేదు. నీరసం తగ్గి, శక్తి రావడానికి ఆహారం సూచించండి. 


వత్సల, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కండరాల బలహీనత ఉన్నట్టు అనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో శారీరక వ్యాయామం తక్కువ కావడం వల్ల ఈ మార్పు జరగవచ్చు. దీనిని కండరాల బలహీనత(సర్కపెనియా) అంటారు. శరీరంలో కొవ్వు పెరగడం, కండరాలు తగ్గిపోవడం జరుగుతుంది. సర్కపెనియా సాధారణంగా వయసు పైబడిన వారిలో వస్తుంది. 70 ఏళ్లు పైబడిన వారికి రోజు వారి పనులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే 30 నుంచి 60 ఏళ్లు ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కండరాల బలహీనత రాకుండా చూసుకోవచ్చు.


ఆహారంలో ప్రోటీన్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలి. కండరాల నిర్మాణానికి ప్రోటీన్‌ ముఖ్య పోషకం. పప్పు దినుసులు, మాంసాహారం, గుడ్లు, చేపలను ఏదో ఒక పూట ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వే ప్రోటీన్‌ సప్లిమెంట్‌ కూడా తీసుకోవచ్చు.


విటమిన్‌ - డి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కండరాలు బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుడ్డు పచ్చసొనలో, పుట్టగొడుగుల్లో, ఆవు నెయ్యి, వెన్న, నూనె పదార్థాల్లో ఉంటుంది. విటమిన్‌ - డి సమృద్ధిగా లభించాలంటే ఉదయాన్నే 20 నిమిషాల పాటు  ఎండలో ఉండటం మంచిది.


ఒమెగా కొవ్వులు తీసుకోవడం వల్ల శరీర కొవ్వుశాతం తగ్గుతుంది. కండరాల గ్రోత్‌కు ఉపకరిస్తుంది. చేపలు, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో ఒమెగా కొవ్వులు ఉంటాయి. 


ప్రోటీన్‌ను తీసుకుని సరైన రీతిలో ఉపయోగించుకోపోతే కొవ్వుగా మారుతుంది. ప్రోటీన్‌ సరిగ్గా ఉపయోగపడాలంటే తగినంత వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. కీళ్లలో రాపిడి తగ్గుతుంది. కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటే కావలసినంత శక్తి లభిస్తుంది. విటమిన్‌-డి ఎముకలను, కండరాలను గట్టిపరుస్తుంది. ఒమెగా కొవ్వులు కండరాల పెరుగుదలకు ఉపక రిస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కండరాల బలహీనతను దూరం చేసుకోవచ్చు.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్

drjanakibadugu@gmail.com


Updated Date - 2020-05-09T16:25:07+05:30 IST